శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న మీమాంస.. ఎన్నో రోజుల పాటు సాగింది. ఈ నిరీక్షణకు తెర దించుతూ అక్కడ ఎన్నికలు నిర్వహించటం... కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటం చకచకా జరిగిపోయాయి. మహింద రాజపక్స నేతృత్వంలోని ఎస్ఎల్పీపీ ఘనవిజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మిగతా పార్టీలన్నింటినీ పూర్తిగా వెనక్కి నెట్టి.. రేసులో ముందంజలో నిలిచింది.
ఇదీ చదవండి:ప్రధానిగా నాలుగోసారి పగ్గాలు చేపట్టిన మహింద
ప్రధానమంత్రిగా రాజపక్స ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇప్పుడు అందరి దృష్టి రాజ్యాంగ సవరణపైనే ఉంది. ఎన్నికల్లో ఇదే విషయం ప్రస్తావించి విస్తృతంగా ప్రచారం చేశారాయన. ఈ అంశంపై ఆయన ఎలా వ్యవహరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. దేశభద్రతకు ప్రాధాన్యత, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టటం లాంటి లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
సంకల్ప విజయం
రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికలు వాయిదా పడటం వల్ల... ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించే తీరాలన్న సంకల్పంతో ముందుకెళ్లిన శ్రీలంక... అనుకున్నది సాధించింది. ఆగస్టు 5న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 225 సీట్లకు 145 స్థానాలు దక్కించుకుని విజయం సాధించిందీ మహింద రాజపక్స సారథ్యంలోని శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) పార్టీ. మొత్తం 71% ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల భారీ ఆధిక్యంతో విజయదుందుబి మోగించింది. అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తున్న 19వ రాజ్యాంగ సవరణ ఎత్తివేయడమో లేదా మార్పులు తీసుకురావడమో చేస్తామన్న హామీ ఇచ్చారు రాజపక్స. ఆయన విజయంలో ఈ హామీ ప్రధాన పాత్ర పోషించింది.
సవరణ ఎత్తివేయాలా? సంస్కరించాలా?
మహింద రాజపక్స సోదరుడు... గొటబాయ రాజపక్స రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగా... ప్రధానిగా మహింద బాధ్యతలు చేపట్టారు. కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఈ 14న జరగనుంది. 26కు మించకుండా మంత్రుల సంఖ్య ఉండనుందని అంచనా. మరో 36మంది మంత్రులు బాధ్యతలు చేపట్టగానే... రాజ్యాంగ సవరణలు, కరోనాతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థకు మళ్లీ బలం చేకూర్చటం లాంటి అంశాలపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. 19వ రాజ్యాంగ సవరణ కింద ప్రభుత్వ ఏర్పాటుకు 45 మంది మంత్రులతో కొత్త క్యాబినెట్‌కు రూపలక్పన చేసే వీలవుతుంది. అయితే... ఈ సవరణ పూర్తిగా ఎత్తివేయటమా... సంస్కరించటమా అనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. అదే సమయంలో మిత్రపక్షాలు లేకుండానే ఓ స్వతంత్ర క్యాబినెట్ ఏర్పాటుపైనా చర్చలు జరుగుతున్నాయి.
సోదర ద్వయం మధ్యే
తన సోదరుడు గొటబాయ రాజపక్స అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితుల్లో... ప్రధానిగా తన అధికారాలకు, పార్లమెంటు విశేష అధికారాలకూ కోతపెడతారా..? అధ్యక్షుడికి అగ్రాసనం కట్టబెట్టేందుకు మహింద ఎంతమేరకు ముందుకు వస్తారు..? శ్రీలంకలో ఇప్పుడు ఈ అంశాలపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కుటుంబ రాజకీయాల ముద్ర పడినప్పటికీ... దేశ ప్రయోజనాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామన్న ధీమా ప్రజల్లో కలిగించటంలో విజయం సాధించింది రాజపక్స కుటుంబం. నిజానికి శ్రీలంకలో వర్గ భేదాలు ఎక్కువ. కానీ, ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే పరిస్థితుల్లో కొంతమేర మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ఫలితాలు ప్రజల్లోని జాతీయతా భావం, జాతీయ భద్రత పట్ల ఆకాంక్షలను ప్రతిబింబించాయన్నది నిపుణుల మాట.
కుటుంబంలో ఐదుగురు