విశ్వశాంతికి వేరుపురుగు వంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలనే ఇండియా- అఫ్గానిస్థాన్‌లో మునుపటి పౌర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ఆ దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. అగ్రరాజ్యం అర్ధాంతరంగా వెనుదిరిగాక అఫ్గాన్‌లో వేగంగా మారిన పరిణామాలు (Afghanistan crisis) భారత్‌కు కొత్త తలనొప్పులు (Afghanistan impact on India) తెచ్చిపెట్టాయి. తాలిబన్లు కేంద్రంగా భారత వ్యతిరేక శిబిరాలన్నీ ఏకమవుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇండియాపై విషం కక్కడంలో సదా ముందుండే పాక్, చైనాలు స్వప్రయోజనాల కోసం అనాగరిక మూకతో అంటకాగుతున్నాయి.
అఫ్గాన్ సహజ వనరులను కొల్లగొట్టేందుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేసుకొంటుంటే, తన కనుసన్నల్లోని ఉగ్ర తండాలను అక్కడకు తరలించాలని పాకిస్థాన్ తలపోస్తోంది. కశ్మీర్ విషయంలో తాలిబన్లు తమకు తోడ్పడటం తథ్యమని పాక్ నేతాగణం బహిరంగ ప్రకటనలు గుప్పిస్తోంది. అమెరికాలో నరమేధం సృష్టించిన అల్‌ఖైదా కూడా తాలిబన్ తోడేళ్ల అండతో మళ్ళీ పేట్రేగిపోవచ్చన్న కథనాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ముల్లా ఒమర్ వారసుల పునరాగమనంపై జైషే మహ్మద్, లష్కరే తొయిబా ముఠాలు తుపాకులు పేల్చి మరీ సంబరాలు జరుపుకొన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రభుజంగాలకు అఫ్గాన్ గడ్డ అడ్డా కాకూడదని ఐరాస మానవహక్కుల సంఘం వేదికగా భారత్ తాజాగా గళమెత్తింది. అటువంటి భయాలేవీ పెట్టుకోవద్దని తాలిబన్లు చెబుతున్నా- ఇచ్చిన మాటకు కట్టుబడే అలవాటు వారికి లేనేలేదని గతానుభవాలు చాటుతున్నాయి. దేశ అంతర్గత భద్రతకు పొంచి ఉన్న పెనుముప్పును కాచుకోవడానికి ఇండియా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన కీలక తరుణమిది!
ఇండియాపై ఇరాన్ అసహనం..
అమెరికాతో ఇండియా స్నేహ సంబంధాలు- రష్యా, ఇరాన్‌లతో చిరకాల మైత్రీబంధానికి పొగపెట్టాయి. పశ్చిమాసియాలో ముఖ్య దేశమైన ఇరాన్‌లోనైతే ఇండియాపై అపనమ్మకం, అసహనం పెరిగిపోయాయి. అగ్రరాజ్యం ఒత్తిడితో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను వదులుకొన్న భారత్ భారీ నష్టాన్నే మిగుల్చుకొంది. తదనంతర పరిణామాలు ఇరాన్‌ను చైనాకు చేరువ చేశాయి. ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయ అభివృద్ధికి భారత్ భారీగా వెచ్చించింది. ద్వైపాక్షిక సంబంధాలు సన్నగిల్లడం వల్ల దానిపై నీలినీడలు కమ్ముకొన్నాయి. అఫ్గాన్‌లో భిన్న వర్గాలకు తమ సహకారం ఉంటుందని ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల ప్రకటించారు. దశాబ్దాలుగా భారత్‌కు అండదండలందించిన రష్యా కూడా క్రమంగా పాక్, చైనాలకు దగ్గరవుతోంది. తాలిబన్లతోనూ దోస్తీ కొనసాగిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించగలిగే క్వాడ్ కూటమిలో భారత్ అంతర్భాగం కావడం రష్యాకు రుచించడం లేదు. దక్షిణాసియాలో భారత్‌ను ఏకాకిని చేసేందుకు తనవంతుగా డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల కూటమి(బిమ్‌స్టెక్)కి ప్రాధాన్యమిస్తూ, దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్)పై ఇండియా శీతకన్నేయడం చైనాకు మరింతగా కలిసివస్తోంది. ఈ క్రమంలో విదేశాంగ విధానాలను సమీక్షించుకొంటూ పాతమిత్రులతో పటిష్ఠ బంధానికి భారత్ బాటలు పరవాలి. చైనా, పాక్ పన్నాగాలను సమర్థంగా తిప్పికొడుతూ తన ప్రయోజనాల పరిరక్షణకు అఫ్గాన్ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. తాలిబన్ల నేతృత్వంలో కొలువుదీరబోయే సర్కారును ఇండియా గుర్తించక తప్పదన్నది రక్షణరంగ నిపుణుల అభిప్రాయం. చుట్టూ సవాళ్లు ముమ్మరిస్తున్న తరుణంలో దేశ భద్రతే పరమావధిగా దిల్లీ వ్యూహాలు పదునుతేలాలి!
ఇదీ చదవండి:Afghan crisis: 'అఫ్గాన్ సంక్షోభాన్ని ముందే ఊహించాం'