కొన్నాళ్లుగా హత్యలు, మానభంగాలు, అపహరణలపై వార్తలు లేని రోజంటూ ఉండటం లేదు. మనుషుల్లో నేర స్వభావం పెచ్చరిల్లుతోందనడానికి నడుస్తున్న చరిత్రే నిదర్శనం. ఇలా మానవ మానసిక ప్రవర్తన నేర స్వభావంగా మారడానికి కారణాలు అనేకం. కష్ట పడకుండా లభించే భోగ లాలసత్వం, అదుపులో పెట్టుకోలేని లైంగిక కోరికలు, తమకన్నా బలహీనుల మీద దౌర్జన్యం చేసే మనస్తత్వం తదితర అంశాలు ప్రధానమైనవి. పెంపకం, విద్యావిధానం, పరిసరాలు మాత్రమే కాకుండా- సెల్‌ఫోన్లు, టీవీ కార్యక్రమాల్లోనూ ఇవే పెడ ధోరణులు ఉంటున్నాయి. స్వీయ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని తదనుగుణంగా తమ జీవిత గమనాన్ని సాగించడం మానేసి 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు' ఎవరితోనో తమను పోల్చుకుంటూ, ఏదో పొందాలనే యావతో పెడదోవ పడుతున్నారు.
నీతి కథలు చెప్పేవారు కరవు..
పిల్లలు మానసిక వికాసంతో ఎదిగేలా చూడటంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది. ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లింది. పిల్లలకు సరైన సూచనలిచ్చే పెద్దలు ఇంట్లో లేకపోవడం ఒకరకంగా లోపమే. ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలే. సాధారణంగా తల్లిదండ్రులిద్దరూ పనిచేసేవారే కావడంతో పిల్లలకు సరైన సూచనలిచ్చి నడిపించేవారు కరవయ్యారు. పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్చేందుకు చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. కానీ, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసేవారు బహు కొద్దిమంది. పునాది బలంగా ఉంటేనే ఎంతటి భవనం అయినా నిలబడుతుంది. వ్యక్తి జీవితానికి బాల్యం పునాదివంటిది. ప్రతి మనిషి జీవితంలో తొలి అయిదేళ్లు అమూల్యమైనవి. ఆ వయసులో వారికి అవగాహన శక్తి ఎక్కువ. అందువల్లే తల్లిదండ్రులు పిల్లల ఆలోచనా సరళిని విస్తృతపరచే విధంగా మాతృ భాషలో సరళమైన పదాలతో నీతి కథలు చెబుతూ విలువలను నేర్పాలి. పిల్లలకు తల్లిదండ్రులు ప్రథమ గురువులు. తరవాతే ఉపాధ్యాయులు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో వర్క్‌బుక్స్, ప్రాజెక్ట్ వర్క్ అంటూ పరుగులు తీయిస్తూ పసి మనసుల వికాసాన్ని కాలరాస్తున్నారు. పట్నంలో పెరిగిన పిల్లల కన్నా పల్లెటూళ్లలో పదిమంది మధ్యలో పెరిగిన పిల్లల మానసిక దృఢత్వం మెరుగ్గా ఉంటుందన్నది నిర్వివాదం.
నేరస్వభావానికి బీజం వేస్తున్న అన్లైన్ ఆటలు..