వృద్ధాప్యం మనిషి జీవితంలో అత్యంత విలువైన దశ. కాలంతోపాటు వయసు పెరగడం, వృద్ధాప్యంలోకి అడుగు పెట్టడం అనివార్యమైన సహజ ప్రక్రియ. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 12శాతం వరకు ఉన్న వృద్ధులు 2050వ సంవత్సరం నాటికి 22శాతం కానున్నారని అంచనా. మనదేశంలో వృద్ధులు 12 కోట్ల మంది ఉన్నట్లు 'ఐక్యరాజ్యసమితి జనాభా నిధి' 2019లో ప్రకటించింది. వీరిలో మూడు వంతులు గ్రామీణ భారతంలో నివసిస్తున్నారు. అందులో సగంమంది పేదరికంతో సతమతమవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మన భారతీయ సంస్కృతిలోని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వృద్ధులకు ఆసరాగా ఉంటూ, వారికి చరమాంకంలో రక్షణగా ఉంది.
ఉద్యోగాల కోసం వలసలు, పట్టణీకరణ, మారుతున్న జీవన శైలి- వృద్ధులకు, దేశానికి సామాజిక సమస్యగా మారింది. వృద్ధాప్యంతో జీవనం సాగించే వారి శాతం కేవలం ధనిక దేశాలకు మాత్రమే పరిమితం అయి ఉండేది. ప్రస్తుతం జపాన్ జనాభాలో 30శాతం 60 ఏళ్ల వయసు పైబడిన వారే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మెరుగవుతున్న వైద్య ప్రమాణాలు, ప్రభుత్వాల ద్వారా వృద్ధులకు అందుతున్న సంక్షేమ ఫలాలు, ఫిట్‌నెస్, వెల్‌నెస్‌లపై పెరుగుతున్న చైతన్యం పేద, మధ్య ఆదాయ దేశాల్లోనూ వృద్ధుల శాతం పెరిగేందుకు కారణమవుతున్నాయి.
ముదిమికి సాంత్వన అవసరం
వృద్ధాప్యానికి ఆరంభంగా భావించే 60 సంవత్సరాల వయసులో ఆహ్లాదకరంగా ఉంటున్నట్లు వృద్ధుల జీవన విధానంపై జరిగిన అధ్యయనాల ద్వారా విశదమవుతోంది. ఉద్యోగ విరమణతో పాటు పిల్లలు చేతికి అందిరావడం తమ సంతోషానికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ప్రజాహిత కార్యక్రమాలకు సమయం కేటాయించి, సమాజ సేవలో ఉత్సాహంగా పాలు పంచుకోవచ్చు అన్నది మరి కొందరి అభిప్రాయం. ఈ కార్యక్రమాలు తమకు సంతృప్తిని ఇస్తూ, మానసికోల్లాసానికి కారణమవుతున్నట్లు వారు అంటున్నారు.
వ్యక్తులు వృద్ధాప్యంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలతో సతమతమవుతున్నారు. స్వేచ్ఛనూ కోల్పోతున్నారు. ఈ దశలో అవసరమైన ఊతమందించి, బలిమి చేకూర్చినట్లైతే వారికి సాంత్వన లభించగలదని వృద్ధాప్య విజ్ఞాన శాస్త్రవేత్తలు (గెరాంటాలజిస్టులు) సూచిస్తున్నారు. వృద్ధుల్లో 92 శాతం ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మతతో, 77శాతం ఒకటి కంటే ఎక్కువ సమస్యలతో బాధ పడుతున్నట్లు 'జాతీయ వృద్ధాప్య మండలి' పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం, కేన్సర్, గుండె జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులవల్ల మూడు వంతుల మంది వృద్ధులు కన్ను మూస్తున్నట్లు పై పరిశోధనల సారాంశం.
భావోద్వేగాలనూ పరిరక్షించాల్సి ఉంది!
సంవత్సరానికి కనీసం ఒక్క పర్యాయమైనా వైద్య పరీక్షలు చేసుకుంటూ, సమతుల ఆహారం భుజిస్తూ, నడక, వ్యాయామం, యోగా సాధనపై దృష్టి కేంద్రీకరించినట్లైతే- ఈ తరహా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని 'జాతీయ దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణ సంస్థ' సూచిస్తోంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా భుజించడంతో పాటు- ఉప్పు, హాని కలిగించే కొవ్వు పదార్థాలను ఆహారంలో తగ్గించడంవల్ల వృద్ధు.ల్లో రోగ నిరోధక శక్తి పెరిగి పలు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నేడు విశ్వవ్యాప్తంగా వృద్ధుల ఆరోగ్యంపై చర్చ ఊపందుకుంది. శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణతో పాటు వారి భావోద్వేగాలనూ పరిరక్షించాల్సి ఉంది.