Alluri Sitarama Raju: 'నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించను. కానీ, అల్లూరి సీతారామరాజు సాహసి. ఆయన ధైర్యం, త్యాగనిరతి, నిరాడంబరత ప్రశంసనీయమైనవి. ఆయన తిరుగుబాటుదారుడు కాదు, యువతకు ఆదర్శప్రాయుడు'... అల్లూరి దివికేగిన తరవాత.. తెలుగునాట పర్యటించిన మహాత్మా గాంధీ ఆయన పోరాట పటిమను గురించి తెలుసుకుని వ్యక్తం చేసిన అభిప్రాయమిది.
గాంధీ మహాత్ముడితో పాటు ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి తెగువను ప్రశంసించారు. ఆ రోజుల్లో అల్లూరి ఉద్యమం వెనక ఉన్న లక్ష్యాల గురించి ఈతరం వారు తప్పక తెలుసుకోవాలి. స్థానిక సంస్థల అభివృద్ధి, మద్యపాన నిషేధం, అందరికీ విద్య వంటి మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అల్లూరి ముందుకు సాగారు. గొప్ప నాగరికులమని చెప్పుకొంటూ అడవితల్లి బిడ్డలపై దురాగతాలకు పాల్పడి, ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్న బ్రిటిష్ పాలకులను ఎదిరించి- గిరిజనుల వ్యధను ఆదర్శనీయమైన పోరాట గాథగా మార్చిన అల్లూరి జీవితం స్ఫూర్తిదాయకమైనది. అందుకే ఆయన తెలుగు వారికి మాత్రమే పరిమితమైన స్వరాజ్య సమరయోధుడు కాదు. మాతృభూమి పట్ల అవ్యాజమైన ప్రేమాభిమానాలు కలిగిన భారతీయులందరికీ ఆరాధ్యుడు.
భారతదేశం స్వరాజ్యాన్ని సముపార్జించుకొని 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో నాటి స్వాతంత్య్ర సమరయోధుల అసమాన ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ, వారి దేశభక్తి, పరాక్రమం, త్యాగనిరతులను స్మరించుకుంటూ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను నిర్వహించుకొంటున్నాం. చరిత్రలో మహోన్నత స్థానం పొందిన ఎందరో మహనీయులతో పాటు చరిత్ర పుస్తకాల్లో కనిపించని, విస్మరించజాలని వీరులనూ స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. అలాంటి మహనీయుల్లో ఒకరైన విప్లవ యోధుడు, మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్నిని రగిలించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నేడు. 1897 జులై నాలుగో తేదీన జన్మించిన అల్లూరిని- తెలుగువారితో పాటు కర్ణాటక, ఒడిశా ప్రజలు మన్యం వీరుడిగా, విప్లవ జ్యోతిగా కీర్తించారు. అల్లూరి అనుసరించింది విప్లవ మార్గమే అయినా, అది ప్రజల బాగును కోరిన సంక్షేమ బాటగా నేను భావిస్తాను.
గిరిజనులకు అండ:మద్రాసు ప్రెసిడెన్సీలోని విశాఖపట్నం-గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో 1922-24లో 'రంప' తిరుగుబాటును అల్లూరి ముందుకు నడిపిన తీరు మరువలేనిది. బ్రిటిష్ వారు గిరిజనుల సంప్రదాయ వ్యవసాయ పద్ధతులపై ఉక్కుపాదం మోపే దారుణమైన నిర్ణయాలతో మొదలు పెట్టి- వారిని పలు రకాలుగా దోపిడి చేయడాన్ని అల్లూరి తీవ్రంగా వ్యతిరేకించారు. అచంచల ఆత్మ విశ్వాసం, నిబద్ధతలతో బ్రిటిష్ వారి అన్యాయాలను ఎదిరించి పోరాడేలా గిరిజనులను ప్రేరేపించారు. దాంతో అటవీ ప్రాంతంలో అల్లూరి కదలికల విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది.
ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అల్లూరి, తన తండ్రి అకాల మరణంతో పాఠశాల విద్యకు దూరం కావలసి వచ్చింది. యుక్తవయసులో సాగిన ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ నాసిక్, గంగోత్రి, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న చిట్టగాంగ్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు తీర్థయాత్రల దిశగా ప్రేరేపించింది. వలస పాలనలో తోటి భారతీయులు పడుతున్న కష్టాలు.. ప్రధానంగా ఆదివాసుల సామాజిక-ఆర్థిక పరిస్థితులు ఈ సుదీర్ఘ యాత్రల్లో ఆయనను కదిలించాయి. ఆయన గమనాన్ని మార్చివేశాయి. విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లోని ఆదివాసీ ప్రాంతాలను తన నివాసంగా చేసుకున్న సీతారామరాజు- పేదరికంతో ఛిద్రమవుతున్న గిరిజన వర్గాల విద్య, సాధికారత కోసం కృషి చేయడం ప్రారంభించారు. బ్రిటిష్ పోలీసులు, అటవీ-రెవిన్యూ అధికారుల చేతుల్లో నిరంతరం వేధింపులకు గురవుతున్న గిరిజన సంఘాలకు దన్నుగా నిలబడ్డారు. బ్రిటిష్ అధికారులపై ప్రత్యక్ష పోరాటానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
తాను నాయకుడిగా నిలబడి బలమైన అనుచరుల బృందాన్ని నిర్మించి, వారిని సైతం నాయకులుగా మలిచారు. రంప తిరుగుబాటు సమయంలో ఆయన చూపిన శౌర్య పరాక్రమాలు నాటి జానపద గాథల్లో భాగమై, ప్రజల్లో స్ఫూర్తిని రేకెత్తించాయి. ఈ అసామాన్య తిరుగుబాటుకు అల్లూరి రెండేళ్లపాటు నాయకత్వం వహించారు. ఈ దాడులకు భీతావహులైన బ్రిటిష్ పాలకులు సీతారామరాజును, ఆయన అనుచరులను పట్టుకోవడానికి మలబార్ నుంచి ప్రత్యేక సైనిక దళాలను పిలిపించారు. చివరికి 1924 మే ఏడో తేదీన అల్లూరి సీతారామరాజు దివికేగారు. భారత స్వరాజ్య వీరుల నడుమ ప్రకాశవంతమైన విప్లవ నక్షత్రమై వెలుగులీనారు. ‘రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయిక ప్రజన్/ దోచు పర ప్రభుత్వమును దోచిన రాజుల చిన్నవాడ! వీ/ రోచితమైన తావక మహోద్యమమాంధ్ర పురా పరాక్రమ/ శ్రీ చరణమ్ములందు విరజిమ్మె నవారుణ విప్లవాంజలుల్’ అంటూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి- అల్లూరికి పద్య పంక్తులతో అంజలి ఘటించారు.