తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సంపూర్ణ ప్రజాస్వామ్యం వైపు మయన్మార్‌!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నరాలు తెగే ఉత్కంఠతో సాగాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మయన్మార్​లో నిశ్శబ్దంగా ఎన్నికల రంగం సిద్ధమైపోయింది. సైనిక ప్రభావం ఎక్కువగా ఉన్న దశ నుంచి క్రమంగా సంపూర్ణ ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేయడానికి, తమ మీద పడిన 'సామూహిక హననం' మచ్చను చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్న నోబెల్‌ శాంతి బహుమతి విజేత ఆంగ్‌ సాన్‌ సూకీ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేందుకు పోటీపడుతున్నారు.

A special story on Myanmar election 2020
సంపూర్ణ ప్రజాస్వామ్యం వైపు మయన్మార్‌!

By

Published : Nov 8, 2020, 10:13 AM IST

ప్రపంచమంతటినీ అమెరికా అధ్యక్ష ఎన్నికల జ్వరం ఆవహించిన వేళ- మన పొరుగు దేశమైన మయన్మార్‌లో నిశ్శబ్దంగా ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. సైనిక ప్రభావం ఎక్కువగా ఉన్న దశ నుంచి క్రమంగా సంపూర్ణ ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేయడానికి, తమ మీద పడిన 'సామూహిక హననం' మచ్చను చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్న నోబెల్‌ శాంతి బహుమతి విజేత ఆంగ్‌ సాన్‌ సూకీ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేందుకు పోటీపడుతున్నారు. ఒకవైపు కరోనా వైరస్‌ రెండోదశ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నా, సుమారు 3.8 కోట్ల మంది ఓటర్లు ఆదివారం (నేడు) జరిగే ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోడానికి సిద్ధమయ్యారు. మయన్మార్‌ రాజకీయ చరిత్రలోనే ఇవి అత్యంత ప్రభావశీల ఎన్నికలుగా నిలవనున్నాయి.

కత్తి మీద సాము

ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉండే నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీకి నేతృత్వం వహిస్తున్న పోరాట యోధురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ- అయిదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి దేశ పాలనా పగ్గాలను చేపట్టారు! 2008లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం జాతీయస్థాయిలో ఉండే ఎగువ, దిగువ సభలు రెండింటిలోనూ నాలుగోవంతు స్థానాలను సైన్యానికి కేటాయించారు. అలాగే రాష్ట్రాల అసెంబ్లీలలోనూ మూడోవంతు స్థానాలు వారివే. కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన హోంశాఖ, సరిహద్దు వ్యవహారాలు, రక్షణ శాఖలకు తప్పనిసరిగా సైనిక ప్రతినిధులే మంత్రులుగా ఉండాలి. కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నికైన తరవాత అధ్యక్షుడిని, ఇద్దరు ఉపాధ్యక్షులను ప్రెసిడెన్షియల్‌ ఎలక్టోరల్‌ కాలేజి ఎన్నుకుంటుంది. ఇంత సంక్లిష్టమైన వ్యవస్థ ఉండటం వల్ల ముఖ్యమైన వ్యవహారాలు అన్నింటిలోనూ సైనిక జోక్యం ఉండటం సూకీని ఇబ్బంది పెడుతూనే ఉంది. దేశ బడ్జెట్‌, రక్షణ, భద్రతా వ్యవహారాలన్నింటిలోనూ ఆర్మీచీఫ్‌కు అపరిమిత అధికారాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం సాధించడం సూకీకి కత్తి మీద సాము లాంటిదే.

