AK 47 Invention History In Telugu :సాయుధ బలగాలు ఉపయోగించే ఆయుధాలు అనేకం ఉంటాయి. వీటిలో చాలావరకు మనకు తెలియవు. కానీ మీకు తెలిసిన ఓ తుపాకీ పేరు చెప్పండి?.. అంటే మాత్రం చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఏకే 47. దీనిని కలాష్నికోవ్ అని కూడా పిలుస్తారు. అలాంటి అత్యుత్తమ ఆయుధం చరిత్ర, దాని విశేషాలు మీకు తెలుసా? అలాంటి ఆయుధంతో తనకు గల అనుబంధాన్ని పంచుకున్నారు రిటైర్డ్ మేజర్ భరత్ సింగిరెడ్డి. సాయుధ బలగాలు, స్పెషల్ ఫోర్సెస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లో పనిచేసిన ఆయన.. అనేక రకాలైన ఆయుధాలను ఉపయోగించానని చెప్పారు. హెక్లర్, కోచ్ MP5 లాంటి ఆయుధాలు వాడినా.. ఏకే 47 మాత్రం తనను అన్నింటి కన్నా ఎక్కువ ఆకర్షించిందని తెలిపారు. తానే కాకుండా.. అనేక మంది సైనికులు ఏకే 47 ఆయుధాన్ని ఎంతో ఇష్టపడతారని వివరించారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా గుర్తింపు పొందిన, సైనికులు అధికంగా ఇష్టపడే ఆయుధం ఏకే 47 అని చెప్పుకొచ్చారు భరత్ సింగిరెడ్డి.
ఏకే 47 చరిత్ర
Major Bharath Cingireddy AK 47 Wikipedia : రష్యాకు చెందిన మాజీ లెఫ్టినెంట్ జనరల్ మైఖెల్ కలాష్నికోవ్.. ఏకే 47ను రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆయన.. తన దేశం ఆయుధాలను చూసి నిరాశ చెందారు. జర్మన్ ఆయుధాలతో పోల్చితే తన దేశ రైఫిల్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయని భావించిన కలాష్నికోవ్.. సరికొత్త ఆయుధాన్ని తయారు చేయాలని సంకల్పించారు. ఓ ట్రాక్టర్ మెకానిక్ షెడ్లో తన జీవితాన్ని ప్రారంభించిన కలాష్నికోవ్.. ఆ తర్వాత రెడ్ ఆర్మీలో ట్యాంక్ కమాండర్‌గా చేరారు. సైన్యంలో గాయపడిన ఆయన.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ అనేక ఆయుధాల గురించి పరిశోధన చేశారు. అనంతరం తన ఆలోచనలకు పదునుపెట్టి ఓ ఆయుధాన్ని తయారు చేశారు. 1947లో రష్యన్ సైన్యం.. మెరుగైన ఆయుధాల డిజైన్లు, ఆలోచనలు ప్రదర్శించడానికి ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో పాల్గొన్న కలాష్నికోవ్.. తాను తయారు చేసిన ఏకే 47ను అందులో ప్రదర్శించగా.. విజేతగా నిలిచారు. ఆ తర్వాత 1949లో ఏకే 47ను రష్యన్ సాయుధ దళాలకు ప్రామాణిక ఆయుధంగా గుర్తించింది.
AK 47 Specification :కేవలం రష్యాకు మాత్రమే కాదు.. అనేక దేశాల్లోని సాయుధ బలగాలు ఏకే 47ను ప్రధానంగా ఉపయోగిస్తాయి. దాదాపు 106 దేశాల్లోని సుమారు 10కోట్ల మంది సైనికులు దీనిని వినియోగిస్తారు. ఏకే 47 గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కఠినం, నమ్మకం, దృఢం. దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం.
సుదూర లక్ష్యాలను ఛేదిస్తుంది
ఏకే 47ను చాలా సులభంగా ఉపయోగించవచ్చు. దీని తయారీలో ఎలాంటి సంక్లిష్టమైన సాధనాలను వినియోగించరు. ఈ ఆయుధాన్ని సులభంగా శుభ్రం చేసుకోవడమే కాకుండా. రిపేర్లు చేసుకోవడమూ అంతే సులువు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా దీనిని సునాయాసంగా ఆపరేట్ చేయవచ్చు. ఏకే 47 సుదూర లక్ష్యాలను సైతం ఛేదిస్తుంది. దీంతో 100 మీటర్లు లేదా 400 మీటర్ల లక్ష్యాలను ఛేదించవచ్చు. దీనిని అడవులు, ఎడారులు, పర్వతాలు, మంచు.. ఇలా ఎలాంటి యుద్ధ క్షేత్రాల్లోనైనా ఆపరేట్ చేయవచ్చు. దీనిలోని అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్ (UBGL) లాంటి ఫీచర్‌తో గ్రెనేడ్‌ను ప్రయోగించవచ్చు.