కాఫీ వడకట్టగా మిగిలిన పిప్పిని పెరటి మొక్కలకు ఎరువుగా, కీటకనాశనిగా ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో టెర్రస్, బాల్కనీలతో పాటు ఇంట్లోనూ మొక్కలను పెంచుతున్నారు. ఇలాంటి మొక్కలకు రసాయనిక ఎరువులు ఉపయోగిస్తే వాటి ప్రభావం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటికి సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించడం మంచిది. దీనికోసం ఒకసారి వాడిన కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది.
ఎరువును తయారుచేయండిలా..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కూరగాయల్లో రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయనే ఉద్దేశంతో కిచెన్‌గార్డెన్ ఏర్పాటు చేసుకొనేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి వారు వాడేసిన కాఫీ పొడితో తయారుచేసిన ఎరువును మొక్కలకు ఉపయోగించవచ్చు. కోడిగుడ్డు పెంకులను మెత్తగా చేసి ఒకసారి ఉపయోగించిన కాఫీ పొడిలో కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. అంతే.. కిచెన్ గార్డెన్‌కి కావాల్సిన ఎరువు తయారైపోతుంది. ఈ మిశ్రమం ద్వారా మొక్కలకు నత్రజని, భాస్వరం, క్యాల్షియం, పొటాషియం.. వంటివి పుష్కలంగా లభిస్తాయి. అయితే కిచెన్ గార్డెన్‌లో ఉన్న మొక్కల పరిమాణాన్ని బట్టి ఎరువును తయారుచేసుకోవాల్సి ఉంటుంది. దీనికీ ఓ సులభమైన చిట్కా పాటించవచ్చు. వాడేసిన కాఫీ పొడిని ఓ నాలుగు రోజుల పాటు సేకరించి దాంతో ఎరువు తయారుచేసి కొన్ని మొక్కలకు వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మొక్కల కోసం ఇదే పద్ధతిని పాటిస్తే అన్ని మొక్కలకు సహజమైన ఎరువు అందించవచ్చు.
పురుగులు రాకుండా..
కిచెన్‌గార్డెన్‌లో పెంచే ఆకుకూరలకు పురుగుల వల్లే ఎక్కువ బెడద ఉంటుంది. ఇవి మొక్కల ఆకులను తినేస్తుంటాయి. పురుగులు తినేయడం వల్ల జల్లెడలా మారిన ఆకులను ఆహారంగా తీసుకోవడానికి అంత ఆసక్తి చూపించరు. అలాగని ఆ మొక్కలను తొలగించనూలేం. అయితే కాఫీ పిప్పిని ఉపయోగించడం ద్వారా మొక్కలపై కీటకాలు చేరకుండా కాపాడుకోవచ్చు. దీనికోసం చెంచా కాఫీ పిప్పిని లీటరు నీటిలో కలిపి కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని మొక్కల ఆకులపై జల్లితే సరిపోతుంది. కాఫీ పొడి వెదజల్లే వాసనకు కీటకాలు మొక్కల దరిదాపుల్లోకి కూడా రావు.