తెలంగాణ

telangana

అమ్మలూ.. ఈ పుస్తకం ఎదిగే మీ కూతుళ్ల కోసమే..!

By

Published : Jul 24, 2020, 8:07 PM IST

నెలసరి.. ఎంత చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చైతన్యం కలిగించాలనుకున్నా ఇంకా దీన్నో శాపంలానే భావిస్తున్నారంతా! ఇక యుక్త వయసులోకి అడుగుపెట్టే అమ్మాయిలు సైతం దీని గురించి తెలుసుకోవడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అమ్మల దగ్గరా సిగ్గుపడుతుంటారు. పైగా పిరియడ్స్‌ గురించి చుట్టూ అలుముకున్న మూసధోరణులు వారి మనసుల్లో ప్రతికూలమైన ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. ఎదిగే అమ్మాయిల్లో కలిగే ఇలాంటి ఆలోచనల్ని, భావోద్వేగాలను తొలగించి నెలసరి అనే సున్నితమైన అంశం గురించి వారికి సంపూర్ణ అవగాహన కల్పించడానికి నడుం బిగించింది బాలీవుడ్‌ అందాల తార టిస్కా చోప్రా. నటిగా, నిర్మాతగానే కాకుండా.. మంచి రచయిత్రిగానూ పేరు సంపాదించుకున్న ఈ అందాల అమ్మ.. నెలసరి చుట్టూ అలుముకున్న మూసధోరణుల్ని తొలగించి.. యుక్తవయసులోకి వచ్చే అమ్మాయిలను చైతన్య పరచడానికి ఓ పుస్తకం రాశారు. మరి, దీని గురించి టిస్కా ఏమంటున్నారో తెలుసుకుందాం రండి...

tisca chopra to educate girls on menstrual health in new book
tisca chopra to educate girls on menstrual health in new book

నెలసరి అనేది చాలా సున్నితమైన అంశం. ఇలాంటి విషయం గురించి చుట్టూ అలుముకున్న మూసధోరణులు, ఆంక్షలు, వివక్ష.. వంటివన్నీ యుక్తవయసులోకి వచ్చే అమ్మాయిల మనసులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. నెలసరి అంటేనే వారు శాపంలా భావించేలా చేస్తున్నాయి. కానీ ఇది మనకు దేవుడు ప్రసాదించిన వరమంటూ తల్లులే తమ కూతుళ్లలో ప్రోత్సాహం నింపాలంటోంది అందాల అమ్మ టిస్కా చోప్రా. ఈ క్రమంలోనే యుక్తవయసుకు వచ్చే అమ్మాయిలకు నెలసరి గురించి తెలియజేయడానికి ‘యువర్‌ బుక్‌ ఆఫ్‌ పీరియడ్‌’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఆ అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇలా పంచుకుందీ ముద్దుగుమ్మ.

పుస్తకాల్లోని మ్యాజిక్‌ అదే!

‘నేను ప్రతిసారీ నా కూతురిని సంతోషపెట్టేందుకే ప్రయత్నిస్తా. మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణ తనకు ఉపయోగపడేలా ఉండాలనుకుంటా. అలాగే పిల్లలు పుస్తకాల ద్వారా కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. వాటిని చదవడాన్ని ఆస్వాదిస్తారు. నిజమే కదా మరి.. తల్లీపిల్లల మధ్య జరిగే సంభాషణల్లో కొన్ని క్లిష్టమైన అంశాల్ని కూడా పుస్తకాలు ప్రయోగాత్మకంగా వివరిస్తాయి. నేను కల్పిత కథలు చదవడం, రాయడం బాగా ఎంజాయ్‌ చేస్తా. ఈ క్రమంలోనే పిల్లలకు నాన్‌-ఫిక్షన్‌ పుస్తకాల అవసరం ఎంతో ఉందన్న విషయం గ్రహించా. తల్లిదండ్రులు తమకు ఉపన్యాసం ఇస్తున్నారనే ఫీలింగ్‌ ఏమాత్రం కలగకుండా ఈ పుస్తకాల ద్వారా వారికి స్పష్టమైన సమాచారం అందించచ్చు.

కూతుళ్ల కోసమే..!

నా కూతురు తారతో పాటు ఎంతోమంది యుక్తవయసులోకి అడుగుపెట్టే అమ్మాయిలకు నేను రాసిన ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది. తల్లులు, వారి కూతుళ్లు, వారి స్నేహితులు.. ఇలా అందరి మనసులకు ఎంతో దగ్గరగా ఉంటుందీ పుస్తకం. ఎంతోమంది నిపుణుల సలహాలను ఇందులో పొందుపరిచాం. యుక్త వయసులోకి వచ్చే అమ్మాయిల్లో చోటుచేసుకునే శారీరక మార్పులు, మానసిక భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. వాటికి అనుగుణంగానే అమ్మాయిలందరూ ముందుకెళ్లేలా ప్రోత్సహిస్తుందీ పుస్తకం. ఈ పుస్తకంలోని ప్రతి వాక్యం తల్లుల కోణం నుంచే రాయడం మరో విశేషం..

తల్లులూ! యుక్తవయసులోకి అడుగిడబోయే మీ కూతుళ్లకు ఈ పుస్తకాన్ని బహుమతిగా అందించేయండి.. అంటూ తాను రాసిన పుస్తకంలోని విశేషాలను పంచుకుందీ అందాల తార. ‘వెస్ట్‌ల్యాండ్‌ పబ్లికేషన్స్‌’ ముద్రించనున్న ఈ పుస్తకం ఈ ఏడాది డిసెంబర్‌లో అందుబాటులోకి రానుంది.

‘15 ఆగస్ట్‌’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన టిస్కా.. ‘లవ్‌ బ్రేకప్స్‌ జిందగీ’, ‘ఓ మై గాడ్‌’.. వంటి పలు హిందీ సినిమాల్లో నటించి అలరించింది. ఇక తెలుగులో ‘బ్రూస్‌లీ’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. బుల్లితెరపైనా పలు సీరియళ్లలో మెరిసిన ఈ అందాల తార.. ఎయిర్‌ ఇండియా పైలట్‌ సంజయ్‌ చోప్రాను వివాహం చేసుకుంది. ఈ జంటకు తార అనే కూతురు ఉంది. ప్రస్తుతం టిస్కా నిర్మాతగా, రచయిత్రిగానే కాకుండా.. మహిళల హక్కులు, వారి విద్య కోసం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

ఇదీ చదవండి:కరోనా సోకిందని తలుపులకు స్టీల్​ రేకులతో సీల్​!

ABOUT THE AUTHOR

...view details