తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Air Pollution: ఉసురు తీస్తున్న వాయుకాలుష్యం - వాయుకాలుష్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ

వాయు కాలుష్యంతో(Air Pollution) తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ- వాయు నాణ్యత మార్గదర్శకాలను 2021లో సవరించింది. వాయు కాలుష్య(Air Pollution news) ప్రమాణాలను కఠినతరం చేసింది. గాలిలోని అతి సూక్ష్మ ధూళి కణాలు- ఘనపు మీటరు పరిధిలో అయిదు మైక్రోగ్రాముల కంటే ఎక్కువ స్థాయిలో ఉండకూడదన్నది తాజా ప్రమాణం.

air pollution
వాయు కాలుష్యం

By

Published : Nov 15, 2021, 8:23 AM IST

వాయు కాలుష్యం(Air Pollution) మనుషుల్లో తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తోంది. వాతావరణ మార్పులకూ(Climate change) కారణభూతమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న మొత్తం జనాభాలో దాదాపు 90శాతం కలుషితమైన గాలినే పీలుస్తున్నారు. వాయు కాలుష్యం ఏటా ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది మరణాలకు దారితీస్తున్నట్లు అంచనా. ధూమపానం కంటే వాయు కాలుష్యంవల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. షికాగోలోని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం ప్రచురించిన శాస్త్రీయ పరిశోధన పత్రాల (2019) ప్రకారం వాయు కాలుష్యం- మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని, కణాన్ని దెబ్బతీస్తుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, మనోవైకల్యం, మూత్రాశయ క్యాన్సర్‌, ఎముకలు పెళుసుబారడం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది.

దీపావళికి అధికం

దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం(Air Pollution in delhi) ప్రమాదకర రీతిలో పెచ్చరిల్లింది. అక్కడ ఆత్యయిక పరిస్థితి నెలకొందంటూ సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం. కాలుష్యాన్ని త్వరితగతిన నియంత్రించేందుకు వాహనాల రాకపోకలను నిలిపివేయడమో, రెండురోజులపాటు లాక్‌డౌన్‌(Lockdown in delhi) విధించడమో చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. దీపావళి ప్రభావంతో ఇటీవల భారత్‌లోని 23 నగరాల్లో వాయు నాణ్యత గణనీయంగా పడిపోయింది.

బాణసంచా కాల్చడంవల్ల ఉత్పన్నమైన అదనపు కాలుష్యంతో గాలి నాణ్యత క్షీణించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణమండలి (సీపీసీబీ) పేర్కొంది. నిషేధం ఉన్నా దిల్లీలో విపరీతంగా టపాసులు కాల్చడం సమస్య తీవ్రతను పెంచింది. పంజాబ్‌, హరియాణాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటివి సైతం కాలుష్య కారకాలే. పీఎం2.5గా పేర్కొనే అతి సూక్ష్మ ధూళికణాలు ఘనపు మీటరుకు 380 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. దిల్లీలో దీపావళి తరవాతి రోజు సాయంత్రం ఇది 706 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఫరీదాబాద్‌, గుడ్‌గావ్‌, ఘజియాబాద్‌, నొయిడా తదితర నగరాల్లోనూ వాయు నాణ్యత అధమస్థాయికి చేరింది. హైదరాబాద్‌లో రెం డేళ్ల తరవాత వాయు కాలుష్యం గరిష్ఠస్థాయికి చేరిందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ప్రపంచ వాయు నాణ్యత సూచీ (డబ్ల్యూఏక్యూఐ) ప్రకారం దీపావళి రోజు రాత్రి హైదరాబాద్‌లో పీఎం2.5 స్థాయి 384కు చేరింది. గత సంవత్సరం కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో దీపావళి బాణసంచా అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది బాణసంచా వినియోగం పెరగడం పలు నగరాల్లో గాలి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపింది.

వాయు కాలుష్యంతో(Air Pollution latest news) తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ- వాయు నాణ్యత మార్గదర్శకాలను 2021లో సవరించింది. వాయు కాలుష్య ప్రమాణాలను కఠినతరం చేసింది. గాలిలోని అతి సూక్ష్మ ధూళి కణాలు- ఘనపు మీటరు పరిధిలో అయిదు మైక్రోగ్రాముల కంటే ఎక్కువ స్థాయిలో ఉండకూడదన్నది తాజా ప్రమాణం. అంతకుముందు (2005) ప్రమాణాల ప్రకారం ఇది పది మైక్రోగ్రాములుగా ఉండేది. సూక్ష్మ ధూళి కణాలు, ఓజోన్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌లు- రవాణా, విద్యుత్‌, గృహ, పరిశ్రమ, వ్యవసాయ రంగాల ద్వారా ఉత్పత్తవుతాయి. పీఎం 2.5 ధూళి కణాలు రక్తప్రవాహంలోకి ప్రవేశించే ప్రమాదమూ ఉంది. వాటి ప్రభావం గుండె, శ్వాసకోశాల మీద ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వాల చిత్తశుద్ధే కీలకం

పర్యావరణ సంస్థ 'గ్రీన్‌పీస్‌' ప్రకారం- ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాల కంటే 2020లో పీఎం2.5 దిల్లీలో 16.8 రెట్లు, ముంబయిలో ఎనిమిది రెట్లు, కోల్‌కతాలో 9.4, చెన్నైలో 5.4, హైదరాబాద్‌లో ఏడు, అహ్మదాబాద్‌లో 9.8 రెట్లకంటే ఎక్కువగా ఉంది. అంటే గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. భారత్‌లో గాలి నాణ్యత ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. అధిక వాయు కాలుష్య స్థాయులతో పోరాడుతున్న అనేక దేశాలు, ప్రాంతాలకు కొత్త మార్గదర్శకాలను పాటించడం కష్టమైన పని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. అందువల్ల, గాలి నాణ్యత అంచెలంచెలుగా మెరుగుపడటానికి కావలసిన సులభతరమైన మధ్యంతర లక్ష్యాలను ప్రతిపాదించింది. అందులో అతి ముఖ్యమైంది పీఎం2.5కు సంబంధించింది. దీన్ని అదుపులో పెడితే ప్రపంచంలో వాయు కాలుష్యంవల్ల సంభవించే మరణాల్లో దాదాపు 80శాతాన్ని నివారించవచ్చు. తద్వారా జనాభాకు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఈ కొత్త కఠినమైన ప్రమాణాలు మానవాళికి జీవనాధారమైన గాలి నాణ్యతకు సంబంధించినవి కాబట్టి అన్ని ప్రభుత్వాలూ ఆచరణలో పెట్టే దిశగా ముందుకు తీసుకువెళ్ళాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని దేశాలూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన కొత్త మార్గదర్శకాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయవలసిన అవసరం ఉంది. గాలి నాణ్యతను మెరుగుపరచడంవల్ల వాతావరణం తేటపడుతుంది. అంటే ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. దానివల్ల పర్యావరణానికీ మేలు జరుగుతుందని ప్రభుత్వాలు గుర్తించాలి.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)

ఇదీ చదవండి:

గ్రంథాలయాలు- విజ్ఞాన భాండాగారాలు

ABOUT THE AUTHOR

...view details