తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అంతర్జాలంపై 'డ్రాగన్‌' కన్ను- ఆపే సమయమిదే - టెలికమ్యూనికేషన్ సదస్సు హైదరాబాద్​ లో

యావత్ అంతర్జాల వ్యవస్థనే చైనా.. తన గుప్పిట్లలోకి తెచ్చుకోవాలనే కుయుక్తులు పన్నుతున్నట్లు సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019 సెప్టెంబరులో అంతర్జాతీయ టెలికాం సమావేశంలో చైనాకు చెందిన హువావే సంస్థ, ఇతర చైనా యూనికామ్‌ తదితర సంస్థలు కలిసి ప్రస్తుతమున్న ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ను సమూలంగా మార్చివేయాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని సైతం అందజేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ ప్రమాణాలపై సదస్సు జరగనున్న నేపథ్యంలో డ్రాగన్​ పన్నాగాలను భారత్ అడ్డుకోవాలని సైబర్ నిపుణులు కోరుతున్నారు.

opinion on china's eye to lead worlds internet
'అంతర్జాలంపై ‘'డ్రాగన్‌'’ కన్ను-అడ్డుకోవాల్సిన తరుణమిది'

By

Published : Jan 18, 2021, 8:16 AM IST

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచ సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ప్రజల దైనందిన జీవితాలు, సమాచారం, ప్రభుత్వ పాలన, రవాణా, పర్యాటకం, వినోదం.. వంటి అన్ని రంగాల్లో అంతర్జాల ప్రవేశంతో అనేక మార్పులు ఏర్పడ్డాయి. అమెరికన్‌ రక్షణ విభాగం పెంటగాన్‌ తన సైన్యం ప్రయోజనాల కోసం ఆర్పానెట్‌ను ప్రారంభించగా అనంతరం అదే మరిన్ని మార్పులతో ఇంటర్నెట్‌గా రూపాంతరం చెంది ప్రపంచం నలుమూలలకు చేరిపోయింది. అంతర్జాలానికి ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం, తటస్థత వంటి అంశాల కారణంగానే దీనికింత ప్రాధాన్యం దక్కుతోంది. వాస్తవానికి అంతర్జాలం ప్రపంచ ప్రజలందరిది. ఎవరికీ ఆధిపత్యం లేదు. అందరూ సమానులే అన్న సహజ న్యాయసూత్రం ఆధారంగా ఏర్పడిన అంతర్జాలంపై ఇప్పుడు చైనా కన్నుపడింది. మొత్తంగా వ్యవస్థను తన గుప్పిట పట్టాలన్న దుర్బుద్ధితో పావులు కదుపుతోంది. 2019 సెప్టెంబరులో అంతర్జాతీయ టెలికాం సమావేశంలో చైనాకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ హువావే, ఆ దేశ ప్రభుత్వ సారథ్యంలోని చైనా మొబైల్‌, చైనా యూనికామ్‌ తదితర సంస్థలు కలిసి ప్రస్తుతమున్న ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ను సమూలంగా మార్చివేయాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని అందజేశాయి. ఇలా చాపకింద నీరులా క్రమపద్ధతిలో యావత్‌ అంతర్జాల వ్యవస్థను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా వ్యూహం పన్నుతుండటంపై సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అంతర్జాల వ్యవస్థ 'ట్రాన్స్‌మిషన్‌ కంట్రోల్‌ ప్రొటోకాల్‌ (టీసీపీ)'/'ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (ఐపీ)' ఆధారంగా పని చేస్తోంది. ఈ విధానం ద్వారానే ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు అనుసంధానమై ఉంటాయి. టీసీపీ సమాచారాన్ని పంపేందుకు దోహదం చేస్తుంది. ఐపీ అనేది అంతర్జాలాన్ని వినియోగించే ప్రతి పరికరం పొందే గుర్తింపు. వీటి ద్వారా పరిమిత ప్రయోజనాలే ఉన్నాయని చెబుతూ, నూతన ఐపీ విధానం అవసరమని చైనా సూచిస్తోంది. ప్రధానంగా మూడు సవాళ్లను చైనా కంపెనీలు ప్రస్తావిస్తున్నాయి. మొదటగా ఈ విధానం టెలిఫోన్లు, కంప్యూటర్ల మధ్య అనుసంధించేందుకు మాత్రమే ఉపకరిస్తుంది. కానీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ప్రవేశంతో అనేక రకాల ఉపకరణాలు అంతర్జాలం ఆధారంగా పని చేస్తున్నాయి. అందుకని టీసీపీ విధానం సమర్థంగా పని చేయదని చైనా వాదన. రెండో అంశంగా భద్రత సమస్యలను ఎత్తిచూపుతోంది. మూడో అంశంగా కొన్నిచోట్ల మాత్రమే వేగంగా పని చేస్తోందని దీన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సి ఉంటుందని వాదిస్తోంది. అయితే, ప్రస్తుతం అమలవుతున్న ఐపీ విధానం భవిష్యత్తులోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తుందని అనేకమంది నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినా చైనా కొత్త ఎత్తుగడలతో ప్రతిపాదనలు చేయడం వెనుక ఉన్న దురాలోచనలను ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరముంది. మనం వినియోగించే సమీకృత వెబ్‌ను వీడాలని నెటిజన్లపై ఒత్తిడి చేసేందుకు వీలుగా నెట్‌ ప్రపంచంలో చైనా పూర్తి హక్కుల్ని సొంతం చేసుకునే ప్రమాదముంది. ఇప్పటికే హువావే ద్వారా 5జీని విస్తరించేందుకు యోచిస్తున్న అంశం తెలిసిందే. పైకి చూస్తే చైనా సూచనలు అంతర్జాల అభివృద్ధికి దోహద పడేలా కనిపిస్తున్నా, మొత్తం వ్యవస్థనే గుప్పిట్లలోకి తెచ్చుకోవాలనే కుయుక్తులు పన్నుతున్నట్లు సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హువావే తప్ప ఐపీ వ్యవస్థ మార్పును సూచించిన మూడు టెలికాం కంపెనీలు చైనా ప్రభుత్వ సారథ్యంలోనివే కావడం గమనార్హం. ఇప్పటికే ఆ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలపై కత్తెర పడుతుంటుంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాలకు ప్రవేశమే లేదు.

