పని ప్రదేశంలో మహిళ మానాభిమానాలపై పశుదాడికి తెగబడేవారికి ఆది గురువుగా భ్రష్టు పట్టినవాడు విరాటపర్వంలో కీచకుడు. కాంక్షల కళ్లతో కాటేస్తూ కాలనాగుల్లా వెంటాడే ఆ కీచక సంతతి- నేటి భారతంలో ఇందుగలదు అందు లేదన్న సందేహమే లేదు! ఎవరేమన్నా తలవంచుకు పోవాలంటూ ఆడపిల్లలకు నూరిపోసే సమాజంలో, తమకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తడమే మహాపరాధమవుతున్న వాతావరణంలో- 2017లో తొలిసారిగా గాలిమార్పు ప్రస్ఫుటమైంది. మహిళల సమానత్వ దినోత్సవానికి పురిటిగడ్డ అయిన అమెరికాలో హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ వేధింపులకు గురైనట్లు 70మందికి పైగా మహిళలు చేసిన ప్రకటన- దేశదేశాల్లో ‘మీ టూ’ ఉద్యమానికి నాంది. ప్రజాజీవనంలో లబ్ధప్రతిష్ఠుల చీకటి కోణాలపై వెలుగురేఖలు ప్రసరింపజేస్తూ 'టు ది హార్వీ వైన్‌స్టీన్స్ ఆఫ్ ది వరల్డ్' పేరిట వ్యాసం రాసిన ప్రియా రమణి అనే పాత్రికేయురాలు- 2018 అక్టోబరులో నాటి కేంద్రమంత్రి ఎంజే అక్బర్ పేరు బయట పెట్టడం సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడో తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసిన ప్రియా రమణిపై పరువు నష్టం కేసు పెట్టిన అక్బర్ దరిమిలా రెండు రోజులకే పదవికి రాజీనామా చేసి నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పటినుంచి ఎన్నో మలుపులు తిరిగిన కేసులో నాలుగు రోజుల క్రితం దిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు- అభిమానవతుల గుండె గాయాలకు చందనలేపనం లాంటిది. పరువునష్టం పేరిట క్రిమినల్ నేరాభియోగాలతో బాధితుల నోరు కుట్టేయడం కుదరదంటున్న తీర్పు భేషుగ్గా ఉన్నా- మహిళల్ని వేధించడమే మగతనమనుకొనే మహా జాడ్యానికి నేటికీ సరైన మందు కొరవడింది. ఆ వైనం చిత్తగించండి.
బాధితురాలిపైనే కేసు
ఆర్కన్ సాస్ గవర్నర్‌గా ఉన్నప్పుడు (1991) బిల్ క్లింటన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నాటి ఉద్యోగి పౌలా జోన్స్ పాతికేళ్ల క్రితం దాఖలు చేసిన కేసు పెను సంచలనం అయింది. కేసు దాఖలయ్యే నాటికి దేశాధ్యక్షుడిగా ఉన్న క్లింటన్‌కు రాజ్యాంగపర రక్షణలు ఏమైనా ఉన్నాయా అన్నదానిపై అక్కడి న్యాయపాలిక తీర్పు ఇవ్వగా, అంతటి అధ్యక్షుడూ అంతిమంగా పరువుమాసి, జరిమానా కట్టి లెంపలు వేసుకోవాల్సి వచ్చింది. దురదృష్టం ఏమిటంటే అక్కడి నేరన్యాయ వ్యవస్థకు భిన్నంగా ఇక్కడి బాధితురాలిపైనే పరువునష్టం కేసు దాఖలైంది.
ఉల్టా చోర్‌ల కోరలు పీకిన తీర్పు
'తమపై జరిగిన వేధింపుల గురించి ఎప్పుడైనా, ఏ వేదికద్వారా అయినా స్పందించే హక్కు స్త్రీలకు ఉంది' అని ప్రకటించిన దిల్లీ తీర్పు- 'స్త్రీ గౌరవాన్ని, జీవించే హక్కును పణంపెట్టి మరొకరి పరువు హక్కును కాపాడలే'మని ఉన్నతాదర్శానికి గొడుగు పట్టింది. సామాజికంగా పలుచన అవుతామన్న భయంతో చాలామంది మహిళలు తమపై జరిగే అఘాయిత్యాల్ని బయట పెట్టలేరంటూ- అందుకు ధైర్యం కూడగట్టుకొన్న వారికి దన్నుగా నిలబడే విధంగా తీర్పు వెలువరించింది. ఇంటా బయటా స్త్రీమూర్తుల గౌరవాన్ని నిలబెట్టడమే మగవారి పరువు చిహ్నంగాని, అధికార మద బలంతో అబలల్ని సాధించాలనుకోవడం అక్షరాలా క్రిమినల్ నేరమవుతుంది. అలాంటి 'ఉల్టా చోర్'ల కోరలు పీకిన తీర్పు ఇది!
భర్తఎదుటే
బాల్య వివాహాల్ని అడ్డుకొంటోందన్న కోపంతో రాజస్థాన్‌కు చెందిన భన్వారీదేవి అనే సర్కారీ సామాజిక కార్యకర్తను 1992లో ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారం చేశారు. ఏవో చిన్నా చితకా కేసులు పెట్టి దోషుల్ని తొమ్మిది నెలల్లోనే వదిలేసిన అవ్యవస్థపై పెల్లుబికిన సామాజిక ఆందోళనకు ఫలశ్రుతిగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.