ఐరోపా ఆఫ్రికా ఖండాల్లోని ఏ దేశ జనాభాతో సరిపోల్చినా ఇండియాలో పాఠశాల విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని 15 లక్షల 50 వేలకుపైగా పాఠశాలల్లో 24కోట్ల 75 లక్షలమంది చదువరులున్నారని, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత సెకండరీ దాకా 94 లక్షల 16 వేల మంది పైచిలుకు టీచర్లు భావితరాన్ని తీర్చిదిద్దుతున్నారని గణాంకాలు చాటుతున్నాయి. చూపులకు ఇంత ఏపుగా ఉన్న పాఠశాల విద్యారంగం- ఎంచబోతే మంచమంతా కంతలే అన్నట్లుగా తిరోగమన పథంలో ఉండటమే బెంగటిల్లజేస్తోంది. దేశీయంగా దాదాపు పది లక్షల 84వేల ప్రభుత్వ పాఠశాలలకు ఎకాయెకి 61 లక్షల 84వేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరైనా అందులో 17.14 శాతం, అంటే పది లక్షల 60వేల పైచిలుకు ఖాళీగా ఉన్నాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. సిక్కిమ్‌లో ఖాళీగా ఉన్న గురుపీఠాలు 57.5 శాతం కాగా ఝార్ఖండ్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్ వంటివి దాని వెన్నంటి ఉన్నాయి. ఏపీలో దాదాపు 35వేలు (14.1 శాతం), తెలంగాణలో 18 వేల (12.7 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పార్లమెంటుకు తెలిపిన కేంద్ర సచివులు- గురుపీఠాల భర్తీ నిరంతర ప్రక్రియ అని విశ్లేషించారు.
కొత్తరూపునివ్వాలి
ప్రపంచ విజ్ఞాన అమేయశక్తిగా ఇండియాను తీర్చిదిద్దడానికి నూతన జాతీయ విద్యావిధానాన్ని రూపొందించిన కేంద్రం- ఉపాధ్యాయ పోస్టుల భర్తీనే కాదు, వారి బోధన సామర్థ్యాన్నీ మరేమాత్రం విస్మరించే వీల్లేదు. వచ్చే ఏడాదికల్లా ఉపాధ్యాయ విద్యకోసం సమగ్ర జాతీయ పాఠ్యప్రణాళిక ముసాయిదా తయారుచేసి దరిమిలా 5-10 ఏళ్లకోసారి దాన్ని సవరిస్తామని కేంద్రం చెబుతోంది. సాంకేతిక అద్భుతాల ఆవిష్కరణలతో ప్రపంచం శరవేగంగా దూసుకుపోతుంటే, ఎప్పటికప్పుడు వాటిని ఆకళింపు చేసుకొంటూ విద్యార్థుల ప్రగతికి నిచ్చెన మెట్లుగా టీచర్లు నిర్వర్తించాల్సిన బాధ్యత గురుతరమైనది. దేశ భవిష్యత్ నిర్మాతలుగా ఉపాధ్యాయులను సరైన శిక్షణతో నిష్ఠగా సానపట్టి.. విద్యార్థుల శారీరక మానసిక వికాస కేంద్రాలుగా పాఠశాలలకు కొత్తరూపునివ్వాలి!