తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'మహా' సంకీర్ణంలో సునామీ- త్వరలో కుప్పకూలే దిశగా! - మహారాష్ట్ర సంకీర్ణం

మహారాష్ట్రలో కొలువుదీరిన మూడుపార్టీల సర్కారు త్వరలోనే కూలిపోనుందా? భాజపా వంటి బయటి శక్తుల ప్రభావం లేకుండానే ప్రభుత్వం పడిపోనుందా? సంకీర్ణ ధర్మం కనుమరుగవడం వల్ల ఠాక్రే పీఠానికి బీటలు వారుతున్నాయా? పరిస్థితులను పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రిపై అసంతృప్తి, నిర్ణయాల్లో మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. వంటి ఎన్నో పరిణామాలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

All is not well in Maharashtra
'మహా' సంకీర్ణంలో సునామీ- త్వరలో కుప్పకూలే దిశగా!

By

Published : Jul 8, 2020, 2:16 PM IST

"మహారాష్ట్రలో ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నింస్తోందన్న ప్రశ్నే లేదు. వారికున్న స్వాభావిక వైరుద్ధ్యాల కారణంగా ఇప్పుడు కాకపోతే కొద్దిరోజుల తర్వాతైనా ప్రభుత్వం దానికదే కూలిపోతుంది."

ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సోమవారం చేసిన వ్యాఖ్యలివి. మహారాష్ట్రలో కొలువుదీరిన మూడు పార్టీల ప్రభుత్వాన్ని గద్దెదించడానికి భాజపా ఇదివరకు చేసిన ప్రయత్నాలు, వేసుకున్న ప్రణాళికలు, బెదిరింపులకు ఈ వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

భాజపా ప్రణాళికలు ఎలా ఉన్నా.. ఫడణవీస్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవం కాదు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంకీర్ణ పక్షాల మధ్య ఆది నుంచి అభిప్రాయభేదాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం బాగానే ఉందని అస్తమానం చెప్పుకుంటున్నా... అంతర్గతంగా పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నట్లు తెలుస్తోంది.

పవార్-ఠాక్రే భేటీ

ఫడణవీస్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. కరోనా సమయంలో నేతలందరూ ప్రత్యక్షంగా కలిసేందుకు దూరంగా ఉంటుంటే పవార్ మాత్రం బాంద్రాలోని మాతోశ్రీ(ఠాక్రే నివాసం)లోనే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిణామాల వల్ల సాధారణంగానే ఈ సమావేశం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇరువురు నేతలు చర్చించిన విషయాల గురించి అధికారికంగా వెల్లడించనప్పటీకీ.. ముంబయిలో 12 మంది డీసీపీల బదిలీ అంశంపైనే వీరు మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

బదిలీల సమస్య

గతవారం ముంబయి కమిషనర్ ఈ బదిలీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్​సీపీ నేత, హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​ను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శివసేన వెంటనే అప్రమత్తమైంది. సీఎంను విస్మరించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. చివరకు బదిలీ ఆదేశాలు రద్దు చేస్తున్నట్లు 24 గంటల్లోపే ప్రకటన వెలువడింది.

సోమవారం ఉద్ధవ్-పవార్​ మధ్య జరిగిన సమావేశంలో అనిల్ దేశ్​ముఖ్​ సైతం ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని అనిల్​కు సూచించినట్లు సమాచారం.

ఇంకా ఎన్నెన్నో..

అయితే బదిలీల విషయంపై మాత్రమే చర్చ జరిగిందనేది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చాలా సమస్యలున్నాయి. నాలుగు రోజుల క్రితమే.. అహ్మదాబాద్​లోని స్థానిక శివసేన కౌన్సిలర్ పార్టీ నుంచి వైదొలగి ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో ఎన్​సీపీలో చేరారు. తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు రెండు రోజుల తర్వాత.. ఠాణె జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్​సీపీని కాదని భాజపాకు మద్దతిచ్చింది శివసేన. గొప్పగా చెప్పుకునే సంకీర్ణ పక్షాల 'ధర్మం' ఇక్కడ పూర్తిగా కనుమరుగైపోయింది.

సమన్వయం లేని సంకీర్ణం!

ఈ సంకీర్ణ పక్షాల మధ్య సరైన సమన్వయం లేదని ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ఏదో రూపంలో బయటపడుతూనే ఉంది. ఇప్పుడు రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ముఖ్యమంత్రి విషయంలోనే కాంగ్రెస్, ఎన్​సీపీ మంత్రుల నుంచి ప్రధానంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే తమకు అరుదుగా కలిసే అవకాశాలు ఇస్తారని, తమను నమ్మకస్తులుగా పరిగణించరనే ఆరోపణలు మొదలయ్యాయి.

