ఏడువారాలుగా ఎడతెరిపిలేని కొవిడ్ ఉరవడి, నాలుగు వారాలుగా విగత జీవుల ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా భయానక దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాపోయింది. ముంజేతి కంకణానికి అద్దమెందుకు అన్నట్లు- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, కేరళలతోపాటు మరో అయిదు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ బెంబేలెత్తిస్తోంది. సరిగ్గా మార్చి ఒకటిన దేశవ్యాప్తంగా 15,500 కేసులు నమోదుకాగా, నేడు ఆ సంఖ్య 12 రెట్లకు పైబడటం భీతిల్ల చేస్తోంది. ఒకే చితిపై ఎనిమిది పార్థివ దేహాల దహనంతో మహారాష్ట్ర, రాయపూర్ ఆసుపత్రిలో శవాల కుప్పలతో ఛత్తీస్‌గఢ్- కొవిడ్‌ను నిర్లక్ష్యం చేస్తే చెల్లించాల్సి వచ్చే మూల్యాన్ని కళ్లకు కడుతున్నాయి. నిరుటి కొవిడ్ పతాక స్థాయిని తాజా విజృంభణ దాటేసిందంటున్న కేంద్రం- కరోనా మార్గదర్శకాల్ని పట్టించుకోకపోవడం, స్థానిక ఎన్నికలు, పెళ్ళిళ్లు వంటి సమూహ సంబరాలతో నేటి ఉత్పాతం విరుచుకుపడిందని తీర్మానించింది. నిరుటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమలైన 'కొవిడ్ ప్రొటోకాల్'ను ఇప్పుడు ఎన్నికల సంఘం ఏ గంగలో కలిపింది? భగవంతుడిపై భక్తే కొవిడ్‌ను తరిమికొడుతుందన్న సూత్రీకరణలతో మొదలైన కుంభమేళా- కరోనా విశృంఖలత్వానికి కారణమవుతోంది!
టీకాలు అందరికీ చేరకుండానే, కేవలం అవి వచ్చేశాయన్న దిలాసాతో పౌరులనుంచి ప్రభుత్వాలదాకా ప్రదర్శించిన నిష్పూచీతనం- కొవిడ్‌కు కొత్త కోరలు తొడిగింది. ముందు జాగ్రత్తలపై పౌరుల్లో ఉదాసీనతతోపాటు కొత్త ఉత్పరివర్తనాల జోరూ జతపడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిరుడు ఈ రోజుల్లో మాదిరే ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ల కొరత కమ్ముకొస్తోంది. స్పుత్నిక్-వి సహా విదేశీ టీకాల అత్యవసర వినియోగానికి సమ్మతించిన కేంద్రం- రాష్ట్రాల్లో స్వస్థ సేవల రంగం కుంగిపోకుండా ఔషధ తయారీ పరిశ్రమతో సమన్వయం కుదుర్చుకొని కొవిడ్‌పై సమరాన్ని బహుముఖంగా సాగించాల్సిన సమయమిది!