కొన్ని మరణాలు అనివార్యం. ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు. మరికొన్ని మాత్రం అడ్డుకుంటే ఆగేవే. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారించదగ్గవే. కాలుష్య కారక మరణాలు ఈ కోవలోకే వస్తాయి. 2019లో దేశంలో 17.8 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం. కాలుష్య కోరల బారిన పడి 16.7 లక్షల మంది మృతి చెందినట్లు ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాల కారకాల్లో వాయు కాలుష్యం నాలుగో స్థానంలో నిలుస్తోంది. మొత్తం మరణాల్లో పన్నెండు శాతం వాటా దీనిదే. ఇలాంటి మరణాలన్నీ పరిహరించదగినవే. వాయుకాలుష్యంతో సంభవించే ప్రతి వ్యాధినీ నివారించవచ్చు. వాయు కాలుష్యం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ ఆరోగ్య సంక్షోభం. వాయు కాలుష్యం అనేది అదృశ్య హంతకి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే స్పష్టం చేస్తూనే ఉంది. దీని కారణంగా సంభవించే మరణాల రేటు లక్ష మందికి 86. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిశుభ్రమైన గాలికి సంబంధించిన పరిమితులకన్నా ఎక్కువ స్థాయుల్లో వాయు కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 92 శాతం ప్రపంచ జనాభా నివసిస్తోంది.
పెరుగుతున్న మరణాల రేటు
వాయు కాలుష్యం సాంక్రమిక వ్యాధులకు ఆజ్యం పోస్తోంది. గుండె వ్యాధుల్లో 20 శాతం వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నవే. ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మొత్తం మరణాల్లో 19 శాతానికి వాయుకాలుష్యమే కారణం. ఉబ్బసం ముప్పునూ అంతకంతకూ పెంచుతోంది. పొగాకు, మద్యం వినియోగం వంటివీ మరణాలకు కారణమయ్యేవే. ఇవన్నీ నివారించదగినవి. ఈ క్రమంలో మనుషులకు అంతులేని నష్టాన్ని కలగజేస్తున్న పొగాకు, మద్యం వ్యాపార సంస్థలను ప్రభుత్వాలు జవాబుదారీ చేయవెందుకనేది పెద్ద ప్రశ్న. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కూడా ఒకదానికొకటి సంబంధం కలిగినవే. ఇవి మనుషులకు ఆర్థిక నష్టాలను కలిగించడంతోపాటు ఆరోగ్యపరమైన ముప్పునూ పెంచుతుండటం ఆందోళనకరం. ప్రభుత్వాలు అత్యవసరంగా స్పందించి చర్యలు తీసుకునేలా మాత్రం కనిపించడం లేదు.
వాయుకాలుష్యం కారణంగా అకాల మరణాలతో తలెత్తే ఉత్పత్తి నష్టం 2019లో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలని లాన్సెట్ అధ్యయనం స్పష్టం చేసింది. భారత్‌లోని బలహీన ఆరోగ్య వ్యవస్థకు కొవిడ్ రూపంలో అదనపు సవాళ్లు ఎదురయ్యాయి. ఈ క్రమంలో బహుళరకాల అకాల వ్యాధులను ఎదుర్కొనే పరిస్థితి లేదు. ప్రాథమికంగా నివారించగలిగిన వ్యాధులతో ఎవ్వరూ బాధపడకూడదు. అదేవిధంగా చికిత్స చేయదగిన వ్యాధులతో ఏ ఒక్కరూ అకాల మరణం బారిన పడకూడదు.