తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఎన్నికలపై దీదీ గురి- టీఎంసీలో కీలక మార్పులు

2021లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం పదునైన వ్యూహాలు రచిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఇటీవల అంపన్ పరిహార పంపిణీలో అవకతవకల వల్ల ఏర్పడిన కళంకాన్ని తొలగించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలసత్వం ప్రదర్శించిన పార్టీ జిల్లా అధ్యక్షులపై వేటు వేశారు. అటు భాజపా సైతం దీటుగా సిద్ధమవుతోంది.

2021 Bengal Assembly polls in eye, Mamata goes in for major reshuffle in TMC ranks
ఎన్నికలపై దీదీ గురి- పార్టీలో కీలక మార్పులు

By

Published : Jul 24, 2020, 2:05 PM IST

వచ్చే ఏడాది ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది బంగాల్. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. 21 మంది సభ్యులతో తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయ కమిటీ నియమించడం సహా తొలిసారి ఏడుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక పరిపాలనాధికారులను బదిలీ చేశారు. ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ చర్యల ద్వారా ఎన్నికల విషయంలో తాను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు ప్రతిపక్షాలకే కాకుండా పార్టీ వర్గాలకూ సంకేతాలిచ్చారు మమత.

పాత చరిష్మా కోసం

అంపన్ సమయంలో పరిహారాలు చెల్లించే విషయంలో అవకతవకలు జరగటం మమతా చరిష్మాకు కళంకం తెచ్చిపెట్టింది. ఇప్పుడీ మరకను తొలగించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారామె. ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో ఆమె నమ్మిన బంటులనే నియమించుకున్నారు. వారిలో కోల్‌కతా మాజీ మేయర్ ఫిర్హాద్ ఖాన్, రాష్ట్ర మంత్రులు సువేండు అధికారి, పార్థ ఛటర్జీ, శాంత ఛెత్రీ ఉన్నారు. ఇక ఎంతో కాలంగా అటు పార్టీకి ఇటు మమతాకు నమ్మకంగా ఉంటున్న సుబ్రతా బక్షీ, మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ, లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బ్లాక్‌లు, పంచాయతీ స్థాయిలో సంక్షేమ నిధులను తమకు కావాల్సిన వారికి పంచి పెట్టిన వారిని చూసీ చూడనట్టుగా వ్యవహరించిన జిల్లాల అధ్యక్షులపై మమత గుర్రుగా ఉన్నారు.

జిల్లా అధ్యక్షులపైనా వేటు

ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా ఇచ్చే బియ్యం, ఇతరత్రా ధాన్యాలను లాక్‌డౌన్ సమయంలో దారి మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా హావ్​డా, నదియా, దక్షిణ దినాజ్‌పుర్, కూచ్ బెహర్ జిల్లాల అధ్యక్షులపై వేటు పడింది. హావ్​డాలో అరూప్ రాయ్‌ స్థానంలో మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లాను నియమించారు. ఈ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోందని మమత దృష్టికి వచ్చింది. దక్షిణ దినాజ్‌పుర్‌లో అర్పితా ఘోష్ స్థానంలో గౌతమ్ దాస్, నదియాలో శంకర్ దత్తా స్థానంలో మహువా మైత్రా, కూచ్ బెహర్‌లో పార్థ ప్రతీమ్‌ అధ్యక్షులుగా నియమితులయ్యారు.

అలా జరగకూడదని...

నదియా, దక్షిణ దినాజ్‌పుర్, కూచ్‌ బెహర్ జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్రమంగా ప్రభ కోల్పోగా... భాజపా పట్టు సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర బంగాల్‌లోని 18 ఎంపీ స్థానాలకు గానూ అన్నిచోట్లా జయకేతనం ఎగురవేసింది భాజపా. ఈ చేదు అనుభవం మరోసారి ఎదురవకుండా ఉండాలన్నదే మమతా బెనర్జీ ప్రధాన లక్ష్యం. అందుకే ఈ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. హావ్​డాలో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రాష్ట్ర మంత్రి రాజీవ్ బెనర్జీని వ్యవహారకర్తగా నియమించారు. మొదటి నుంచీ అరూప్ రాయ్‌ వ్యవహార శైలితో విభేదిస్తూ వచ్చారు రాజీవ్. పార్టీలో బంధుప్రీతి ఉందని చాలా సార్లు బహిరంగంగానే విమర్శించారు. ఇక ఈ కమిటీలో అనూహ్యంగా మాజీ మావోయిస్టు సానుభూతిపరుడైన ఛత్రధర్ మహతోను నియమించారు. సీపీఐ మాజీ నేత రీటాబ్రతా బెనర్జీకి కూడా రాష్ట్ర కమిటీలో చోటు లభించింది.

రాష్ట్రంలో జంగిల్ మహల్‌గా పేరొందిన పశ్చిమ జిల్లాల్లోనూ ఈ మార్పులు చేర్పులు జరిగాయి. బంకుర జిల్లాకు శ్యామ్ సంత్రాను అధ్యక్షుడిగా నియమించగా... ఝార్‌గ్రామ్‌ జిల్లాకు దులాల్ ముర్ము, పురులియా జిల్లాకు గురుపద టుడు అధ్యక్షులుగా నియమితులయ్యారు. భాజపా పట్టున్న ఝార్ఖండ్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ఈ జిల్లాల్లో పార్టీకి ఓటమన్నదే ఎదురుకావొద్దన్న సంకల్పంతో ఉన్నారు మమతా బెనర్జీ.

సిద్ధమవుతున్న భాజపా

అటు భాజపా కూడా బంగాల్​లో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయో సమీక్షిస్తోంది. భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా సమావేశాలకు హాజరవుతున్నారు. వారం రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయని సమాచారం. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వీరితో పాటు భాజపా జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్, బంగాల్‌లో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్న శివ్ ప్రకాశ్, అర్వింద్ మేనన్, కైలాశ్ విజయ్‌వర్గియా సమావేశంలో పాల్గొననున్నారు.

తేలేది అప్పుడే

ఇలా ప్రధాన పార్టీలు జోరుగా సిద్ధమవుతుండటం వల్ల రాష్ట్రంలో ముందుగానే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. మరి విజయం ఎవరిని వరిస్తుందో తేలాలంటే వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే!

(రచయిత- దీపాంకర్ బోస్)

ABOUT THE AUTHOR

...view details