1945 ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని ఓ విషాదకరమైన రోజు. ముఖ్యంగా జపాన్ వాసులనైతే ఇప్పటికీ ఆ తేదీ కలవరపెడుతూనే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా అణుదాడికి బలయ్యాయి జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలు. సరిగ్గా ఈ రోజునే హిరోషిమాలో లిట్ బాయ్ అనే అణుబాంబు విధ్వంసం సృష్టించగా.. ఆ ఘటనకు నేటికి 75 ఏళ్లు.
ఇదీ జరిగింది..
1945 ఆగస్టు 6న ఉదయం దాదాపు ఎనిమిదన్నర గంటలు(జపాన్ స్థానిక కాలమానం ప్రకారం). హిరోషిమా గగనతలంలో చక్కర్లు కొట్టింది 'ఎనోలా గే' అనే బీ-29 బాంబర్ విమానం.. 'లిటిల్ బాయ్' అనే అణుబాంబును జారవిడిచింది. ఫలితంగా కొన్ని సెకన్లలోనే కనీవినీ ఎరగనంత విస్పోటనం చోటుచేసుకుంది. ఆ దెబ్బకు హిరోషిమా శ్మశానంలా మారిపోయింది. బాంబు పేలగానే ఉష్ణోగ్రత 10 లక్షల సెంటిగ్రేడ్‌కు చేరింది. దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలోని అన్ని భవనాలు భస్మీపటలంగా మారాయి. ఈ దాడిలో దాదాపు లక్షా 40 వేల మంది జపాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఆ భయంకర విస్ఫోటనాన్ని తట్టుకొని పాక్షికంగా నిలిచిన జన్‌బకూ డోమే అనే భవనం మాత్రమే పాక్షికంగా నిలిచింది. ఇది హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందింది.
ఆ తర్వాత ఆగస్టు 9న నాగసాకి అనే పట్టణంలో మరోసారి అణుదాడి చేసింది అమెరికా. అనంతరం కాలంలో శాంతి ఒప్పందాల కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అణుదాడులు జరగలేదు.
భారీగా ఉండేవట..
ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో దాదాపు 55వేల న్యూక్లియర్ వార్హెడ్లు అమెరికా, రష్యా వద్దే ఉండేవని సమాచారం. 1970లో ఏర్పాటైన న్యూక్లియర్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) ద్వారా అణు స్థిరత్వాన్ని పెంచాలని.. అమెరికా, రష్యా ఒప్పందం చేసుకున్నాయి. అణ్వాయుధాల వాడకాన్ని పరిమితం చేయాలని నిర్ణయించాయి. అంతేకాకుండా రెండో ప్రపంచ యుద్ధంలో మరో పక్షంలో ఉన్న జర్మనీ, జపాన్, ఇటలీ న్యూక్లియర్ శక్తిని పొందకుండా చేయాలని ఎన్పీటీ ఉద్దేశించింది. ఏ దేశ భద్రతకైనా ముప్పు ఉందని కోరితే.. ఐరాస శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాలు(అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా) సాయం చేసేందుకు ముందుకొస్తాయని చెప్పారు. అయితే ఇతర దేశాలు మాత్రం తమ భద్రత కోసం అణుశక్తిని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.