భీకరంగా మృత్యుభేరి మోగిస్తూ ఆర్థిక వ్యవస్థల్ని భిన్న రంగాల్ని ఛిన్నాభిన్నం చేస్తూ విజృంభించిన కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశంలో బృహత్తర వ్యాక్సినేషన్(Vaccination in india) ప్రక్రియ ప్రారంభమై పదినెలలు పూర్తయింది. జర్మనీ, సింగపూర్, బ్రిటన్, రష్యా, చైనా వంటిచోట్ల కొత్తగా కొవిడ్ కేసుల వ్యాప్తి ఆందోళన పరుస్తున్న తరుణాన, దేశీయంగా వ్యాక్సినేషన్(Vaccination in india) మందగించిన తీరు- ప్రమాద ఘంటికలు మోగిస్తోంది! తొలి పదికోట్ల కొవిడ్ టీకాల నమోదుకు 85 రోజులు పట్టగా- 90కోట్ల నుంచి 100 కోట్లకు కేవలం 19 రోజుల్లోనే చేరినట్లు అక్టోబరు మూడోవారంలో కేంద్రప్రభుత్వం సగర్వంగా విశ్లేషించింది. సెప్టెంబరు నెలలో సగటున రోజువారీ టీకాల సంఖ్య కోటి దాటిన మాట యథార్థం. ఇప్పుడా సంఖ్య 40-30 లక్షలకు పడిపోవడమే తీవ్రంగా కలవరపరుస్తోంది.
టీకాకు ముఖం చాటేస్తూ..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లకు పైబడిన జనాభాలో కనీసం ఒక్క మోతాదు కొవిడ్ టీకా(Vaccination in india) పొందినవారు 80శాతం. ఇంతవరకు రెండు మోతాదులూ వేయించుకున్న వయోజనులు 40శాతమే. ఇప్పటికీ 45-59 ఏళ్ల వయస్కుల్లో 43శాతం, అరవై సంవత్సరాలకు పైబడినవారిలో 37శాతం మేర రెండో డోసు వేయించుకోవాల్సి ఉందని సర్కారీ లెక్కలు చాటుతున్నాయి. ఆరోగ్య కార్యకర్తల్లోనూ 10శాతం వరకు మలి విడత కొవిడ్ టీకాకు ముఖం చాటేయడం విస్తుగొలుపుతోంది. ఝార్ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని 48 జిల్లాల్లో కొవిడ్ టీకాల కార్యక్రమం మందకొడిగా సాగుతున్నట్లు సమీక్షా సమావేశాల్లో నిగ్గుతేలినా- సత్వర దిద్దుబాటు చర్యలు ఇంకా ఊపందుకోలేదు. నిర్ణీత గడువు తరవాత రెండో మోతాదు పొందడానికి రావాల్సినవారిలో దాదాపు 11 కోట్లమంది(Vaccine second dose missed) విముఖత కనబరుస్తున్నారంటున్న కేంద్రం- రాష్ట్రాలవారీగా సబ్ డివిజన్ స్థాయిలోనూ జనచైతన్యం పెంపొందాలంటోంది. అందుకు ప్రధానంగా ప్రజాప్రభుత్వాలే చురుగ్గా పూనిక వహించాలి!
నిరాధార భయాందోళనలతో..