తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఉచితాలపై తగ్గని ఆప్.. తటపటాయిస్తున్న భాజపా.. 2022 బాద్​షా ఎవరో? - 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు

AAP Freebies in Gujarat: గుజరాత్​లో శాసనసభ ఎన్నికలకు మరో కొన్ని నెలల సమయమే ఉంది. ఇప్పుడు దేశమంతా ఆ ఎన్నికల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉచిత పథక హామీలు కురిపిస్తుంటే.. భాజపా మాత్రం సైలెంట్​గా ఉంది. ఉచితాలను కాషాయ పార్టీ వ్యతిరేకిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆప్ ఉచితాలకు ప్రజలు ఆకర్షితులై ఆ పార్టీకి పట్టం కడతారా? లేదంటే మళ్లీ భాజపాను గెలిపిస్తారా? భాజపా.. ఉచితాలపై తన వైఖరి మార్చుకుంటుందా?

aap freebies in gujarat
మోదీ కేజ్రీవాల్

By

Published : Sep 18, 2022, 3:06 PM IST

AAP Freebies in Gujarat: గుజరాత్.. భారతీయ జనతా పార్టీకి కంచుకోట.. ప్రధాని నరేంద్ర మోదీ సొంత గడ్డ. 1995వ సంవత్సరం నుంచి రాష్ట్రం.. భాజపా పాలనలోనే ఉంది. ఈ రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన మోదీ.. దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఏ విధంగా చూసినా ఈ రాష్ట్రం భాజపాకు చాలా కీలకం. 2022 చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని భాజపా కంకణం కట్టుకుంది. గతంలో కాంగ్రెస్, భాజపా మధ్యే పోటీ ఉండగా.. ఈసారి కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో నిలిచింది. ఇక్కడే భాజపాకు ఓ విషయంలో తలనొప్పి వచ్చి పడింది. భాజపా ఉచితాలను వ్యతిరేకిస్తుండగా.. అనేక ఉచిత పథకాలు ప్రకటిస్తూ ఆప్ దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో.. ఆమ్ ఆద్మీ పార్టీ కురిపించే ఉచితాల జల్లుకు గుజరాతీలు జై కొడతారా? రాష్ట్ర ఓటర్లు ఎటువైపు నిలుస్తారు? ఆప్ ఉచితాల ట్రాప్​లో భాజపా పడుతుందా?

2022 డిసెంబరులో గుజరాత్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాష్ట్రంలో ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల హీట్ మొదలైంది. పంజాబ్​లో గ్రాండ్ విక్టరీతో మంచి జోష్​లో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్​పై దృష్టి పెట్టారు. అనేక ఉచిత హామీలను ప్రజలపై కురిపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఉచిత హామీని ఇస్తున్నారు. పేదలకు ఉచితంగా విద్య, ఆరోగ్యం, కరెంట్ ఇవ్వలేని భాజపాను గద్దె దించాలని ప్రజలను కోరుతున్నారు.

"నిజాయితీ లేని వ్యక్తి, అవినీతిపరుడు, దేశద్రోహి మాత్రమే ప్రజలకు ఉచితాలు ఇవ్వడం వల్ల దేశం నాశనం అవుతుందని అంటారు. ప్రజలకు ఉచిత పథకాలు ఎలా ఇవ్వాలో మాకు తెలుసు. ఈ విషయం అర్థం కాక భాజపా ఉచితాలను వ్యతిరేకిస్తోంది. ఉచితాలు.. దేశానికి మంచిది కాదని ఏ రాజకీయ నాయకుడైనా చెబితే.. అతడు ఉద్దేశం తప్పు అని ప్రజలు అర్థం చేసుకోవాలి."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

కేజ్రీవాల్ ప్రకటించిన కొన్ని ఉచిత పథకాలు..

  • 300 యూనిట్ల ఉచిత విద్యుత్
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య
  • నిరుద్యోగ భృతి
  • మహిళలకు రూ.1,000 భృతి
  • కొత్త న్యాయవాదులకు నెలవారీ భృతి
  • రైతులకు కనీస మద్దతు ధర
  • రైకులకు 12 గంటల నాణ్యమైన కరెంట్

కేజ్రీవాల్ ఉచితాలపై భాజపాలోనూ అంతర్గతంగా ఆలోచన మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్​, దిల్లీ ఇదే తరహా హామీలను ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలకుపైగా రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం వంటివి భాజపాను ప్రధానంగా ఇబ్బందిపెట్టే సమస్యలు. దీనికి తోడు కేజ్రీవాల్ కురిపిస్తున్న ఉచిత తాయిలాలకు ప్రజలు ఓ మేర ప్రభావితమవుతారోనని భాజపాలో ఆలోచన మొదలైంది.

