తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఉపాధితో వృద్ధికి ఊతం.. కావాలి ఇదే ప్రథమ కర్తవ్యం - నిరుద్యోగిత

కరోనాతో గ్రామీణ భారతంలో మే నెల మొదటి వారంలో 7.29 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు రెండో వారానికి 14.34 శాతానికి చేరింది. ఇది తీవ్ర సమస్యగా పరిగణించి సత్వరమే పరిష్కరించాలి. స్వయంఉపాధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారిలో కనీసం 15శాతాన్నయినా ఇతర ఉపాధి మార్గాల వైపు మళ్లించాలి. ప్రజల వినియోగ, కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. అందుకు నిరుద్యోగితను సాధ్యమైనంత తగ్గించడమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలి.

నిరుద్యోగిత
employment

By

Published : Jun 15, 2021, 8:52 AM IST

కొవిడ్‌ మహమ్మారి తొలి దశ వ్యాప్తిలోనే కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ, మలి దశలో మరింతగా ప్రభావితమవుతోంది. ఇప్పటికే లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అసంఘటిత రంగంలోని వేతన జీవుల్లో దాదాపు సగంమంది ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఆర్థిక వృద్ధి తీవ్రంగా దిగజారింది. దేశ ప్రజల ఆరోగ్యాన్నే కాకుండా సామాజిక, ఆర్థిక స్థితిగతులను కొవిడ్‌ తీవ్రంగా దెబ్బతీసింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కర్ఫ్యూ, లాక్‌డౌన్లు విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు అంతంత మాత్రంగానే కొనసాగాయి. ఫలితంగా, ఉద్యోగిత రేటు దారుణంగా పడిపోతోంది. గ్రామీణ భారతంలో మే నెల మొదటి వారంలో 7.29 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు రెండో వారానికి 14.34 శాతానికి చేరింది. అంటే, వారం వ్యవధిలోనే రెట్టింపైంది. దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడటంతో దాదాపు 30 శాతం పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడగా, మిగతావి 30 నుంచి 60 శాతం సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సీఎంఐఈ) తాజా అధ్యయనం పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తగ్గిపోతున్న ఆదాయాలు

దేశవ్యాప్తంగా 2020 మార్చి 25న లాక్‌డౌన్‌ విధించడంతో 90 శాతంపైగా వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో అక్కడ మానవ వనరుల లభ్యత పెరిగి కూలీరేట్లు తగ్గి ఆదాయం పడిపోయింది. డిసెంబరు నాటికి 50 శాతం మాత్రమే తిరిగి పట్టణ ప్రాంతాలకు చేరుకున్నారు. ఆర్థిక వ్యవస్థ కాస్త స్థిరత్వం పొందుతున్న పరిస్థితుల్లో తిరిగి రెండో విడత వైరస్‌ వ్యాప్తి విస్తృతం కావడంతో పరిస్థితి మళ్లీ దిగజారడం ప్రారంభమైంది. శ్రమజీవుల ఆదాయం గతంలో కంటే సగటున 17 శాతం తగ్గిపోయిందని, సుమారు 23 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరుకున్నట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. దేశంలో ఆరోగ్య అవసరాలకు తగిన ఆర్థిక రక్షణలు లేక ఏటా సుమారు 6.3 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నట్లు నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. దేశంలో వ్యవసాయ రంగంతో కలుపుకొని ఇప్పటికీ 80 శాతం అసంఘటిత రంగంలోనే పని చేస్తున్నారు. కొవిడ్‌ రెండు దశల్లోనూ తీవ్రంగా నష్టపోయింది వీరే. రవాణా, పర్యాటకం, హోటళ్లు, వీధి వ్యాపారులు, వలస కార్మికులు ఆర్థికంగా చితికిపోయారు. వీరికి తక్షణం సాయం అందించాల్సి ఉంది. ఏడాదిన్నరగా ఈ రంగాలు దెబ్బతినడంతో, ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడనుంది. ఆర్థిక వ్యవస్థపై మొదటి దశ చూపినంత ప్రతికూల ప్రభావం, రెండో దశ చూపకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని చెప్పలేమని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ ఇటీవలే స్పష్టం చేశారు. దీన్నిబట్టి ఆర్థిక వ్యవస్థపై పెనుభారాన్ని దేశం మరికొన్నాళ్లు భరించక తప్పదని తెలుస్తోంది. ఈ ప్రభావం ఎక్కువగా అసంఘటిత రంగ కార్మికులపైనే పడుతుంది. ఉపాధి కోల్పోవడానికి తోడు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు మరింత కుంగదీస్తున్నాయి. కొనుగోలు శక్తి సన్నగిల్లడంతో తీవ్ర పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోతే ఏళ్ల తరబడి సామాజిక, ఉపాధి పరిస్థితులపై ప్రభావం ఉంటుందని తాజాగా అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఇటీవలి నివేదిక స్పష్టంచేసింది.

మెరుగైన ప్రణాళిక అవసరం

దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా పట్టాలెక్కి పరుగు ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వాలు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలి. ఇప్పటికీ దేశంలో 55శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుండగా, సంవత్సరంలో అయిదు నెలల కాలమే వారికి స్థిరమైన ఉపాధి ఉంటుంది. వ్యవసాయ రంగంపై ఆధారపడినవారు ప్రత్యామ్నాయాలు లేక అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్నారు. స్వయంఉపాధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారిలో కనీసం 15 శాతాన్నయినా ఇతర ఉపాధి మార్గాల వైపు మళ్లించాలి. భవన నిర్మాణ రంగంలో వివిధ దశల్లో నిపుణులైన కార్మికుల కొరత వేధిస్తోంది. వ్యవసాయ రంగంలో మిగులు పనివారిని ఈ రంగంలోకి మళ్లిస్తే స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇందుకోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పేరున్న సంస్థలను ఎంపిక చేసి ప్రభుత్వ భాగస్వామ్యంతో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. శిక్షణ కాలంలో ప్రభుత్వాలు వారికి కనీస జీతభత్యాలు అందిస్తే ఎక్కువ మంది యువత ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి కనీసం 125 రోజులకు పెంచి పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలి. ఏడాదిన్నరగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన 40 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సత్వరమే ఆదుకునేందుకు కేంద్రం మెరుగైన ప్యాకేజీని రూపొందించాల్సి ఉంది. ప్రజల వినియోగ, కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. అందుకు నిరుద్యోగితను సాధ్యమైనంత తగ్గించడమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలి.

- ఎం.ఎస్‌.వి. త్రిమూర్తులు

ఇదీ చదవండి:ఆ కుటుంబాలకు అండగా సీఎం- రూ.1లక్ష సాయం

ABOUT THE AUTHOR

...view details