తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనాపై పోరులో ఆహారం కీలకం.. సూక్ష్మ పోషకాలే బలం - విటమిన్​ -డీ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ఇప్పట్లో కనుమరుగయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ప్రభుత్వాలు సూచిస్తున్న అన్ని జాగ్రత్తలను పాటిస్తూ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవటమే ఉత్తమమైన మార్గం. విటమిన్​-డీ, సీ లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి కరోనా మహమ్మారిని ఎదుర్కొగలమని ఓ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు.

5 ways nutrition could help your immune system fight off the coronavirus
కరోనాపై పోరులో ఆహారం కీలకం.. సూక్ష్మ పోషకాలే బలం

By

Published : Jul 3, 2020, 9:12 AM IST

కరోనా నేపథ్యంలో దశలవారీగా లాక్‌డౌన్లు నేర్పుతున్న పాఠాలు నిత్యస్మరణీయాలు. ప్రపంచవ్యాప్తంగాగానీ, దేశవ్యాప్తంగాగానీ ఇప్పుడప్పుడే వైరస్‌ కనుమరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే- వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్ఠపరచే పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అత్యవసరం. ఇందులో సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్‌-డి, నిమ్మజాతి పండ్ల నుంచి లభించే విటమిన్‌-సి, ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాలు అత్యంత ప్రాధాన్యం కలిగినవి. వ్యాధులను కట్టడి చేసే కొన్ని విటమిన్లను గురించి తెలుసుకొని ఉపయోగించడం మంచిది. కరోనా వైరస్‌ బారిన పడినప్పటికీ ప్రాణాలతో బయట పడాలంటే ప్రతిరోజూ పది నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం అత్యుత్తమ పరిష్కార మార్గమని ఆస్ట్రేలియాకు చెందిన చర్మ క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు డాక్టర్‌ రాబెల్‌ నీల్‌ సూచిస్తున్నారు. విటమిన్‌-డి ఎక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. విటమిన్‌-డి తక్కువగా ఉన్నవారిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని నీల్‌ పరిశీలనలో వెల్లడైన అంశం. ఈ రోగనిరోధక శక్తి ద్వారానే కరోనా వైరస్‌ను ఎదుర్కోగలమన్నది ఆ పరిశోధన సారాంశం.

సూక్ష్మ పోషకాలే....

కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలన్నా, సోకిన తరవాత త్వరితగతిన కోలుకోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. నిరోధక వ్యవస్థను పటిష్ఠపరచడంలో సూక్ష్మ పోషకాలు (విటమిన్లు) తోడ్పడతాయి. లేలేత సూర్యకిరణాల నుంచి లభించే సహజ సిద్ధ పోషకం విటమిన్‌-డి. రసాయన నామం కాల్సిఫెరాల్‌. ఉదయం పూట సూర్య కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కణజాలం విటమిన్‌-డిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఈ విటమిన్‌ మనం తీసుకునే ఆహారం, గుడ్లు, కాలేయం, కాడ్‌ లివర్‌ ఆయిల్‌ ద్వారా కూడా లభిస్తుంది.

విటమిన్​-సీ

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పోగుచేసే అతి ముఖ్యమైన సూక్ష్మపోషకం విటమిన్‌-సి. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. ప్రధానంగా నిమ్మజాతి పండ్ల నుంచి లభిస్తుంది. ఉసిరి, బత్తాయి, నిమ్మ, నారింజ, జామ, చెర్రీ, ఆకుకూరల్లో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్‌-సి తరచూ తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్ఛు ప్రతిరోజూ 90 మి.గ్రా. దాకా తీసుకోవచ్ఛు విటమిన్‌-ఈకి ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంది. వేరుసెనగ, పొద్దుతిరుగుడు, గుమ్మడి విత్తనాలు, మొలకెత్తిన గింజలు, పిస్తాలలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ తాజా కూరగాయలు, ఆకుకూరలు, బీన్స్‌, నిమ్మజాతి పండ్ల నుంచి లభిస్తుంది. క్యారెట్‌, బొప్పాయి, మునగ, గుమ్మడి, కీరదోస, ఆకుకూరలు తీసుకుంటే విటమిన్‌-ఏ లోపం ఉండదు. మటన్‌, చికెన్‌, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, బీన్స్‌, పప్పుదినుసుల ద్వారా ప్రొటీన్లు లభిస్తాయి. ఆకుకూరలు, బీన్స్‌, లివర్‌, కిడ్నీలలో ఇనుము ఎక్కువగా లభిస్తుంది. గుడ్లు, పాలు, బీన్స్‌, నట్స్‌, విత్తనాల ద్వారా జింక్‌ సమకూరుతుంది. గుడ్లు, బ్రౌన్‌ రైస్‌, బీన్స్‌, ఓట్స్‌, పప్పు దినుసులు, పుట్టగొడుగులు, పాలకూర, అరటిపండు వంటివి సెలీనియం తాలూకు ముడి పదార్థాలు.

అల్లం వల్ల ఎన్నో లాభాలు..

మరికొన్ని ఔషధ గుణాలు ఉండే ఆహార పదార్థాల నుంచి కూడా రోగనిరోధక శక్తిని పొందవచ్ఛు ఇకపోతే, అల్లం విశిష్టమైన ఔషధ పదార్థం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడే సరైన ఆహార పదార్థంగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సైంధవ లవణం, అల్లం రెండింటినీ నూరి అందులో నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. విష దోషాలు తొలగిపోతాయి. అజీర్తి తగ్గుతుంది. నిత్యం వంటకాలలో వేసుకోవడం వల్ల రక్త కణాలను అల్లం వృద్ధి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం, వెల్లుల్లి, వాములను కలిపి తేనీరులా తయారు చేసుకుని రోజుకు రెండుసార్లు సేవిస్తే పేగులు శుభ్రపడతాయి. ఊపిరితిత్తులు బలపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, యాంటీసెప్టిక్‌గానూ పసుపు తోడ్పడుతుంది. దీన్ని మిరియాలు, స్వచ్ఛమైన నెయ్యితో కలిపి తీసుకోవాలి. అప్పుడే శరీరం పూర్తిగా శోషించుకుంటుంది. అరచెంచా పసుపు, చెంచా నెయ్యి, చిటికెడు మిరియాలపొడిని కలిపి తీసుకోవాలి. తేనె దివ్యౌషధం. నిమ్మరసంలో తేనె కలుపుకొని పరగడుపున సేవిస్తే శరీరానికి కావలసిన శక్తితోపాటు చురుకుదనం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్‌ టీ తాగితే అన్ని విధాలా ఆరోగ్యకరం.

- గుమ్మడి లక్ష్మీనారాయణ (రచయిత సామాజిక విశ్లేషకులు)

ఇదీ చూడండి:కొవిడ్‌ కోరల్లో యువత.. అప్రమత్తంగా లేకుంటే అంతే!

ABOUT THE AUTHOR

...view details