తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భూతాపంతో.. జీవన్మరణ సంక్షోభం - Global Warming in the world

అభివృద్ధి పేరుతో నైట్రస్​ ఆక్సైడ్​ ఉద్గారాలతో భూతాపాన్ని సృష్టిస్తున్న పారిశ్రామిక దేశాల కారణంగా.. యావత్​ మానవాళి ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. ఈ ఉత్పాతం నుంచి గట్టెక్కాలంటే భూతాప వృద్ధిని క్రమంగా తగ్గించాలని నివేదికలు వెల్లడిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భూగోళంపై అధికస్థాయిలో వాయు కాలుష్యం ఏర్పడినట్టు గణంకాల్లో తేలింది. మానవాళి నేడు ఎదుర్కొంటున్న ఎన్నో అనర్థాలకు మూలం భూతాపమేనన్న స్పృహతో ప్రపంచమే దిద్దుబాట పట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. పుడమి తల్లికి తాపోపశమనం కలిగించే పటుతర కార్యాచరణతో తనవంతు సమర్థ పాత్రపోషణకు భారత్‌ సంసిద్ధం కావాల్సిన అవరసం ఏర్పడింది.

ALL COUNTREIS MUST TAKE CORRECTIVE ACTIONS TO REDUCE THE GLOBAL WARMING
జీవన్మరణ సంక్షోభం

By

Published : Nov 7, 2020, 7:31 AM IST

అద్భుత ప్రగతి పేరిట ప్రకృతి సమతూకాన్ని దారుణంగా దెబ్బతీసి బొగ్గుపులుసు వాయు ఉద్గారాలతో భూతాపం ప్రజ్వరిల్లజేసిన పారిశ్రామిక దేశాల పాపం, యావత్‌ మానవాళి పాలిట పెనుశాపంగా పరిణమించింది. మహోత్పాతం నుంచి గట్టెక్కాలంటే, ఈ శతాబ్ది చివరికి భూతాప వృద్ధిని పారిశ్రామికీకరణ ముందునాటి కన్నా రెండు డిగ్రీల సెల్సియస్‌ తక్కువకు కట్టడి చేయాలని ప్యారిస్‌ ఒడంబడిక ఉద్ఘోషిస్తోంది. గత ఎనిమిది లక్షల సంవత్సరాల్లో ఏనాడూ లేనంతటి గరిష్ఠ స్థాయిలో భూగోళమంతటా ఇప్పుడు మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, బొగ్గుపులుసు వాయువు పేరుకున్నట్లు గణాంకాలు చాటుతున్నా- దీటైన దిద్దుబాటు చర్యలు చతికిలపడటం తెలిసిందే.

'నెట్​ జీరో' తొలి అడుగు..

మహాసంక్షోభం ముంచుకొస్తున్నదన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరికల నేపథ్యంలో 2050నాటికి కర్బన ఉద్గార తటస్థత (నెట్‌ జీరో) సాధించడానికి ఐరోపా సంఘం(ఈయు)తోపాటు జపాన్‌, దక్షిణ కొరియా సన్నద్ధత చాటాయి. 2060 నాటికి తానూ ఆ స్థితికి చేరతానని చైనా ప్రకటించింది. తమ వంతుగా మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ కర్బన ఉద్గార తటస్థ హోదా సాధనకు నిబద్ధమైనట్లు వెల్లడించాయి. ప్యారిస్‌ ఒడంబడిక సాఫల్య వైఫల్యాల సమీక్ష 2023లో జరిగేదాకా స్వీయ ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలపై మార్పు లేదన్నది భారత ప్రభుత్వ విధానం. సరికొత్తగా టాటా, రిలయన్స్‌, మహీంద్రా, ఐటీసీ ప్రభృత 24 దేశీయ ప్రైవేటురంగ దిగ్గజ సంస్థలు నవసూత్ర ప్రణాళికతో 'నెట్‌ జీరో'కు కంకణబద్ధం కావడాన్ని కేంద్ర, పర్యావరణమంత్రి జావడేకర్‌ 'చరిత్రాత్మక'మని స్వాగతిస్తున్నారు. పారిశ్రామికంగా అత్యావశ్యక దిద్దుబాటు చర్యల అమలుకోసం ఆ సంస్థల చొరవ ప్రశంసనీయమే అయినా- సుదీర్ఘ ప్రస్థానంలో అది తొలి అడుగేనని చెప్పాలి. రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృఢసంకల్పంతో, పటిష్ఠ చట్టం దన్నుతో జాతీయ స్థాయిలో విస్తృత కార్యాచరణను పట్టాలకు ఎక్కిస్తేనే- బృహత్తర లక్ష్యాన్ని చేరగలిగేది!

