జాతీయోద్యమకాలంలో ఆ పాట పట్టణాల్లో పల్లెల్లో మారుమోగింది. ఆంగ్లేయుల్ని హడలగొట్టింది. తెలుగువారిలో చైతన్య స్ఫూర్తిని రగిల్చింది. అదే.. 'మాకొద్దీ తెల్లదొరతనం'. దాన్ని వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. దేశభక్తి ఉప్పొంగుతుంది. పుట్టి వందేళ్లయినా ఆ పాట తెలుగు హృదయాల్లో నిలిచే ఉంది. ఆ గేయకర్త గరిమెళ్ల సత్యనారాయణ(Garimella Satyanarayana Poems). శ్రీకాకుళం జిల్లాలో అప్పటి నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893లో సూరమ్మ, వెంకటనరసింహం దంపతులకు జన్మించారు. సమీప ప్రియాగ్రహారం వారి స్థిరనివాసం. కన్నేపల్లి లక్ష్మీనరసింహం ఆర్థిక సాయంతో విజయనగరం, మచిలీపట్టణాల్లో విద్యాభ్యాసం చేశారు. రాజమండ్రి ఉపాధ్యాయశిక్షణ కళాశాలలో చదువుకుంటుండగా గాంధీజీ ప్రకటించిన విద్యా సంస్థలు, న్యాయస్థానాలు, చట్టసభల బహిష్కరణ శంఖారావం గరిమెళ్లను కదిలించింది. చదువుకు స్వస్తి చెప్పి ప్రచారగీతాలు రాసి స్వయంగా పాడుతూ ఉద్యమం బాట పట్టారు. కారాగారవాస శిక్షనూ అనుభవించారు. ఆనందవాణి, గృహలక్ష్మి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభల్లో పనిచేశారు. త్రిలింగ పత్రికలో 'దుందుభి, వికారి' కలం పేర్లతో రాజకీయ వ్యాసాలు రాశారు. శారదా గ్రంథమాలను స్థాపించారు. తమిళం నేర్చుకొని 'కురళ్'ను, 'నాలడియార్' అనే నీతి గ్రంథాన్ని తెలుగు చేశారు. కొన్ని ఖండకావ్యాలు రచించిన ఆయన 'మాణిక్యం' అనే నాటకాన్నీ వెలువరించారు.
దౌష్ట్యంపై నిరసన
గరిమెళ్ల ఎన్ని రచనలు చేసినా, 1921లో రచించిన 'మాకొద్దీ తెల్లదొరతనం' ఆయనకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది. అదే ఏడాదిలో ఆ గేయం ఆంగ్లానువాదం టంగుటూరి ప్రకాశం 'స్వరాజ్యం' పత్రికలో ప్రచురితమైంది. 1920 నాటి సహాయ నిరాకరణోద్యమం, నాగపూర్ కాంగ్రెస్ తీర్మానాలు ఆ గేయరచనకు ప్రేరణ కావచ్చు. వందకుపైగా చరణాలు కలిగిన ఆ పాటను తెలుగు నేల నలుమూలలా తానే గొంతెత్తి పాడారు. వేలమంది యువతీ యువకులను స్వాతంత్య్ర సమరయోధులుగా తీర్చిదిద్దారు. ఆ గేయం బాగా ప్రచారంలోకి రావడానికి గేయ శైలి, గానం రెండూ తోడయ్యాయి.
'మాకొద్దీ తెల్లదొరతనం' గేయంలో భారతదేశంలోని అనేక సమస్యలను గరిమెళ్ల చిత్రించారు. ప్రజల కడగండ్లను ప్రదర్శించారు. తెల్ల ప్రభువుల దుర్మార్గాన్ని ఎండగట్టారు. మరే ఇతర ప్రబోధ గేయాల్లోనూ ఇంత విస్తృతంగా వాస్తవ పరిస్థితుల చిత్రణ జరగలేదు. 'పన్నెండు దేశాలు పండుచున్నాగాని/ పట్టెడన్నమె లోపమండీ/ ఉప్పుముట్టుకుంటే దోషమండీ/ నోటమట్టి గొట్టి పోతడండీ/ అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తింటామండీ'- మన పంటలను, వస్త్రాలను, ఖనిజాలను, ఇతర వనరులను ఆంగ్లేయులు ఎలా దోచుకుంటున్నారో గరిమెళ్ల వివరించారు. ఆర్థిక వ్యవస్థ పతనాన్ని కళ్లకుకట్టారు. 'మా చీరాల నెల్లా వొల్చాడు/ బంగారమెల్ల దోచాడు' అని పేర్కొన్న కవి, నాటి బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాన్ని వర్ణిస్తూ 'నూటనలుబది నాలుగు నోటికి తగిలించి/ మాటలాడ వద్దంటాడు/ మమ్ము పాటా పాడవద్దంటాడు', 'ధనము కోసము వాడు, దారి చేసికొని/ కల్లు సారాయమ్ముతాడు' అని రాశారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడూ కనిపిస్తాయి. స్వాతంత్య్రం సిద్ధించినా గరిమెళ్ల గీతంలో చెప్పిన సంఘటనలను పోలినవి ఇంకా చోటుచేసుకుంటుండటమే దురదృష్టకరం.