జీవకోటికి ప్రాణాధారమైన గాలి విషతుల్యం అవుతోంది. నానాటికీ తీవ్రతరమవుతున్న వాయు కాలుష్యం పెద్దవారి నుంచి గర్భస్త శిశువుల వరకు అందరిమీదా ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 70 లక్షల మంది వాయుకాలుష్యం ప్రభావంతో మరణిస్తున్నారు. కోట్లాది ప్రజల ఆయుర్దాయం తగ్గిపోతోంది. ఇండియాలో 20 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఎనిమిది రాష్ట్రాల రాజధాని నగరాలను ఇటీవల పరిశీలించగా వాయుకాలుష్యం చాలా తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. దిల్లీలో వాయునాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు తేలింది. అక్కడ 2020 ఏప్రిల్ కంటే 2021 ఏప్రిల్‌లో నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్‌ఓ2) ఏకంగా 125 శాతం పెరిగింది! చలికాలంలో దిల్లీ నగరంలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కేజ్రీవాల్ సర్కారు తాజాగా 'శీతాకాల కార్యాచరణ ప్రణాళిక'ను ప్రకటించడం కొంత ఊరట కలిగించే విషయం. పంట వ్యర్థాలను, చెత్తను తగలబెట్టకుండా ఈ ప్రణాళిక ప్రత్యామ్నాయాలను సూచిస్తోంది. దిల్లీతో పాటు చెన్నై నగరంలోనూ కాలుష్యం 94శాతం పెరిగింది. ఏడాది వ్యవధిలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి బెంగళూరులో 90శాతం; హైదరాబాద్, ముంబయి నగరాల్లో 52; జైపూర్‌లో 47; లఖ్‌నవూలో 32శాతం చొప్పున పెరిగింది.
ఆయుర్దాయంపై ప్రభావం
వాయు నాణ్యత ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్యసంస్థ 2005 తరవాత తొలిసారిగా ఇటీవల సవరించింది. భారత్ పాత ప్రమాణాలకే ఆమడ దూరంలో ఉంది. ఇక కొత్త ప్రమాణాల ప్రకారం అయితే, మొత్తం దేశమంతా అత్యంత కలుషితంగానే ఉన్నట్లు లెక్క! వాయు నాణ్యతను ప్రధానంగా ఆరు అంశాల ఆధారంగా చూస్తారు. వాటిలో సూక్ష్మ ధూళి కణాలు (పర్టిక్యులేట్ మేటర్-పీఎం), ఓజోన్ (ఓ), నైట్రోజన్ ఆక్సైడ్ (ఎన్‌ఓ), సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్‌ఓ2), కార్బన్ మోనాక్సైడ్ (సీఓ) ఉంటాయి. ఇవన్నీ అత్యంత తక్కువ స్థాయిలోనే ఉన్నాయనుకున్నా- మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమే. వీటిలో దేనికి ప్రభావితమైనా, మెదడు సహా శరీరంలోని ప్రతి ఒక్క అవయవం దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. పీఎం 2.5 అంటే 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ధూళి కణాలు. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇవి మనిషి వెంట్రుకలో 30వ వంతు మందం మాత్రమే ఉంటాయి. వీటిని పీలిస్తే, నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్తప్రసరణ వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి. ఘనపు మీటరు పరిధిలో అయిదు మైక్రోగ్రాముల కంటే ఎక్కువ స్థాయిలో పీఎం 2.5 గాఢత ఉండకూడదన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా ప్రమాణం. 2005కు ముందు ఈ ప్రమాణం 10 మైక్రోగ్రాములుగా ఉండేది.
దీర్ఘకాలంపాటు పీఎం 2.5 కలుషితాలు పీలిస్తే గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, బ్రెయిన్‌స్ట్రోక్, ఇతర సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి, కుంగుబాటు సహా అనేక రకాల మానసిక సమస్యలకు సైతం ఈ వాయుకాలుష్యమే కారణం అవుతోంది. ఇంధనాలను మండించడం వల్ల సూక్ష్మ ధూళి కణాలు ఉత్పత్తి అవుతాయి. రవాణా సాధనాలు, ఇంధన వనరులు, ఇళ్లలోంచి, పరిశ్రమల నుంచి చివరకు వ్యవసాయం నుంచి సైతం ఇవి ఉత్పన్నమవుతాయి. ఇంటి బయట ఉత్పన్నమయ్యే వాయుకాలుష్యం క్యాన్సర్ కారకమని డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2019లో విడుదల చేసిన నివేదిక ప్రకారం- 2005 నాటి ప్రమాణాల మేరకు చూసినా ప్రపంచ జనాభా మొత్తం కలుషిత గాలినే పీలుస్తోంది. ఇండియాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో సగటున ప్రతి పౌరుడూ తన జీవితకాలంలో 2.5 నుంచి 2.9 సంవత్సరాలను కోల్పోతున్నాడు! కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన రెండో లాక్‌డౌన్‌లో పలు పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగడంతో వాయునాణ్యత మెరుగుపడలేదు. అమెరికా, ఐరోపాలలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.