కొత్త తరం మొబైల్ సాంకేతికతగా పేరొందిన 5జీ టెక్నాలజీని ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 40 దేశాలు వినియోగిస్తున్నాయి. పొరుగునున్న చైనా 5జీ మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తృతంగా వినియోగిస్తోంది. 6జీ ప్రయోగాలనూ ప్రారంభించింది. అంతేకాదు- 5జీకి అవసరమైన సాధన సంపత్తిని ప్రపంచానికి అందించడంలోనూ హువావే వంటి చైనా కంపెనీలే ముందున్నాయి. మన దేశంలో 5జీ ప్రయాణం ఇంకా మొదలే కాలేదు. ఈ సాంకేతికతను పొందాలంటే భారత్ కనీసం మరో రెండేళ్లపాటు వేచి చూడాల్సి ఉంటుందన్నది నిపుణుల మాట.
జియో, ఎయిర్‌టెల్ వంటి మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు 5జీ సాంకేతికతపై ఉత్సుకతగా ఉన్నా ప్రభుత్వం ఇంకా అందుకు అవసరమైన స్పెక్ట్రమ్ వేలం నిర్వహించలేదు. 5జీ సాంకేతికతకు అవసరమైన సాధనసంపత్తిని సమకూర్చుకునే విషయంలోనూ కేంద్ర నిర్ణయాలు ఈ విషయంలో వెనకబాటుకు కారణమవుతున్నాయని టెలికాం వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
4జీ కంటే వంద రెట్ల వేగంతో..
టెలికాం కంపెనీల అసంతృప్తిమొబైల్ నెట్‌వర్క్‌లో 5జీ ఓ పెను సంచలనం. అత్యధిక వేగం, తక్కువ లేటెన్సీ, ఎక్కువ కనెక్టివిటీ ఈ సాంకేతికతలో ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం వినియోగిస్తున్న 4జీ కంటే 5జీ 100 రెట్ల వేగంతో పని చేస్తుంది. సెకనుకు 15 నుంచి 20 గిగాబైట్ల (జీబీ) డేటాను ట్రాన్స్‌మిట్ చేయగల వేగం దీనిలో ఉంది.
ఒక సెల్‌ఫోన్ లేదా ఉపకరణంలో ఏదైనా పని చేయడానికి మనం మీట నొక్కినప్పటి నుంచి ఆ పని పూర్తవడానికి పట్టే సమయాన్ని లేటెన్సీ అంటారు. 4జీ కంటే 10రెట్లు తక్కువ సమయంలోనే పని పూర్తి చేసేంత తక్కువ లేటెన్సీ 5జీ సొంతం. ఉపకరణాలకు అనుసంధానత విషయంలోనూ ఈ కొత్త సాంకేతికత చాలా ముందుంది. 5జీతో ఒక చదరపు కిలోమీటరు పరిధిలో 10లక్షల ఉపకరణాలను అనుసంధానించవచ్చు.
సిద్ధమవుతోన్న అగ్రశ్రేణి నెట్‌వర్క్‌లు
దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలకు తాము సిద్ధంగానే ఉన్నామని- నెట్‌వర్క్ ప్రొవైడర్లు, 5జీ వ్యవస్థలతో పనిచేసే ఉపకరణాల తయారీదార్లు సిద్ధం కావడమే తరువాయి అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రకటించింది. వాస్తవానికి 5జీ నెట్‌వర్క్ కోసం దేశంలో అగ్రశ్రేణి మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. వొడాఫోన్ ఐడియా కూడా 5జీ పోటీలో ఉన్నామని ప్రకటించింది. ఈ నెట్‌వర్క్‌కు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే వాటికి అవరోధంగా మారుతున్నాయి. దీని ఏర్పాటుకు అవసరమైన స్పెక్ట్రమ్ వేలం విషయంలో ప్రభుత్వ ధోరణిపై టెలికాం కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. స్పెక్ట్రమ్ ధర విదేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందంటున్నాయి.
విక్రయాలపై కన్నేసిన ట్రాయ్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 5జీ స్పెక్ట్రమ్‌ను ఇండియాలో 3400-3800 మెగా హెర్ట్జ్ బాండ్‌లో విక్రయిస్తామని చెబుతోంది. ఈ బాండ్‌లో ఒక మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ ధరను ఏడు కోట్ల అమెరికా డాలర్లు (దాదాపు రూ.513 కోట్లు) మూలధరగా నిర్ణయించింది. అయితే ఇది దక్షిణ కొరియాలో 132 కోట్ల రూపాయలు, యూకేలో రూ.73 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ.37 కోట్లుగా ఉందని టెలికాం నెట్‌వర్క్ కంపెనీలు చెబుతున్నాయి. అందువల్ల స్పెక్ట్రమ్ ధర తగ్గించాలని కోరుతున్నాయి.
వాస్తవానికి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించాలని ట్రాయ్ భావించినప్పటికీ కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో అది సాధ్యం కాలేదు.ఆలస్యం చేస్తే వెనకబాటేదేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఓ అంచనా. అంత ఖర్చుతో కూడిన 5జీ నెట్‌వర్క్- భారత్‌కు ఇప్పుడు అవసరం లేదని ఓ వర్గం వాదిస్తోంది.