పశ్చిమ్ బంగలో గురువారం.. ఎనిమిదో అంచె పోలింగ్ ముగియడంతో, నెల్లాళ్లకుపైగా విస్తరించిన 5 శాసనసభల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లయింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోంలలో ఏప్రిల్ ఆరో తేదీనే పోలింగ్ పూర్తవగా- బంగాల్ వాసులు ఇప్పటిదాకా పంటి బిగువున నిరీక్షించాల్సి రావడం, ఈసీ నిర్ణయ ఔచిత్యాన్ని ప్రశ్నిస్తోంది. కొవిడ్ కేసులు అనూహ్య స్థాయిలో పెచ్చరిల్లుతున్న కారణంగా కొంత మంది ఓటర్లు పోలింగుకు దూరంగా ఉండిపోవడం, రేపు రెండో తేదీన ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందోనన్న ఆందోళన అభ్యర్థుల్ని పట్టి కుదిపేస్తోంది.
అంతిమంగా విజయం ఎవరిని వరించినా, ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి కనీస జాగ్రత్తల్నీ గాలికొదిలేసిన ఈసీ- విధ్యుక్తధర్మం నిర్వర్తించడంలో కచ్చితంగా ఓటమిపాలైనట్లే! కొవిడ్ మహమ్మారి మాటువేసిన తరుణంలో నిరాక్షేపణీయంగా ఎన్నికలు నిర్వహించడమన్నది ఈసీకి అక్షరాలా కత్తిమీద సాము. అందుకు స్వీయ సన్నద్ధతను ఎలక్షన్ కమిషన్ గత సంవత్సరం అక్టోబరు నెల మూడోవారంలోనే అసందిగ్ధంగా వెల్లడించింది. జనసమీకరణ, ర్యాలీల నిర్వహణలో నిర్దిష్ట మార్గదర్శకాలను ఎవరు ఉల్లంఘించినా- విపత్తు నిభాయక చట్టం సెక్షన్లు 51 నుంచి 60 దాకా, భారతీయ శిక్షాస్మృతిలో 188వ సెక్షన్ మేరకు చర్యలు తథ్యమని అప్పట్లో అది హెచ్చరించింది. బిహార్ ఎన్నికల్లో ఆ మేరకు బాగానే అమలుపరిచినా, ప్రస్తుత ఎలెక్షన్లలో ఈసీ మిన్నకుండిపోయింది.
తుంగలో కొవిడ్ జాగ్రత్తలు
ఎక్కడికక్కడ కొవిడ్ జాగ్రత్తల్ని తుంగలో తొక్కిన పర్యవసానంగా పలు ఉన్నత న్యాయస్థానాలు ఈసీని బోనెక్కించాయి. భారీ ర్యాలీల్లో పార్టీల అగ్రనేతలు యథేచ్ఛగా కొవిడ్ నిబంధనావళిని ఉల్లంఘించినా ఉలుకూ పలుకూ లేని ఎన్నికల సంఘానికి ఈ భంగపాటు స్వయంకృతం. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలన్న మద్రాస్ హైకోర్టు తీవ్ర ధర్మాగ్రహం దరిమిలా మేలుకున్న ఈసీ, విజయోత్సవ ర్యాలీల మీద ఆంక్షలు విధించినంత మాత్రాన- వైఫల్యం తుడిచిపెట్టుకుపోదు!