స్థిరాదాయాలు లేక వరస నష్టాలతో సేద్యం నుంచి వైదొలగుతున్న రైతుల సంఖ్య దేశంలో ఏటికేడు పెరుగుతోంది. ఈ తరుణంలో వ్యవసాయం పట్ల రైతుల్లో భరోసా పెంచాల్సిన ప్రభుత్వాలు, సంక్షేమ పథకాలతో ఆశలు రేపుతున్నాయే తప్ప- సమగ్ర సాగు సంస్కరణలకు తెరతీయడం లేదు. తాజాగా కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని రైతుల కష్టాలకు చెల్లుచీటీ రాయకుండా వ్యాపారులు, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే ధోరణిపై రైతుసంఘాలు భగ్గుమంటున్నాయి.
కల్లాల్లోనే విక్రయాలు
రైతు శ్రేయం కోసమంటూ జూన్‌లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. వీటిలో మొదటిది- రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ. రెండోది- వ్యాపారులతో చేసుకునే ముందస్తు ఒప్పందాలకు చట్టబద్ధత. మూడోది- నిత్యావసరాలైన చిరు, పప్పు ధాన్యాలు, నూనెగింజల నిల్వలపై ఆంక్షలు తొలగించడం. దేశంలో ఎక్కడైనా పంట విక్రయ స్వేచ్ఛ రైతులకు దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. తెచ్చిన అప్పు తీర్చేందుకు కల్లాల్లోనే పంట అమ్ముకునే దుస్థితిలో ఉన్న 86శాతం చిన్న, సన్నకారు రైతులు, ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకునే సావకాశం ఉంటుందా? యార్డులకు సరకు తీసుకెళ్లే రైతుల్ని- సిండికేట్‌గా ఏర్పడి సరైన ధర రానీయకుండా వ్యాపారులు మోసగిస్తున్నారు. నియంత్రిత విపణుల్లోనే వారిపై చర్యలు తీసుకోని యంత్రాంగం, దేశంలో ప్రైవేట్ వ్యాపారుల్ని అదుపు చేయగలుగుతుందా? తెలంగాణ పత్తి మార్కెట్లలో ఈ తరహా దోపిడిని ఏటా చూస్తున్నాం. వ్యాపారుల మోసాలు, వారిని నియంత్రించలేని మార్కెట్ అధికారుల తీరుపై రైతులు ఆందోళనలు నిర్వహించి మద్దతు ధరల కోసం పాలకులపై ఒత్తిడి తెచ్చి సాధించుకున్న సంఘటనలూ చూశాం. మార్కెట్‌ఫీజు చెల్లించకుండా రైతులు దేశంలో ఎక్కడైనా పంట విక్రయించుకునే స్వేచ్ఛ కల్పిస్తే యార్డులకు ఆదాయం లేక అవి మూతపడతాయి. స్వేచ్ఛా విపణిలో రైతుల పేరు చెప్పి దేశమంతా విక్రయించుకునే అవకాశం వారికి ఏర్పడుతుంది. అంతిమంగా ప్రభుత్వ చర్యల వల్ల లాభపడేది వ్యాపారులే అన్నది స్పష్టమవుతోంది. ఈ ఏడాది కనీసం క్వింటాకు రూ.2,000 ధర వస్తుందని ఆశించిన రబీ మొక్కజొన్నకు నేడు రూ.1.300 కూడా దక్కడం లేదు. ఈ దశలో మార్కెట్ జోక్యం ద్వారా అధికధర పెట్టి కొనాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా అమ్ముకొమ్మని చెప్పి రైతుల్ని వారి మానాన వదిలేస్తే అది మేలు ఎలా అవుతుంది? పోనీ వీరంతా పంటను మంచి ధర కోసం దేశంలో ఇతరచోట్ల విక్రయించే ప్రయత్నం చేశారనే అనుకుందాం- ఎకరా రెండెకరాలున్న రైతు తన ఉత్పత్తిని అంత దూరం తరలించేందుకయ్యే వ్యయప్రయాసలు, అక్కడి మార్కెట్ మోసాలు ప్రభుత్వాలకు తెలియనివి కావు.
రెండో బిల్లు..
రెండో బిల్లును పరిశీలిస్తే, కొన్న విత్తనాలు నాసిరకాలని తేలితే కంపెనీల నుంచి పరిహారమైనా ఇప్పించలేని దుస్థితి ప్రభుత్వాలది. కొన్ని రకాల విత్తనాలను రైతులకు ఇచ్చి సాగు చేయించి పంటను తామే కొనుగోలు చేస్తామంటూ రైతులతో చేసుకునే ఒప్పందాలు సైతం ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి. గతంలో మాంజియం, జాఫ్రా, టేకు చెట్లు, అలోవీరా, దూలగొండి, పామారోజా, సఫేద్‌ముస్లి సహా పలు రకాల ఔషధ, సుగంధ మొక్కలను సాగు చేస్తే లక్షల్లో లాభాలొస్తాయని రైతుల్ని నమ్మించి విత్తనాలు అమ్మేసుకుని మొహం చాటేసిన కంపెనీలను ఏమీ చేయలేకపోవడం తెలిసిందే. అలాంటి ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడం ద్వారా కంపెనీల మోసాలకు అడ్డుకట్ట వేయవచ్ఛు కానీ ఇది పరోక్షంగా ఒప్పంద సేద్యాన్ని చట్టబద్ధం చేయడానికే దారితీస్తుందని దేశవ్యాప్తంగా రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఒప్పంద వ్యవసాయం విస్తరిస్తే సేద్యం కార్పొరేట్‌శక్తుల చేతుల్లోకి వెళ్లి బడుగు రైతులు కూలీలుగా మారాల్సి వస్తుందన్న భయాలను అవి వ్యక్తీకరిస్తున్నాయి. వ్యాపారులు, కంపెనీలతో రైతులు కుదుర్చుకునే ఒప్పందాలకు వ్యవసాయశాఖ బాధ్యత లేకపోవడం బిల్లులో పెద్ద లోపం. గుజరాత్‌లో ఆలుగడ్డ రైతులపై పెప్సీ సంస్థ పెట్టిన కేసులు ప్రస్తావనార్హం.