ఇంటర్నెట్‌ ఆవిర్భావం నుంచీ పూర్తి తటస్థంగా వ్యవహరిస్తోంది. కొన్ని దేశాలు లేదా సంస్థల నియంత్రణ ఉంటే సమాచార ప్రసారంపై ఆటంకాలు తప్పవు. చైనాతో చేతులు కలిపే కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ వ్యతిరేక సమాచారాన్ని పూర్తిగా నియంత్రించవచ్చు. కొత్త ఐపీ పేరిట చైనా అడుగుపెడితే ఒకే ప్రపంచం, ఒకే ఇంటర్నెట్‌ అనే ఆశయానికి గండిపడే ప్రమాదముంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ ప్రమాణాలపై సదస్సు జరగనుంది. ఈ సమావేశంలోనే చైనా ప్రతిపాదించిన ఐపీ మార్పు అంశంపై చర్చించనున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా లక్షల మంది సైబర్‌ నిపుణులు, ఔత్సాహిక యువ ఇంజనీర్లు అంతర్జాల అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా వ్యవహరించారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ఈ యజ్ఞంలో కోట్లమంది శ్రమించారు. ఇలాంటి వారందరి కృషిని రాజమార్గంలో దోచుకునేందుకు యత్నిస్తున్న డ్రాగన్‌ కుయుక్తులకు అంతర్జాతీయ సమాజం అడ్డుకట్ట వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నిర్ణయాత్మక సమావేశాలకు మన దేశమే వేదిక కావడంతో డ్రాగన్‌ పన్నాగాలను భారత్‌ అడ్డుకోవాలని సైబర్‌ నిపుణులు కోరుతున్నారు.

- కొలకలూరి శ్రీధర్‌

ఇదీ చదవండి :'ప్లాన్‌' ప్రకారమే.. రహస్యంగా చైనా నౌక సంచారం!

ABOUT THE AUTHOR

...view details