కొవిడ్ వ్యాప్తి, కఠినమైన లాక్‌డౌన్‌ల విధింపునకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సరఫరా గొలుసులపై అంతరాయాల ప్రభావం కనిపించింది. దానివల్ల వైద్య పరికరాలు సహా అత్యవసర ఉత్పత్తుల సరఫరాలో వ్యయాలను గణనీయంగా తగ్గించడం, సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడం వంటి అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. అనంతరం చరిత్రలో ఎప్పుడూ లేనిస్థాయిలో ఆరోగ్యరంగానికి కొవిడ్ సవాలుగా నిలిచింది. తీవ్ర సంక్షోభాలను వేగంగా, సరికొత్త పద్ధతుల్లో ఎదుర్కోవలసిన అవసరాన్ని మహమ్మారి నొక్కి చెప్పినట్లయింది. భారత్‌లో వైద్య పరికరాలకు విపరీతమైన గిరాకీ ఉన్నప్పటికీ, దేశీయ ఉత్పత్తిరంగం తక్కువ విలువ కలిగిన ఉత్పత్తులకే పరిమితమైంది. ఎలక్ట్రానిక్ వైద్య పరికరాలతో పోలిస్తే 'మెడికల్ డిస్పోజబుల్స్, కంజ్యూమబుల్స్' వంటి పరికరాల ఉత్పత్తిని దేశీయంగా చేపట్టేందుకు పెట్టుబడుల అవసరం తక్కువగానే ఉంటుంది. అయితే మూలధనాన్ని ముందస్తుగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఖరీదైన వైద్య పరికరాల అవసరాలకు 70-90శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇతర దేశాలకు మన వైద్య పరికరాలను ఎగుమతి చేసేందుకు ప్రయత్నించడం కంటే 'దిగుమతి ప్రత్యామ్నాయం'పై దృష్టి సారించడం ముఖ్యం.
దిగుమతుల ఉచ్చు
వైద్య పరికరాల రంగంలో భారత్ ఆసియాలో నాలుగో పెద్ద విపణిగా వెలుగొందుతోంది. మొదటి మూడు స్థానాల్లో జపాన్, చైనా, దక్షిణ కొరియా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియా ఈ రంగంలో 20వ స్థానంలో ఉంది. ఇతర దేశాలు ఉత్పత్తులకోసం స్థానిక కంపెనీలను ప్రేరేపించే ప్రక్రియ రెండు మూడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. మన దేశంలో స్థానిక పరిశ్రమలను ఉత్పత్తుల దిశగా ఇప్పటికైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రానున్న అయిదు లేదా పదేళ్లలో- దిగుమతుల ఉచ్చు నుంచి దేశీయ వైద్య పరికరాల పరిశ్రమను కాపాడాలి. వైద్య సాంకేతిక రంగం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల విలువ కలిగిన విపణి. ఇది భవిష్యత్తులో మరింత ఉజ్జ్వలంగా రాణించేందుకు అవకాశాలు పుష్కలం. కొన్నేళ్లుగా ఈ రంగంలో ఇండియా అభివృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో వైద్యపరికరాల మార్కెట్ విలువ 1,100 కోట్ల డాలర్లు (80 వేల కోట్ల రూపాయలు). దేశీయ ఔషధ రంగం మూడు దశాబ్దాలకు ముందు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడి ఉండేది. సరిగ్గా అదే పరిస్థితిని ప్రస్తుతం దేశీయ వైద్య పరికరాల రంగం ఎదుర్కొంటోంది. 'భారత్‌లో తయారీ' ఉద్దేశానికి సార్థకత చేకూరేలా దేశీయ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం స్టెతస్కోపులు, గ్లూకోమీటర్లు వంటి సాధారణ స్థాయి పరికరాల నుంచి ఎంఆర్‌ఐ, సీటీ స్కానర్ల వరకు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో మరో పెద్ద సమస్య ఏమిటంటే- కస్టమ్స్ చట్టాలు అత్యంత సంక్లిష్టంగా ఉండటం. దురదృష్టవశాత్తు, వందల రకాల కస్టమ్స్ సుంకాలు అమలులో ఉన్నాయి.