ప్రముఖ స్వరాజ్య సమర(స్వ.స) యోధుడొకరు జీవించి ఉన్న కాలంలోనే ఆయనకో శిలావిగ్రహం చేయించాలని అభిమాన సంఘం ఉబలాటపడింది. ప్రకటనలు గుప్పించింది. భూరి విరాళాలు సేకరించింది. భారీ కాంస్యవిగ్రహం పురమాయించింది. విషయం తెలియగానే- స్వ. స. యోధుడు స్వయంగా కమిటీ పెద్దలను కలిశాడు. 'ఆ మొత్తం నా చేతికిస్తే నేనే వచ్చి నిత్యం ఆ స్థలంలో నిలబడతాను. నా కుటుంబం రెండు పూటలా అన్నం తింటుంది' అన్నాడు.
వల్ల కాదంటున్న అయినవాడు
ఇది చమత్కారం కాదు. లోక వ్యవహారం. కన్నతల్లికి కూడు పెట్టడానికి మనసు రానివాడు, పినతల్లికి కోక పెడుతున్నానని చాటింపు వేస్తాడు. సేవ, దయ, త్యాగం, దానం వంటివి ఆదర్శప్రాయాలే గాని అందరికీ ఆచరణ సాధ్యాలు కావు. వల్లిస్తున్నప్పటి ధార తీరా చెల్లింపుల దగ్గర సన్నబడుతుంది. సొంతింట్లో సేవించే కన్నా వయోధికుల కోసం బయట వృద్ధాశ్రమాలు నిర్మించడం తేలికగా అనిపిస్తుంది. సబబుగా తోస్తుంది. గొడుగు ఎండనుంచే తప్ప గాడ్పు నుంచి కాపాడదు. వృద్ధాశ్రమాలూ అంతే. కన్న బిడ్డల చల్లని నీడను కోరుకొనే పెద్దలకు అవి చలివేంద్రాలు కావు, పంజరాలు. పక్షుల తీపి గానాలు వినాలనుకొంటే చెట్లను పెంచాలి తప్ప, పంజరాలను కొనుగోలు చేయడం సరైన విధానం కాదు.
ఎంత వద్దనుకొన్నా ప్రతివారూ వృద్ధులు కాక మానరు. ఆ జీవన సంధ్యలో... ఆ చరమదశలో... ఆ నిస్సహాయతలో ఆప్యాయత కోసం అలమటించే చివరి మజిలీలో... మనిషికి నిజంగా కావలసింది ఒక్కటే. ‘పొలాలు దున్నిన రోజులు, నాట్లు నాటిన దినాలు, కాపు కాసిన రాత్రులు, కోత కోసిన పొద్దులు, పనులతో బరువెక్కిన ఆ రోజులు మేఘాల్లా చెదిరిపోయాయి. ఇది యాత్ర ముగింపు వేళ. ఇప్పుడు కావలసింది కాసింత చెట్టు నీడ... చల్లని నీటి చెలమ... ప్రేమగా ఒకటి రెండు కుశల ప్రశ్నలు’ అన్నారు ‘పునర్యానం’లో కవి చినవీరభద్రుడు. కాకపోతే ఆ కాసింత కనికరాన్ని, చేయూతను, పలకరింపులను కన్నబిడ్డల నుంచి ఆశిస్తాయి పండుటాకులు. ఈ రోజుల్లోనూ అవి దక్కాయంటే అది మహాభాగ్యమే!
కలికాలంలో ఆత్మీయతలు, అనుబంధాలు క్షీణిస్తున్నాయని ఒకవైపు సామాజిక వేత్తలు ఆందోళన పడుతూంటే, ఉప్పెనలా విరుచుకుపడిన కరోనా మహమ్మారి మరోవైపు మానవ సంబంధాలను చావుదెబ్బ తీసింది. మానవతా విలువలను సమూలంగా ఊడ్చేసింది. పిడుగులా వచ్చి పడి మనిషితనాన్ని బూడిద చేసింది. ‘కరువై పోయాడమ్మా...మనిషనేవాడు’ అన్న కవుల పాటకు బాణీకట్టి కరాళ నృత్యం చేస్తోంది.
ఆత్మశాంతికి సైతం ఆస్కారం లేదు!
'ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది' అని కదా మన సామెత. కానీ ఇప్పుడు హృదయ విదారక స్థితి ఏమిటంటే- సొంతఊరు, వల్లకాడు... రెండూ 'కాదు పొమ్మ'నే అంటున్నాయి. కనీవినీ ఎరుగని దుస్థితి ఇది. కలిపురుషుడు సైతం ఊహించనిది. కరోనా అనుమానితుడైతే చాలు అయినవారు ఇంట్లోంచి, పొరుగువారు ఊళ్ళోంచి పొలిమేరలకు తరిమేస్తున్నారు. వారిని యమదూతల్లా చూస్తున్నారు. అలాంటి నిర్భాగ్యులకు ఒకప్పుడైతే శ్మశానమే శాంతిధామం అయ్యేది. ప్రేమగా ఒడిలోకి తీసుకొని ప్రశాంతతను ప్రసాదించేది. చివరికిప్పుడు వల్లకాడు సైతం వల్లకాదంటోంది.