5g network launch: దేశీయ టెలి కమ్యూనికేషన్స్ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలకనున్న 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలాన్ని ఈ ఏడాదిలోనే నిర్వహిస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే(2022-23) సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించారు. 4జీ కంటే వంద రెట్లు వేగవంతమైన అంతర్జాలాన్ని, అంతేస్థాయిలో మెరుగైన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చే 5జీ సేవలు అందుబాటులోకి వస్తే కేవలం మొబైల్ ఫోన్ వినియోగదారులకే కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో (ఐఓటీ) పాటు పారిశ్రామిక, వైద్య రంగాలకూ అత్యాధునిక సాంకేతిక సంపత్తి అందుతుంది.
తొలుత ప్రధాన నగరాల్లో..
గతేడాది చివరికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చైనా అయితే మరో అడుగు ముందుకేసి 6జీ నెట్‌వర్క్ ట్రయల్స్ కూడా ప్రారంభించింది. ఆ దేశాలతో పోలిస్తే మనం కొత్త తరం సాంకేతికతను అందుకునే విషయంలో వెనకబడినట్లే. 5జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు తాము ఆసక్తి చూపుతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని ఎయిర్‌టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు ప్రభుత్వమూ 5జీ రాకకు పచ్చజెండా ఊపిన వేళ.. దీని అమలులో ఉన్న సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలల్లో 5జీ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించనున్నట్లు టెలికాం వర్గాలు చాలాకాలంగా చెబుతున్నాయి. బడ్జెట్‌లో మంత్రి ప్రకటన తరవాత స్పెక్ట్రమ్ వేలం మార్చిలోనే ఉండవచ్చనే చర్చ మొదలయింది.
5g technology launch date in india: అదే జరిగితే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి (2023 మొదట్లో) కనీసం దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చు. దేశంలోని 13 నగరాల్లో 2022లో 5జీ సేవలు ప్రారంభిస్తామని టెలికాం శాఖ ఇటీవల ప్రకటించడం దీనికి బలం చేకూరుస్తోంది. జియో చాలాకాలంగా 5జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. శాంసంగ్‌తో కలిపి 5జీ ప్రయోగాలు చేసిన జియో హువావే, ఎరిక్సన్, నోకియాలతోనే జట్టు కడతామని ప్రకటించింది. ఎయిర్‌టెల్ కూడా హువావే, జెడ్‌టీఈ, ఎరిక్సన్, నోకియాలతో కలిసి 5జీ ట్రయల్స్ చేపడతామని పేర్కొంది. వొడాఫోన్ కూడా తమ భాగస్వాముల పేర్లు ప్రకటించి, పోటీలో నిలిచింది. స్పెక్ట్రం వేలం పూర్తయితే ఇవన్నీ 5జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.