జూన్ చివరి వారంలో ఇదే విషయాన్ని కాంగ్రెస్ మంత్రులు బహిరంగంగానే వెల్లడించారు. ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ కోరామని, మంత్రాలయ(సచివాలయం)కు రాకపోవడం వల్ల తామే మాతోశ్రీకి వెళ్లి కలిశామని మీడియాలో చెప్పుకున్నారు.

అనుభవం లేని అధికారం

ఉద్ధవ్​ ఠాక్రే పరిపాలన విషయాల్లో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో పాల్గొనకపోవడం, ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు నిర్వహించకపోవడం వల్ల పూర్తిగా బ్యూరోక్రాట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు ఉద్ధవ్​ మంత్రివర్గం మొత్తం తలపండిన రాజకీయనేతలతో నిండిపోయింది. ఓ మాజీ ముఖ్యమంత్రి, ముగ్గురు మాజీ ఉపముఖ్యమంత్రులు సహా చాలా మంది అనుభవజ్ఞులైన నాయకులు ప్రభుత్వంలో ఉన్నారు.

ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రికి, కేబినెట్ సహచరుల మధ్య సమస్యగా మారింది. జూన్​ నెలలో ఓ సంద్భంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్​బల్​ ప్రభుత్వ ప్రతిపాదనలపై కేబినెట్ మీటింగ్​లో అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ సెక్రెటరీ తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రతిపాదనలను పంపించారని వాటిని తిరస్కరించారు. చివరకు ఆ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇతర మంత్రుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ విషయాలను బహిరంగంగానే మీడియా ముందు చెప్పేస్తున్నారు మంత్రులు.

విశ్రాంత చీఫ్ సెక్రెటరీ అజోయ్ మెహతాకు మూడోసారి పదవి పొడిగింపు చేయడం కూడా వివాదాస్పదంగా మారింది.

కరోనా విషయంలోనూ నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన ఆంక్షలను తరచుగా మార్చడం వల్ల పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంటోంది. నివాస స్థలం నుంచి రెండు కిలోమీటర్లు దాటి ఎవరూ తిరగొద్దని గతవారం ముంబయి పోలీసులు జారీ చేసిన ఆదేశాలపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తం కావడం వల్ల గంటల వ్యవధిలోనే ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. గత మూడు నెలల వ్యవధిలో ఇలా ఆదేశాలు ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు అనేకసార్లు జరిగాయి. దీనిబట్టి రాజకీయ అధినేతకు బ్యూరోక్రసీపై పూర్తి నియంత్రణ లేదనే భావన విస్తృతమైంది.

తగ్గినట్లే తగ్గి..

ఈ కారణాల వల్ల కాంగ్రెస్, ఎన్​సీపీ మెహతాను కొనసాగించేందుకు విముఖత చూపించాయి. చివరకు ఉద్ధవ్​ ఠాక్రే వెనక్కి తగ్గారు. కొత్త సీఎస్​ను నియమించారు. అదే సమయంలో సంకీర్ణ పక్షాల మాటలను విస్మరించి మెహతాను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియమించారు.

'అబ్బే.. మేం బాగానే ఉన్నాం!'

ఇలా ఎన్నో సమస్యలతో సంకీర్ణ భాగస్వాములందరూ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం పడిపోతుందని వస్తున్న వదంతులను నెట్టుకొస్తున్నారు. ఎన్​సీపీ భాజపాకు మద్దతు ఇస్తుందనో.. శివసేన మళ్లీ కమలం గూటికి చేరుతుందనే ఊహాగానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం పడిపోతుందా లేదా అని ప్రజలు పందెం వేసుకుంటున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. అయితే ఠాక్రే ప్రభుత్వం దృఢంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన శరద్ పవార్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్న విషయాలకే ప్రభుత్వాలు కూలిపోవని బుధవారం తన పత్రిక సామ్నాలో వ్యాసం ప్రచురించింది శివసేన. మహావికాస్ అఘాడీలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని చెప్పుకొచ్చింది.

ఏదేమైనా ప్రభుత్వం చాలా అస్థిరతలో ఉంది. తమ ప్రభుత్వం బాగానే ఉందని నేతలంతా పదేపదే చెప్పడంలోనే ఈ విషయం అర్థమవుతోంది. కచ్చితంగా చెప్పాలంటే మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం సాధారణంగా లేవు.

(రచయిత- రాజేంద్ర నరహర్​ సాఠే, సీనియర్ పాత్రికేయులు)

ఇదీ చదవండి-షాకింగ్​ న్యూస్​: భారత్​లో రోజుకు 2.87లక్షల కేసులు!

ABOUT THE AUTHOR

...view details