భూగోళంపై ప్రతి జీవీ ప్రకృతిపై ఆధారపడి జీవిస్తుంది. గాలి, నీరు, నేల, అడవులు, ఖనిజ సంపదతోపాటు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి శిలాజ ఇంధనాలు ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు. ఇవి పర్యావరణంలో భాగంగా ఉంటూ మానవులు, జంతువులు, ఇతర జీవరాశుల మనుగడకు తోడ్పడతాయి.
ఒక దేశం భౌగోళిక ఉనికి, ఆర్థికాభివృద్ధిని అక్కడి సహజ వనరులు ప్రభావితం చేస్తాయి. భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలావరకు పరిమితమైనవి. స్వార్థపూరిత ఆలోచనతో మానవాళి వీటిని అపరిమితంగా వాడటం వల్ల ప్రకృతి మనుగడే ప్రమాదంలో పడింది. ఫలితంగా భూగోళంపై జీవజాతుల ఉనికి అగమ్యగోచరంగా మారుతోంది. ప్రకృతిలో నిక్షిప్తమైన సహజ వనరుల పరిరక్షణ, నిర్వహణపై అవగాహన కలిగించడానికి ఏటా జులై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఎలాంటి సంబంధం లేకుండా ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతిన బూనే రోజు ఇది.
ప్రమాదంలో జీవవైవిధ్యం
పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణలవల్ల సహజ వనరులపై నేడు తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. కాలుష్యం పెచ్చరిల్లుతోంది. అభివృద్ధి పేరిట మానవుడు ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు. అడవులు నరకడం, రసాయన ఎరువుల వినియోగం, శిలాజ ఇంధనాల వాడకం, ప్లాస్టిక్ వినియోగం, గనులు తవ్వడం... వంటి చర్యల వల్ల అసంఖ్యాక జంతు, వృక్షజాతులు అంతరిస్తున్నాయి.
పచ్చిక బయళ్లు, సముద్రతీరాలు, పగడపు దిబ్బలు, చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయి. భూకంపాలు, వరదలు, సునామీలు, రుతుపవనాలు గతి తప్పడం, హిమానీ నదాలు కరగడం వంటి ప్రకృతి వైపరీత్యాలు భూగోళాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మానవ చర్యల ఫలితంగా జీవావరణ వ్యవస్థలు అస్తవ్యస్తమైతే మానవుడి ఆహార, ఆరోగ్య భద్రతలకు ముప్పు వాటిల్లుతోంది. జంతువులు అంతరించి జీవవైవిధ్యం దెబ్బతింటే పలు వ్యాధులు విజృంభిస్తాయని అధ్యయనాలూ చెబుతున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రకృతి జీవవైవిధ్య విధ్వంస పాపఫలితమే!
భవిష్యత్ తరాలకు చెందాల్సిన..
రేపటి తరానికి చెందాల్సిన ప్రకృతి వనరులను నేటితరం తెగబడి దోచుకుంటోంది. ఈ చర్యలు సహజ వనరుల క్షీణత, పర్యావరణ అసమతుల్యతకు కారణమవుతున్నాయి. వచ్చే దశాబ్దంలో ఎదురయ్యే అయిదు తీవ్ర వాతావరణ సంబంధిత నష్టాలను ప్రపంచ ఆర్థిక ఫోరం 'ప్రపంచ ప్రమాద నివేదిక-2020' పేరిట విడుదల చేసిన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు
అందులో వరదలు, తుపాను వంటి విపరీత వాతావరణ సంఘటనలు ముందువరసలో ఉన్నాయి. దాని వెన్నంటి వాతావరణ మార్పులు తగ్గించడంలో వైఫల్యం ఉంది. మూడోవిభాగంలో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత పెనువిస్ఫోటాలను ప్రస్తావించారు. నాలుగో అంశంగా జీవవైవిధ్య నష్టాలు, పర్యావరణ వ్యవస్థల పతనాలను ప్రస్తావించారు. చివరిగా అయిదో అంశం- మానవ నిర్మిత పర్యావరణ నష్టాలు, విపత్తుల ప్రమాదాలను నివేదిక వివరించింది.
వ్యవసాయ, పారిశ్రామిక విస్తరణ వల్ల 85 శాతం చిత్తడి నేలలను ప్రపంచం కోల్పోయిందని, 75 శాతం భూ ఉపరితలం మార్పులకు లోనైందని, 66శాతం సముద్ర విస్తీర్ణం ప్రభావితమైందన్న అధ్యయనాంశాలు ఆందోళన కలిగించేవే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి పలు ఒప్పందాలు, తీర్మానాలను చేసి సుస్థిరాభివృద్ధి చర్యలను చేపట్టాలని ప్రపంచ దేశాలను ఆదేశించింది.
అందరి బాధ్యత
అభివృద్ధి మాటున మానవుడు చేపట్టే అనేక కార్యకలాపాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకృతి విధ్వంసానికి దారి తీస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు చట్టపరమైన, విధానపరమైన చర్యలు చేపట్టి సుస్థిరాభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా వాయు కాలుష్య నివారణకు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. కాలినడకను, సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలి.
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా సౌరశక్తి, పవనశక్తి, జలవిద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలి. పర్యావరణ సంరక్షణకు '3ఆర్'- తగ్గించడం (రెడ్యూస్), తిరిగి వాడటం(రీయూజ్), పునరుద్ధరణ(రీసైక్లింగ్) వంటి పద్ధతులు మనిషి జీవితంలో భాగం కావాలి. భూగర్భ జలాల పెంపు కోసం ప్రతి ఇంటా ఇంకుడు గుంతలను, ప్రతి గ్రామంలో చెక్‌డ్యాములను నిర్మించుకోవాలి. అడవుల పెంపకానికి ప్రోత్సహిస్తూ పర్యావరణహితకరమైన చర్యలు చేపట్టాలి.
ప్రకృతి పట్ల పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. నేటి కరోనా విపత్తులో ప్రభుత్వాలు సహజ వనరులపై ఉదాసీనత కనబరచకుండా అభివృద్ధి, సంరక్షణ రెండింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. మహాత్మా గాంధీ చెప్పినట్లు ‘ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు కాని... వారి దురాశను కాదు’ అనే మాటను గుర్తెరిగి ప్రకృతి వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి!
- సంపతి రమేష్ మహరాజ్ (రచయిత- సామాజిక విశ్లేషకులు)
ఇదీ చూడండి:మసీదుగా గురుద్వారా.. భారత్ అభ్యంతరం