పదేళ్ల క్రితం బహుళపార్టీ ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా అక్కడి సైనిక పాలకులు ప్రజాస్వామ్యానికి కొంతమేర ఊపిరులూదారు. దాంతో 6,76,575 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న ఈ బుల్లి దేశంలో ఏకంగా 90 రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయస్థాయిలో పోటీపడేవి మాత్రం ప్రధానంగా ఎన్‌ఎల్‌డీతో పాటు, సైనిక పాలనకు అనుకూలంగా ఉండే యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ (యూఎస్‌డీపీ). వీటిలో సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీది 'ఎర్ర' పతాకం. తాన్‌ హటాయ్‌ నాయకత్వం వహిస్తున్న యూఎస్‌డీపీది 'ఆకుపచ్చ' పతాకం. పట్టణ ప్రాంతాలన్నింటిలో ఇప్పటికీ అరుణ పతాకాలే రెపరెపలాడుతుంటాయి. అధికార పగ్గాలు చేపట్టాలన్న యూఎస్‌డీపీ కలలు ఈసారీ కల్లలుగానే మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బరిలో ఇన్ని పార్టీలు ఉండటం వల్ల గందరగోళంగానే ఉన్నా, తమ సమస్యలు తీర్చేది మాత్రం సూకీయేనని, అందువల్ల ఎన్‌ఎల్‌డీకే ఓట్లు వేస్తామని వీధుల్లో బండ్ల మీద అమ్మకాలు సాగించే చిరు వ్యాపారులు సైతం చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వాళ్ల జీవితాలు దారుణంగా దెబ్బతిన్నాయి. తాము మళ్లీ కోలుకోవాలంటే మరోసారి సూకీయే రావాలని ఈ వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం ఈసారి ఎన్నికలపై గట్టిగానే పడవచ్చన్నది అక్కడి విద్యావేత్తలు, విశ్లేషకులు, దౌత్యవేత్తల మాట. రెండోదశలో అక్కడ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికీ వ్యాధి విస్తృతి ఎక్కువగానే ఉండటం వల్ల అసలు ఎన్నికలు నిర్వహించాలా అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. పార్టీలన్నీ ఆన్‌లైన్‌ ప్రచారబాట పట్టాయి. ఇది అధికార ఎన్‌ఎల్‌డీకి ఒకరకంగా కలిసి వచ్చింది.

అంతర్యుద్ధం... నేరాలు

రోహింగ్యాలు సహా కొందరికి ఈసారి ఓటు వేసే అవకాశం దక్కకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 26 లక్షల మంది మయన్మార్‌ దేశస్థులు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారు. వారిలో 11 లక్షల మంది రోహింగ్యాలే. భద్రతా కారణాల వల్ల వారితో పాటు రఖైన్‌ రాష్ట్రంలో ఉన్న బౌద్ధులను కూడా ఓటింగ్‌ ప్రక్రియకు దూరం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల ఈ ఎన్నికలు తప్పుమార్గంలో వెళ్తున్నాయని 'హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌' లాంటి సంస్థలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 3.8 కోట్ల మంది వరకు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 50 లక్షల మంది యువ ఓటర్లే. వారంతా తొలిసారి ఓటు వేయబోతున్నారు. అయినా ఈసారి ఓటింగ్‌ శాతం 2015 కంటే తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆల్‌ బర్మా ఫెడరేషన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ యూనియన్స్‌ లాంటి సంస్థలు ఎన్నికల బహిష్కరణకు పిలుపిచ్చాయి. ప్రజాస్వామ్య సంస్కరణలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నది వాటి ఆరోపణ. కానీ ఇలా ప్రశ్నించేవారి గొంతును అక్కడ అణిచేస్తున్నారు. ఏబీఎఫ్‌ఎస్‌యూలో కొందరు నాయకులకు అయిదేళ్ల జైలుశిక్ష పడటం- అక్కడి ప్రజాస్వామ్య పాలనా తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. దానికితోడు రోహింగ్యా ముస్లిములపై సామూహిక హననానికి పాల్పడినట్లు అంతర్జాతీయ న్యాయస్థానంలో మయన్మార్‌పై కేసు ఇంకా నడుస్తోంది. దేశ ఉత్తరప్రాంతంలో అంతర్యుద్ధాలు, యుద్ధనేరాలవంటివి సైతం ఆ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. 2015లో సాధించినంతటి భారీ ఆధిక్యం రాకపోయినా, అధికారాన్ని నిలబెట్టుకోవడం మాత్రం ఎన్‌ఎల్‌డీకి అంత కష్టం ఏమీ కాకపోవచ్చు. సంపూర్ణ ప్రజాస్వామ్య సాధన దిశగా అడుగులు వేస్తున్న మయన్మార్‌- ఆ విషయంలోనూ విజయం సాధించే రోజులు మరెంత దూరంలో ఉన్నాయో చూడాలి.

- రఘురామ్‌

ABOUT THE AUTHOR

...view details