తూర్పు లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న సుదీర్ఘ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద భారత్- చైనా మధ్య నాలుగు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో ఆగస్ట్ 29 అర్ధరాత్రి జరిగిన ఘర్షణ రెండు బలమైన ఆసియా దేశాల సరిహద్దు వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
పాంగాంగ్ దక్షిణ రేవులో చెలరేగిన తాజా ఘర్షణపై ఇరు దేశాలు తమదైన రీతిలో స్పందించాయి.
"సైనిక, దౌత్య చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని చైనా సైన్యం ఉల్లంఘించింది. ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చడానికి కవ్వింపుతో కూడిన సైనిక మోహరింపులు చేపట్టింది. పాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున చైనా చర్యలను ముందే గమనించాం. మన బలగాలను పెంచాం. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ఉద్దేశాలను అడ్డుకున్నాం"
- కర్నల్ అమన్ ఆనంద్, భారత సైనిక ప్రతినిధి
భారత్ స్పందించిన గంటల వ్యవధిలోనే చైనా మాటల దాడికి దిగింది.
"చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యం పాంగాంగ్ సరస్సు దక్షిణ రేవులోని రెఖిన్ పాస్ వద్ద వాస్తవాధీన రేఖను దాటడం ద్వారా కవ్వింపు చర్యకు పాల్పడింది. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీన్ని తిప్పికొట్టడానికి అవసరమైన చర్యలను చైనా సైన్యం చేపడుతోంది.
చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని భారత్ ఉల్లంఘించింది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని బలహీనపరిచింది. ఆక్రమణకు పాల్పడిన బలగాలను భారత్ వెనువెంటనే ఉపసంహరించుకోవాలి. ఒప్పందాలకు లోబడి ఉండాలి. సమస్యలు మరింత జఠిలం కాకుండా చూసుకోవాలి."
- సీనియర్ కర్నల్ ఝాంగ్ ష్యులీ, చైనా సైనిక ప్రతినిధి
వాస్తవాధీన రేఖపై...