తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సంస్కరణలకు మూడు దశాబ్దాలు- అందరికీ అందని ఫలాలు - మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారు. అయితే.. దేశంలో అప్పటి పరిస్థితులను గట్టెక్కించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ సంస్కరణలు దేశాభివృద్ధికి ఉపయోగపడ్డాయా?. ఒకవేశ ఉపయోగపడితే.. ఏ రంగాలు అభివృద్ధి చేందాయి?. ఏవి అభివృద్ధికి నోచుకోలేదు?. ఆర్థిక సంస్కరణలకు నేటితో మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం..

economic reforms
ఆర్థిక సంస్కరణలు

By

Published : Jul 24, 2021, 4:37 AM IST

Updated : Jul 24, 2021, 5:54 AM IST

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలకు నేటితో మూడు దశాబ్దాలు పూర్తయ్యాయి. 1991లో మన విదేశ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో 47 టన్నుల బంగారాన్ని తాకట్టుపెట్టి 400 మిలియన్‌ డాలర్ల (40 కోట్ల డాలర్ల)ను అరువు తెచ్చుకోవలసి వచ్చింది. ఈ తలవంపుల స్థితి నుంచి బయటపడటానికి పీవీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. వాటిలో భాగంగా లైసెన్సులు, నియంత్రణల వ్యవస్థకు ముగింపు పలికి ఆర్థిక వ్యవస్థలో మరిన్ని రంగాల్లోకి ప్రైవేటు సంస్థలను స్వాగతించారు. ప్రభుత్వ రంగానికి కేటాయించిన రంగాలను 17 నుంచి ఎనిమిదికి తగ్గించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించడం ప్రారంభించారు. దిగుమతి నిబంధనలను సరళీకరించి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. 1991 జులై మొదటి వారంలో భారతీయ రూపాయి విలువను 20శాతం మేర తగ్గించారు. 1993 అక్టోబరులో భారతీయ స్టేట్‌ బ్యాంకులో ప్రైవేటు వాటాల శాతాన్ని పెంచి- షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా రూ.3,212 కోట్ల పెట్టుబడులను సేకరించడానికి అనుమతించారు. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు పెట్టుబడులు సేకరించడం అదే మొదటిసారి. అంతవరకు ఉనికిలో ఉన్న అభివృద్ధి రుణ సంస్థలు (డీఎఫ్‌ఐ) క్రమంగా కనుమరుగై వాణిజ్య బ్యాంకులుగా మారిపోయాయి. 1991 మార్చి నాటికి ఇలాంటి ప్రాజెక్టులకు రూ.1,91,594 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేసిన వాణిజ్య బ్యాంకులు 2021కల్లా రూ.116 లక్షల కోట్లు ఇచ్చాయి.

విస్తృత ప్రభావం

ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తరవాత దేశార్థికంలో వ్యవసాయం వాటా గణనీయంగా తగ్గనారంభించి, సేవల రంగం విజృంభించింది. పట్టణీకరణ, మౌలిక వసతులు సమధికంగా విస్తరించాయి. నేడు టెలికాం, ఐటీ, ప్రైవేటు బీమా, ఈ-కామర్స్‌ రంగాల్లో అత్యధిక ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతోంది. సేవల రంగ విజృంభణ వస్తుసేవల వినియోగం అపారంగా వృద్ధి చెందడానికి కారణమైంది. మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ అంతర్జాలం భారతీయుల పని విధానాన్ని, జీవనశైలిని సమూలంగా మార్చేశాయి. నేడు దేశంలో 65శాతం ఆర్థిక కార్యకలాపాలకు స్వదేశంలో జరిగే వస్తుసేవల వినియోగమే మూలం. ప్రైవేటు, అసంఘటిత రంగాల ప్రాధాన్యం అమితంగా పెరిగింది. అయితే ఆర్థిక సంస్కరణల వల్ల మన యువతకు కావలసిన స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం పెద్ద లోపం. కొత్తగా పుట్టుకొచ్చిన ఉద్యోగాలన్నీ ప్రైవేటు, అసంఘటిత రంగాలవే. వీటిలో కూడా అధిక వేతనాలు ఇవ్వగల ఉద్యోగాల శాతం బాగా తక్కువ. నాణ్యమైన వస్తువులను తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ ఇంకా ఎదగలేదు. భారత్‌ అంతర్జాతీయ విపణిలో గట్టి పోటీ ఇవ్వగల స్థాయికి ఇప్పటికీ ఎదగలేదు. తక్కువ ధరకు తక్కువ నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయడంతో సరిపెట్టుకొంటోంది. 1991లో ఉద్యోగ బలగంలో సగం ప్రభుత్వ రంగంలోనే ఉండేవారు; ప్రస్తుతం దేశంలోని ఉద్యోగులు, శ్రామికుల్లో ప్రభుత్వ రంగంలో పనిచేసే వారి సంఖ్య చాలా స్వల్పం. భారత్‌లో ప్రతి 1000 జనాభాకు కేవలం 16 మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే- చైనాలో 57, బ్రెజిల్‌లో 111 మంది చొప్పున పనిచేస్తున్నారు. భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తికాల ప్రాతిపదికపై కాకుండా ఒప్పంద, తాత్కాలిక పద్ధతుల్లో సిబ్బందిని నియమించుకుంటూ, తక్కువ జీతభత్యాలను చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లోని 51 కోట్ల కార్మిక బలగంలో అత్యధికులు ప్రైవేటు, అసంఘటిత రంగాల్లోనే పని చేస్తున్నారు. 1991లో దేశ జనాభాలో 64.8శాతానికి ఉపాధి కల్పించిన వ్యవసాయ రంగంలో నేడు 40శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు.

