ఆడపిల్ల పెళ్ళికి ఏది సరైన వయసు? మహిళల వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే దిశగా యోచిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంద్రాగస్టు ప్రసంగంలో ప్రకటించారు. దీనిపై జయాజైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ వివిధ వర్గాల అభిప్రాయాల్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్ళి వయసు ఎంత ఉండాలనేది మన దేశంలో కొత్త సమస్యేమీ కాదు. దశాబ్దాలుగా ఇది ఎంతకీతెగని చర్చగా సాగుతూ వస్తోంది. ఈ విషయంలో 1884లో వెలుగులోకి వచ్చిన ముంబయిలోని రుక్మాబాయి ఉదంతమే అత్యంత పాత కేసు. 1876లో రుక్మాబాయికి పదకొండేళ్ల వయసులో దాదాజి భికాజితో వివాహమైంది. అయినా తన సవతి తండ్రి, తల్లివద్దే ఉండిపోయారు. చివరికి భర్త వద్దకు వెళ్లేందుకు తిరస్కరించడం వల్ల 1884లో ప్రముఖ కేసుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్ హిల్ ఫినే ఈ వ్యవహారంలో బ్రిటిష్ సమ్మతి చట్టాన్ని వర్తింపజేయడం కష్టమని భావించారు.
ఈ తరహా ఉదంతం పూర్వాపరాలూ లభ్యం కాలేదు. పెళ్ళినాటికి రుక్మాబాయి చాలా చిన్నమ్మాయి కావడంవల్ల సమ్మతి లభించినట్లు భావించలేమనేది న్యాయమూర్తి అభిప్రాయం. నాటి సంప్రదాయ భారతీయ సమాజంలో ఆ అభిప్రాయానికి బలం చేకూరలేదు. కేసు తిరిగి ప్రారంభమైంది. రాబర్ట్ తీర్పునూ తిరగదోడారు. రుక్మాబాయి ఈ వ్యవహారాన్ని అంత తేలికగా వదలలేదు. విషయాన్ని ప్రఖ్యాత టైమ్స్ పత్రికకు రాయడం సహా బ్రిటిష్ రాణి విక్టోరియాకు పిటిషన్ పంపారు. చివరికి రాణి జోక్యం చేసుకొని వివాహాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తరవాత రుక్మాబాయి వివాదాలన్నింటినీ వదిలేసి, లండన్‌లో వైద్యవిద్య చదువుకోవడానికి వెళ్లారు. భారత్‌కు తిరిగి వచ్చి గుజరాత్‌లో చాలాకాలంపాటు ప్రజలకు వైద్యసేవలు అందించారు. ఈ కేసు ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
చట్టాల అమలులో వెనకబాటు
సమ్మతి వయసు చట్టాన్ని 1891లో ఆమోదించిన నాటి నుంచి మనదేశంలో పెళ్ళి వయసు అంశంపై వివాదం కొనసాగుతోంది. ఆ చట్టంలో పెళ్ళి వయసును నేరుగా ప్రస్తావించకుండా, లైంగిక కార్యానికి సమ్మతించే వయసును పది నుంచి పన్నెండేళ్లకు పెంచారు. చివరికి 1929లో బాల్యవివాహాల నిరోధక చట్టంలో పెళ్ళి వయసు బాలికలకు 14 ఏళ్లు, బాలురకు 18 సంవత్సరాలుగా నిర్ణయించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం గుర్తించే యత్నం జరిగింది. ఇదే ప్రఖ్యాత శారదా చట్టంగా పేరొందింది. తదనంతర కాలంలో వివాహ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లకు పెరిగింది. 2006లో వివాహ వయసు పరిమితుల్ని అదేవిధంగా ఉంచుతూ, చట్టం పేరును మాత్రం బాల్యవివాహ నిషేధ చట్టంగా మార్చారు. ప్రస్తుతం మన దేశంలో బాలికల కనీస పెళ్ళి వయసు 18 ఏళ్లు.
అయినా, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా చిన్నారి పెళ్ళికుమార్తెల సంఖ్య నమోదవుతున్న దేశమిది. నిత్యం పెద్ద సంఖ్యలో చిన్నారులు పెళ్ళిపీటలకు ఎక్కుతూనే ఉన్నట్లు ఐరాస జనాభా నిధి(యూఎన్‌ఎఫ్‌పీఏ) నివేదిక స్పష్టం చేస్తోంది. పెళ్ళి వయసు పెంచితే, బాల్యవివాహాలు తగ్గుతాయా అన్నదీ పెద్ద ప్రశ్నే. బాల్యవివాహాల నిషేధ చట్టం-2006 ప్రకారం వధువు, వరుడు కోరుకుంటేనే పెళ్ళి రద్దవుతుంది. తన పెళ్ళి చట్ట విరుద్ధమన్న సంగతే తెలియని ఓ బాలిక ఫిర్యాదు చేసే పరిస్థితి ఉంటుందా? ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు, అత్తామామలు అంగీకరిస్తారా అన్నదీ అనుమానమే. బాల్యవివాహాలకు కారణం పెళ్ళి వయసు తక్కువగా ఉండటం కాదని, ప్రస్తుతమున్న వివాహ చట్టాల అమలు సరిగ్గా లేకపోవడం, మహిళల విద్య, ఉపాధి, భద్రత వంటివన్నీ తోడవుతున్నాయని విదితమవుతోంది.