భాజపాను గుజరాత్​లో ఓడించాలనే కసితో ఆప్ ఉంది. అందులో భాగంగా జిల్లా ఇన్​ఛార్జ్​ల నియామకం, రాష్ట్రంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పర్యటనలు, ఉచిత హామీలు, దిల్లీలా గుజరాత్​ను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పడం వంటివి భాజపాను కలవరపెడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

భాజపా వ్యతిరేకం!
ఉచిత హామీలపై భాజపా వ్యతిరేకమని పలుమార్లు స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు అని పలు వేదికలపై చెప్పారు. కొవిడ్ సంక్షోభంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్​.. దేశ ప్రజలకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చామని తెలిపారు. అయితే ఇలాంటి పథకాలు గుజరాత్​లో భాజపాను విజయతీరాలకు చేర్చుతాయా అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉచితాలపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తర్​ప్రదేశ్​లో బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ హైవే ప్రారంభోత్సవంలో ఉచిత పథకాలను ఉద్దేశించి జులై 16 న కింది విధంగా మాట్లాడారు.

"మన దేశంలో ఉచిత స్వీట్లు(హామీలను ఉద్దేశించి) పంపిణీ చేయడం ద్వారా ఓట్లను పొందే సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉచిత హామీల సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం. అలా ఉచిత హామీలు ఇచ్చేవారు ప్రజల కోసం కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, కొత్త విమానాశ్రయాలు, రక్షణ కారిడార్‌లను ఎప్పటికీ నిర్మించరు. మనమంతా కలిసి ఈ ఆలోచనను ఓడించాలి."
-ప్రధాని నరేంద్ర మోదీ

భాజపా కీలక రాష్ట్రమైన గుజరాత్​లో పరిస్థితులు ఏకపక్షంగా ఏమీ లేవు. 2017 శాసనసభ ఎన్నికల్లో భాజపాను పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. అప్పటివరకు భారీ విజయాలతో దూసుకెళ్తున్న భాజపాను కాంగ్రెస్ 99 స్థానాలకు కట్టడి చేయగలిగింది. అలాగే 77 సీట్లతో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా మధ్యే ప్రధాన పోటీ. అయితే ఇప్పుడు ఆప్ రంగంలోకి దిగింది. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 2021లో రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గణనీయమైన ఓటుబ్యాంక్​ను నమోదు చేసింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది.

కాంగ్రెస్ సైతం..
ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం గుజరాత్​లో తాయిలాలు ప్రకటించారు. గ్యాస్ సిలిండరు ధర రూ.1,000 నుంచి రూ.500 తగ్గిస్తామని అన్నారు. కొవిడ్ వల్ల మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే రూ.3 లక్షలు వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు హెచ్చరిక
ఉచితాల వల్ల ఇప్పటికే శ్రీలంక వంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు హెచ్చరించింది. అలాగే ఉచితాల వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమైనా మారిందా అని పలుమార్లు ప్రశ్నించింది.

అలాగే దేశంలో ఎక్కువగా ఉచితాల ప్రకటిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పడు ఆ రాష్ట్రాల సరసన పంజాబ్ కూడా నిలిచింది. అయితే భాజపా.. ప్రధాని మోదీ చరిష్మా, అవినీతి రహిత పాలననే ముఖ్యంగా నమ్ముకుంది. తమ సంక్షేమ పథకాలే గుజరాత్​ శాసనసభ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపిస్తాయని అంటున్నారు. ఇక లోక్​సభ ఎన్నికల్లో భాజపాను నిలువరించాలంటే మోదీ స్వరాష్ట్రం గుజరాత్​లో భాజపాను ఓడించాలని కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

భాజపా ప్లస్ పాయింట్స్..

  • మోదీ చరిష్మా
  • మోదీ-షా ద్వయం
  • సంక్షేమ పథకాలు
  • తటస్థ ఓటు బ్యాంక్
  • పట్టణంలో ఓటు బ్యాంకు
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి అధిక నిధులు

బలహీనతలు..

  • ప్రభుత్వ వ్యతిరేకత
  • పార్టీలో అంతర్గత కుమ్ములాటలు
  • ఉచితాలపై భాజపా హామీలివ్వకపోవడం
  • 2017లో తగ్గిన సీట్ల ప్రభావం
  • నిరుద్యోగం, ద్రవ్యోల్బణం

ఆప్ ప్లస్ పాయింట్స్..

  • అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీ
  • ఉచిత హామీలు
  • విద్యావంతులైన ఓటర్లలో పార్టీపై సానుకూల దృక్పథం
  • దిల్లీలా గుజరాత్​ను అభివృద్ధి చేస్తానని హామీలు
  • పంజాబ్​లో గెలుపు
  • యువ ఓటర్లు ఆప్​కు కొంతమేర అనుకూలం
  • మున్సిపాలిటీ ఎన్నికల్లో పెరిగిన ఓటుబ్యాంక్
  • ప్రతిపక్షం బలంగా లేకపోవడం

మైనస్ పాయింట్స్..

  • రాష్ట్రంలో బలమైన నేత లేకపోవడం
  • గ్రామాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు లేకపోవడం
  • దిల్లీ పార్టీగా ముద్ర
  • స్థానికేతరుడిగా అరవింద్ కేజ్రీవాల్​పై ముద్ర
  • దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై ఎక్సైజ్​ కేసు ఆరోపణలు

ఇవీ చదవండి:టైప్​రైటర్స్​కు మ్యూజియం.. ప్రత్యేక ఆకర్షణగా 110ఏళ్ల నాటి 'కరోనా'

అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలో దుమారం

చీతాలకు ఇంత వేగం ఎలా? శరీరంలోని ఆ ప్రత్యేకతలే కారణమా?

ABOUT THE AUTHOR

...view details