వుహాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు చైనా ప్రకటించి దాదాపు ఆరునెలలు కావస్తోంది. అతి కొద్ది సమయంలోనే ఈ వైరస్ మహమ్మారిగా మారి- ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఈ తరహా జీవ సంక్షోభాల నుంచి రక్షణ పొందాలంటే టీకాయే శరణ్యమని ప్రపంచ దేశాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ‘ది వ్యాక్సిన్ అలయన్స్’ సీఈఓ సెత్ బర్కిలీ ప్రపంచ ప్రజాజీవనం పూర్వస్థితికి రావాలంటే టీకా సరైన ఆయుధమన్నారు. కొవిడ్ టీకా వెలుగు చూడాలంటే దానికయ్యే వ్యయంతో పాటు సమయమూ కీలకమే. అధ్యయనం, ప్రి క్లినికల్, క్లినికల్ ట్రయల్స్ (మానవులపై జరిగే పరిశోధనలు), అనుమతులు, ఉత్పత్తి, పంపిణీలతో మిళితమైన సంప్రదాయ పద్ధతిలో ఒక టీకాకు రూపం రావాలంటే కనీసం 8 నుంచి 15 సంవత్సరాలు పడుతుందని గతానుభవాలు చెబుతున్నాయి. కొవిడ్ టీకా రాక ప్రపంచానికి అనివార్యం, అత్యవసరం అని డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించింది.
'ఆపరేషన్ వార్ప్ స్పీడ్'
ప్రస్తుత ఆత్యయిక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రయోగాలను వేగవంతంగా నిర్వహిస్తూ దగ్గర దారిలో గమ్యాన్ని చేరుకోవాలని ప్రపంచ దేశాలు పరిశోధనలను విస్తృతం చేస్తున్నాయి. 12 నుంచి 18 నెలల్లో లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతున్న ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు. ఒక క్రమ పద్ధతిలో కాకుండా, కలగాపులగంగా టీకాపై పరిశోధనలు నిర్వహించడం అనైతికం అని ప్రివెంటివ్ మెడిసిన్, వాండర్ బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌వంటి సంస్థల శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 2021 సంవత్సరం ఆరంభానికి అమెరికా లోని 300 మిలియన్ ప్రజలకు నాణ్యమైన కొవిడ్ టీకాను అందుబాటు లోకి తెచ్చేందుకు ‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్’ పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రణాళికను సిద్ధం చేశారు.
ఎవరెవరు ఏం చేస్తున్నారు?
కొవిడ్ వ్యాధి కారకమైన జెనెటిక్ కోడ్‌ని ‘సార్స్ కొవ్-2’గా చైనా ప్రకటించిన 63 రోజుల్లోనే మానవాళిపై పరిశోధనలు (హ్యూమన్ ట్రయల్స్) అమెరికాలోని సీటల్‌లో, చైనాలో ఆరంభమైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. దాదాపు 73 సంస్థలు తమ ప్రయోగాల ట్రాక్‌ను నమోదు చేసుకున్నట్లుగా తెలిపింది. అమెరికా, చైనా, యూకే, జర్మనీలాంటి దేశాల నుంచి ఎనిమిది సంస్థలు అత్యంత కీలకమైన క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకుని ముందు వరసలో ఉన్నాయి. ఈ దశ టీకా తయారీకి ఆయువు పట్టు. టీకా సమర్థత, భద్రతలు ఈ దశలోనే బహిర్గతం అవుతాయి. నాణ్యతపై సంతృప్తి చెందితే ఎఫ్‌డీఏ, యురోపియన్ ఏజెన్సీ లాంటి సంస్థలు టీకా తయారీకి అనుమతులు మంజూరు చేస్తాయి. డబ్ల్యూహెచ్‌ఓ నాణ్యతపై భరోసా కల్పించాల్సి ఉంటుంది. ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ పేరుతో ‘మోడర్నా’ అనే అమెరికా సంస్థ టీకా తయారీలో తలమునకలై ఉంది. ముప్పై వేల మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు జులైలో సన్నాహాలు చేసుకుంటున్నట్లు మోడర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టాల్ జాక్స్ తెలిపారు.
అక్టోబర్‌లో వచ్చేనా.?