పసిపిల్లల మరణానికీ కారణమిదే..

నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటివి సుమారు వందేళ్లపాటు వాతావరణంలో తిష్ఠవేసి విధ్వంసం కొనసాగిస్తూనే ఉంటాయి. తీవ్రమైన వడగాడ్పులు, దుర్భర శీతల పవనాలు, భయానక కాటకాలు, నగరాల్నీ ముంచెత్తుతున్న వరదలు... వీటన్నింటికీ భూతాపమే ప్రబల హేతువని అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నాయి. పసిపిల్లల అకాల మరణాల్లో 23 శాతానికి పర్యావరణ క్షీణతే ముఖ్యకారణమని ప్రపంచ బ్యాంకు నిర్ధారించింది. వాతావరణంలో అనూహ్య మార్పులవల్ల కొత్త వ్యాధులు ప్రబలుతాయని, ఆహారోత్పత్తి క్షీణిస్తుందని, కోట్లమంది నిరాశ్రయులవుతారన్న నిపుణుల హెచ్చరికలు అక్షర సత్యాలని ఇప్పటికే రుజువవుతోంది. హానికర ఉద్గారాల నియంత్రణ అన్నది కేవలం పరిశ్రమలకే పరిమితమైన అంశం కాదు. యథేచ్ఛగా చెట్ల నరికివేత, ప్లాస్టిక్‌ విపరీత వినియోగం, ఎక్కడికక్కడ వ్యర్థాల పారబోత... తదితరాలన్నింటిపైనా ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ కార్యాచరణతో కదలాలి. దీంతో ముడివడిన ఎన్నో సున్నిత, సంక్లిష్ట అంశాల్నీ చాకచక్యంగా పరిష్కరించాలి. ఉదాహరణకు- తయారీ, ప్యాకింగ్‌, సరఫరా వ్యవస్థల రూపేణా దేశవ్యాప్తంగా 80 లక్షలమందికి బాణసంచా వ్యాపారం కొన్నేళ్లుగా జీవనాధారమైంది.

నార్వే, స్వీడెన్​లు మెరుగు..

వారికి సరైన ప్రత్యామ్నాయమేదీ చూపకుండా, సొంతకాళ్లపై నిలబడేలా తోడ్పాటు అందించకుండా ఆ పరిశ్రమ కార్యకలాపాలమీద ఉక్కుపాదం మోపుతామంటే- మరో మానవ విషాదం తప్పదు. అటువంటివేమీ దాపురించకుండా జాగ్రత్తపడుతూ, పర్యావరణ పరిరక్షణపరంగా దేశదేశాల అనుభవాలనుంచి నేర్వాల్సిన విలువైన పాఠాలు ఎన్నో! నార్వే, స్వీడన్‌ వంటివి పౌర భాగస్వామ్యంతో కాలుష్య నియంత్రణ, అటవీ ఆచ్ఛాదన పెంపుదలలో రాణిస్తున్నాయి. ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, స్వీడన్‌, జపాన్‌ ప్రభృత దేశాలు వ్యర్థాల రీ-సైక్లింగ్‌లో కొత్తపుంతలు తొక్కుతున్నాయి. మానవాళి నేడు ఎదుర్కొంటున్న ఎన్నో అనర్థాలకు మూలం భూతాపమేనన్న స్పృహతో ప్రపంచమే దిద్దుబాట పట్టాల్సిన తరుణమిది. పుడమి తల్లికి తాపోపశమనం కలిగించే పటుతర కార్యాచరణతో తనవంతు సమర్థ పాత్రపోషణకు భారత్‌ సంసిద్ధం కావాలి!

ఇదీ చదవండి:సరిహద్దు వివాద చర్చల్లో చైనా గొంతెమ్మ కోర్కెలు..

ABOUT THE AUTHOR

...view details