International Day for the Elimination of Violence against women : నిర్భయ, దిశ, హథ్రాస్ చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతుండగానే ఇప్పుడు శ్రద్ధావాకర్ ఘటన. ఇవి మాత్రమేనా? పసిపిల్లలపై అఘాయిత్యాలూ, అత్తింటి ఆరళ్లు, లైంగిక వేధింపులు ఇలా ఒక్కటేమిటి మన చుట్టూ లెక్కలేనన్ని సంఘటనలు. అందుకే ‘మహిళలపై జరుగుతోన్న హింస ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎత్తున సాగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘన’ అంటోంది ఐక్యరాజ్య సమితి. ప్రతి పదకొండు నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక మరణం ఆమె సన్నిహితుల చేతుల్లోనే జరుగుతోందంటున్నాయి ఐరాస నివేదికలు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన ఆరేళ్లతో పోలిస్తే 2021లో అత్యధికంగా వేధింపులు జరిగాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 26.35 శాతం ఎక్కువ.
ట్రోలింగ్ పట్టించుకోవద్దు..: పూజా హెగ్డే
మహిళలపై భౌతికంగానే కాదు.. ఆన్‌లైన్‌లోనూ వేధింపులు పెరుగుతున్నాయి. కట్టూ, బొట్టూ, నడత... అన్నింటినీ జడ్జ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ తరహా వేధింపులు స్త్రీలను మానసికంగా కుంగదీస్తూ, కొన్నిసార్లు చావు అంచుల వరకూ తీసుకెళ్తున్నాయి. దీనికి అడ్డుకట్ట పడాలంటే ట్రోలర్స్, ఫేక్ ఖాతాదారుల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. నేను వీటిని పట్టించుకోను. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటా.
గొంతు విప్పితేనే న్యాయం..!
కరోనా కాలంలో ఎన్నో బాల్యవివాహాలని అడ్డుకున్నాం. ఈ క్రమంలో మాపైనా దాడులు జరిగాయి. ఇక నిత్యం గృహహింసకు గురవుతోన్న మహిళలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. చాలా కేసుల్లో బాధితులు బయటకి రారు. నోరు విప్పరు. తమకేది కావాలో తాము నిర్ణయించుకోలేరు. అందుకే మహిళ పరిస్థితిలో మార్పు రావడం లేదు. విద్య, ఉద్యోగాల్లో ముందుకు వెళ్తూ, నైపుణ్యాలను పెంచుకుంటే ప్రశ్నించే స్థైర్యం అలవడుతుంది. మహిళలందరూ తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే స్థైర్యం పెరుగుతుంది.
చూసీ చూడనట్లు వదిలేయొద్దు...
ఇంటా, బయటా వేధింపులను అడ్డుకోవాలంటే ముందు మనమే మారాలి. మనకోసం మనం నిలబడాలి. ఎవరో ఏదో అంటారని న్యూనతకి లోనవ్వకూడదు. ఇంట్లో భర్తలు చేసే బాడీషేమింగ్, సూటిపోటి మాటలు పైకి కనిపించవు. వాటిని మొదట్లోనే అడ్డుకోవాలి. ఆత్మాభిమానానికి ఇబ్బంది ఎదురైనప్పుడు చూసీ చూడనట్లు వదిలేయడం మొదలుపెడితే అలుసుగా తీసుకుంటారు. మౌనంగా ఆ హింసను భరించటమో, ఆత్మహత్యో పరిష్కారం కాదు. కౌన్సెలర్ల సాయం తీసుకోండి. కొంత తేలికపడగలరు.
భయపడితే బలవుతారు...