సృష్టి, స్థితి, లయాలు విశ్వప్రవృత్తి అని, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఆ గుణాలకు అధిపతులని హిందువులు నమ్ముతారు. ఆంగ్లంలో ఈ త్రిమూర్తులను ట్రినిటీ అనవచ్ఛు ప్రపంచంలో తొలిసారి 1945 జులై 16న అమెరికా జరిపిన అణ్వస్త్ర పరీక్షకు ట్రినిటీ అని నామకరణం చేయడం కాకతాళీయం కాదు. అణు పరీక్ష విస్ఫోటన జ్వాలను చూసి ప్రధాన అణ్వస్త్ర సృష్టికర్త రాబర్ట్ ఒపెన్ హీమర్ భగవద్గీత శ్లోకాన్ని పఠించడం దీనికి నిదర్శనం. 'కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాఁ సమహర్తం ఇహ ప్రవృత్తః' అంటూ సాగే ఆ శ్లోకం అర్థం- 'నేను కాలుడిని, లోక క్షయా కారకుడిని'. అగ్రరాజ్య స్థితిని చాటుకోవడానికి అమెరికా సృష్టించిన అణు బాంబు నెల తిరక్కుండానే లయాన్ని సృష్టించి రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికింది. 1945 ఆగస్టు ఆరున జపాన్‌లోని హిరోషిమా నగరంపైన, ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపైన అమెరికా ప్రయోగించిన అణ్వస్త్రాల విలయ నర్తనంలో లక్షలమంది స్త్రీ, పురుష, బాల, వృద్ధులు హతమారిపోయారు. అసలు అప్పటికే చిత్తుగా ఓడిపోయిన జపాన్‌పై అణ్వస్త్ర ప్రయోగం అనవసరమని, అవేమీ లేకుండానే ఆ దేశం లొంగివచ్చేదని చరిత్రకారులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
అగ్రరాజ్య హోదా కోసం అర్రులు
యుద్ధానంతరం ప్రపంచంలో ఏ దేశమూ అమెరికాను తేరిపారచూడటానికి సాహసించలేని స్థితిని సృష్టించాలనే లక్ష్యంతో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ లయకారుడి అవతారమెత్తారు. అమెరికాను అజేయ అగ్రరాజ్యంగా నిలపాలన్న ట్రూమన్ తపన మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. సోవియట్ యూనియన్ తానేమీ తక్కువ తినలేదని అణ్వస్త్ర పరీక్షలు, ఆపైన హైడ్రోజన్ బాంబు పరీక్షలూ జరిపింది. అణు పాటవంలో తామే మిన్న అనిపించుకోవడానికి రెండు అగ్రరాజ్యాలు దశాబ్దాల తరబడి పోటాపోటీగా అణ్వస్త్రాలు సమకూర్చుకున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఈ రెండు అగ్ర రాజ్యాల వద్ద 68,000 అణ్వస్త్రాలు పోగుపడ్డాయి. అగ్రరాజ్యాల తరవాత బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, ఇజ్రాయెల్, పాకిస్థాన్, ఉత్తర కొరియాలు అణ్వస్త్ర రాజ్యాలుగా అవతరించాయి. వ్యూహపరమైన అస్త్రాల తగ్గింపునకు 2010లో కుదిరిన నూతన 'స్టార్ట్' ఒప్పందం కింద 2019నాటికి అమెరికా, రష్యాలు తమ అణ్వస్త్ర నిల్వలను భారీగా తగ్గించుకొన్నాయి. అయినా నేడు ప్రపంచంలోని తొమ్మిది అణ్వస్త్ర దేశాల వద్ద కలిపి మొత్తం 13,400 అణ్వస్త్రాలు ఉంటే, వాటిలో 90 శాతం పైగా (12,170) అమెరికా, రష్యాల అణు తూణీరాల్లోనే ఉన్నాయని స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి శోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు తమ దగ్గరున్న అణ్వస్త్రాల్లో 1,800 అస్త్రాలను క్షణాల్లో ప్రయోగించడానికి తయారుగా ఉంచాయి. శత్రువు దెబ్బతీసేవరకు ఆగకుండా తామే తొలివేటు వేసే అవకాశాన్ని అమెరికా, రష్యాలు అట్టిపెట్టుకున్నాయి. 2010నాటి నూతన 'స్టార్ట్' ఒప్పందం 2021 ఫిబ్రవరిలో ముగియనున్నా దాన్ని పొడిగించడానికి ఎవరూ చొరవ తీసుకోవడం లేదు.
అసలు ఇప్పుడున్న అణ్వస్త్రాలకే భూమండలాన్ని ఎన్నోసార్లు భస్మీపటలం చేసే శక్తి ఉన్నా.. రష్యా, అమెరికాలు పాత అణ్వస్త్రాల స్థానంలో సరికొత్త మహా విధ్వంసకర అణ్వాయుధాల తయారీకి వందల కోట్ల డాలర్లు ఖర్చుపెడుతున్నాయి. క్షిపణులు, విమానాలు, జలాంతర్గాముల నుంచి అణ్వస్త్ర ప్రయోగానికి సై అంటున్నాయి. రేపు అంతరిక్షమూ అస్త్ర ప్రయోగ వేదికగా మారుతుందనే భయాలు పెరుగుతున్నాయి. ఈ పోటీలో చైనా సైతం తక్కువ తినలేదు. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో అణు ప్రయోగ సత్తాను సాధించింది. భారత్, పాకిస్థాన్‌లు ఇదే సామర్థ్యాన్ని సంతరించుకోవడానికి పరుగులు తీస్తున్నాయి. ఉత్తర కొరియా అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఈ భయానక పరిస్థితిలో విజ్ఞులు, శాస్త్రజ్ఞులు, సామాన్య ప్రజలు అణ్వస్త్ర నిషేధానికి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు. అణు ప్రళయం ఈ రోజు అర్ధరాత్రి సంభవిస్తుందనుకుంటే, ఆ విలయానికి ప్రపంచం కేవలం 100 సెకనుల దూరంలో ఉందని ఈ ఏడాది ప్రచురితమైన ప్రపంచ అణు శాస్త్రజ్ఞుల బులెటిన్ హెచ్చరించింది. దీనికన్నా 1991 సంవత్సరంలో పరిస్థితే నయం. అప్పట్లో అమెరికా, రష్యాలు తమ అణ్వస్త్ర బలగాలను తగ్గించుకోవడానికి చర్చలు జరిపేవి కాబట్టి అణు విలయానికి 17 నిమిషాల వ్యవధి ఉండేదని ఇదే బులెటిన్ తెలిపింది.