చోటు చేసుకున్న మార్పులు

అనంతర స్థితి

ఆర్థిక సంస్కరణలవల్ల కొన్ని రంగాలు మాత్రమే లాభపడ్డాయి. సంస్కరణల తరవాత ఉపాధి రహిత అభివృద్ధి సంభవించింది. సమాజంలో ఆర్థిక అంతరాలు పెరిగాయి. ప్రజారోగ్య సంరక్షణలో పరిస్థితి మారలేదు. సంస్కరణల తరవాత ఏ కొద్ది అభివృద్ధి సిద్ధించినా, అదంతా అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులవల్ల, ఎడాపెడా చేసిన రుణాల వల్ల సాధించినదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, కుటుంబాలు అప్పులు చేసి బండి లాగిస్తున్నాయి. ఇది చాలా ఆందోళనకరం. 1991లో 5.89 కోట్ల రుణ ఖాతాలు ఉండగా, 2020కల్లా వాటి సంఖ్య 27.25 కోట్లకు పెరిగింది. సంస్కరణల అనంతరం కనిపించిన ఆర్థిక విజృంభణ ఈ అప్పుల కొండ చలవే. వ్యక్తులు, కుటుంబాలు అప్పు చేసి కావలసినవి కొనుక్కొంటున్నారు. కార్లు, ఇళ్లు కొనడానికి, విద్యావసరాలకు వ్యక్తిగత రుణాలు తీసుకొంటున్నారు. క్రెడిట్‌ కార్డుల వాడకం పెరిగిపోయింది. 1991లో మొత్తం బ్యాంకు రుణాలు రూ.2.85 లక్షల కోట్లయితే, 2021 మార్చి నాటికి అవి రూ.109.49 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. వీటిలో మూడోవంతు వ్యక్తిగత రుణాలే. ఇక రాష్ట్ర ప్రభుత్వాల రుణ భారం 1991లో రూ.1.28 లక్షల కోట్లయితే, 2020కల్లా అది రూ.52.58 లక్షల కోట్లకు పెరిగింది. కొవిడ్‌ వల్ల ప్రభుత్వాలు మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోంది. ఏతావతా ఆర్థిక సంస్కరణల ఫలాలు కొన్ని వర్గాలకు మాత్రమే అందుతున్నాయి. వీటివల్ల లైసెన్సులు, నియంత్రణల రాజ్యం తొలగిపోయిందనే సంబరం ఎన్నాళ్లో మిగల్లేదు. కంపెనీలను ఏదో ఒక విధంగా నియంత్రించాలనే ధోరణి బాగా పెరిగిపోయింది. 2019 ఎన్నికల తరవాత సంస్కరణల ఆవశ్యకత, వాటి దిశ పట్ల సందేహాలు బలపడ్డాయి. 99శాతం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని సంస్కరణలను కొనసాగించడం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం తన విధానాలను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేసి, న్యాయపాలన పాటిస్తూ, మేధాహక్కుల సాధన, విద్య, ఆరోగ్యాలపై పెట్టుబడులు పెంచాలి. అలా చేసినప్పుడు మాత్రమే ప్రధాన దేశాల సరసన సగర్వంగా నిలబడుతుంది. లేదంటే, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి సంపన్న దేశాలపై ఆధారపడి బతకాల్సి వస్తుంది.

ఇదీ చదవండి:'ఆ సంస్కరణల వల్లే ఆర్థికంగా బలపడ్డాం'

Last Updated : Jul 24, 2021, 5:54 AM IST

ABOUT THE AUTHOR

...view details