కీలక రంగాలన్నింటా స్వావలంబన సాధించాలన్న ధ్యేయంతో మోదీ ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్' వ్యూహాన్ని ప్రకటించింది. ప్రపంచానికే ఔషధశాలగా ఎదగాలనుకొంటున్న ఇండియా- ముడిరసాయన ఔషధాల్లో 84శాతం దాకా, ఒక్కచైనా నుంచే 60 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడుతుండటం కలవరకారకమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం దాకా ముడి ఔషధాల(యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రెడియంట్స్- ఏపీఐల) తయారీలో దేశీయంగానే రాణించిన ఇండియా- ఆ రంగంలో చైనా దూకుడుకు తలొగ్గి చౌక దిగుమతులకు అలవాటు పడిపోయింది. ఆస్పిరిన్, క్రోసిన్ లాంటి మందుల ముడిఔషధాలకూ దిగుమతులే దిక్కుకాగా, ఇండియా పరాధీనత గత కొన్నేళ్లలో 23శాతం పెరిగిందని నిరుడు నవంబరులో కేంద్రమే పార్లమెంటుకు నివేదించింది.
నూరుపాళ్లు నిజమైంది
జనారోగ్య భద్రతతో ముడివడిన అంశంలో చైనాపై అతిగా ఆధారపడటం ఏదో ఒకనాడు ఇక్కట్లలోకి నెట్టేదేనన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ భవిష్యద్దర్శనం- నూరుపాళ్లు నిజంగా రుజువవుతున్న రోజులివి. సరిహద్దు మీరిన చైనా దురాగతాన్ని సమర్థంగా తిప్పికొట్టిన ఇండియా- 'మేడిన్ చైనా' వస్తూత్పత్తులు, కాంట్రాక్టులపై కఠిన వైఖరి చూపాలనే నిర్ణయించింది. రాఖీలు, ఆటబొమ్మల్ని వద్దనుకోగలంగాని, ముడిఔషధాల దిగుమతుల్ని ఇప్పటికిప్పుడు కాదనుకొనే పరిస్థితి ఎక్కడుంది? ఆ మౌలికాంశాన్నే క్షుణ్నంగా పరిశీలించిన సాంకేతిక సమాచార విశ్లేషణ మండలి విపుల సూచనలతో నివేదిక సమర్పించింది. సత్వరం ముడిఔషధాల పరంగా స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని, జాతీయ స్థాయిలో జెనరిక్ ఔషధాల నిల్వల ఆవశ్యకతనూ ప్రస్తావించిన మండలి- దేశీయ ఉత్పాదనలకు ఊపునిచ్చేలా కస్టమ్స్ సుంకాల్లో దిద్దుబాట్లూ జరగాలంటోంది. దేశీయంగా బల్క్‌డ్రగ్స్ తయారీకి ప్రభుత్వాలు ఇక వెన్నుదన్నుగా నిలవాలి!