తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2021, 8:01 AM IST

ETV Bharat / lifestyle

Shravana masam: శ్రావణంలో ఇంటికి కొత్త కళ.. ఇలా.!

శ్రావణం అంటేనే పండగలు, శుభకార్యాలు మొదలయ్యే మాసం. ఎంతో పవిత్రంగా భావించే ఈ నెల కోసం ముందు నుంచే సిద్ధమవుతుంటారు మహిళలు. ఇల్లంతా శుద్ధి చేయడం, వంటగదిని సర్దుకోవడం, పెయింటింగ్స్‌తో పూజగదికి కొత్త రూపు తీసుకురావడం.. ఇలా ఈ పండగ సీజన్లో తమ ఇంటిని తీర్చిదిద్దుకోవడంలో ఎవరి నైపుణ్యాలు వారివి! అయితే వీటితో పాటు ఇంటికి కొత్త కళ తీసుకొచ్చే, మనసుకు పునరుత్తేజితం కలిగించే కొన్ని వస్తువుల్ని కూడా ఇంట్లో ఏర్పాటుచేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఇంట్లో, మన మనసుల్లో ఒక రకమైన పాజిటివ్‌ ఎనర్జీ నిండుతుందంటున్నారు.

Shravana masam
శ్రావణంలో ఇంటికి కొత్త కళ

లక్ష్మీ దేవికి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ మాసమంతా మహిళలు పూజ చేస్తుంటారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, అలంకరణలు చేస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని వాయినాలు సమర్పిస్తారు. మరి మనతో పాటుగా మన ఇల్లు కూడా నూతనోత్తేజం, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలంటే అతివలూ ఈ చిట్కాలు పాటించండి.

పరిమళాలతో పాజిటివిటీ!

ఇల్లంతా పరిమళాలు వెదజల్లితే ఇంట్లో ఒకరకమైన పాజిటివ్‌ ఎనర్జీ నిండుతుంది.. ఇక ఆ సువాసనలు మన మనసును మరింత ఉత్తేజకరంగా మారుస్తాయి. అందుకే ప్రత్యేక పూజలప్పుడు, కొంతమంది పూజ చేసిన ప్రతిసారీ సాంబ్రాణి పొగ వేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పటికే ఇది మీకు అలవాటుంటే సరే.. లేదంటే మాత్రం కనీసం వారానికోసారి లేదంటే రెండుసార్లు ఇలా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది. అది కాదనుకుంటే.. పరిమళాలు వెదజల్లే డిఫ్యూజర్స్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. గంధం, లావెండర్‌.. వంటి వివిధ రకాల అత్యవసర నూనెల్ని వీటిలో ఉపయోగించి ఇల్లంతా పరిమళభరితం చేయచ్చు.

విండ్‌ఛైమ్స్‌తో కళగా!

ఇంటి లోపలే కాదు.. వెలుపల కూడా కళగా తీర్చిదిద్దడంలో అతివలది అందెవేసిన చేయి! ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవడం, హ్యాంగింగ్‌ లైట్స్, ఒక పాత్రలో పూలు పేర్చి ఇంటి ముంగిట్లో అమర్చడం.. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు అవుట్‌డోర్‌ హోమ్‌ డెకరేషన్‌ టిప్స్‌ పాటిస్తుంటారు. అయితే వీటితో పాటు ఇంటి ముంగిట్లో ఒక విండ్‌ఛైమ్‌ ఏర్పాటుచేసుకొని చూడండి.. పిల్లగాలికి ఊగుతూ.. దాన్నుంచి వచ్చే వినసొంపైన శబ్దం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది. అంతేకాదు.. దాంతో ఈ పండగ సీజన్లో ఇంటికి కొత్త కళ వస్తుంది కూడా! వీటిలోనూ మట్టితో చేసినవి, బెల్‌ ఛైమ్స్‌, ట్యూబ్యులర్‌ ఛైమ్స్‌, ప్యారాచూట్‌ ఛైమ్స్‌, లైట్లు అమర్చినవి.. ఇలా విభిన్న రకాల ఛైమ్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని తెచ్చుకొని ఇంటి ముంగిట్లో లేదంటే హాల్లో గాలి ఎక్కువగా ప్రసరించే చోట అమర్చుకుంటే సరి!

వాటికి బదులు ఇవి!

రోజూ మనం పూజలో భాగంగా అగర్‌బత్తీలు వెలిగించడం సహజమే! ఈ క్రమంలో కొంతమంది వెదురుతో తయారుచేసిన ధూప్‌స్టిక్స్‌ సైతం ఉపయోగిస్తుంటారు. అయితే వెదురు మండడం వల్ల చెడు వాయువులు వెలువడతాయంటున్నారు నిపుణులు. అందుకే వీటికి బదులుగా పేడతో తయారుచేసిన బత్తీలైతే.. ఇటు పరిమళాలు వెదజల్లడంతో పాటు అటు ఇంటి గాలినీ శుద్ధి చేస్తాయంటున్నారు. ఇక ఈ శ్రావణంలో ఉదయం, సాయంత్రం ఇంట్లో ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు జరుగుతుంటాయి కాబట్టి.. ఈ న్యాచురల్‌ అగర్‌బత్తీలతో ఇల్లంతా పరిమళభరితంగా, పాజిటివ్‌ ఎనర్జీతో నిండిపోతుందనడంలో సందేహం లేదు.

గది మూలల్లో ఇలా!

మనం ఎంత శుద్ధి చేసినా, ఎన్ని రకాల ధూపాలు వెలిగించినా.. ఇంట్లో మనకు కనిపించని ఎన్నో సూక్ష్మ క్రిములు దాగి ఉంటాయి. బయటి నుంచి వచ్చిన మన దుస్తులు, అపరిశుభ్రమైన చేతులు, చెప్పులతో అవి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుత కరోనా కాలంలో ఈ క్రిములు, బ్యాక్టీరియా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. అందుకే ఇలాంటి వాటిని దూరం చేసుకోవాలంటే ఓ సింపుల్‌ చిట్కా సూచిస్తున్నారు నిపుణులు.

ఇంట్లోని ప్రతి గది మూలలో కొద్దిగా సీ సాల్ట్‌/కర్పూరం/వేపాకులు.. వంటివి మూటగట్టి ఉంచితే.. గాలిలో ఉండే సూక్ష్మ క్రిముల్ని అవి లాగేసుకుంటాయి. ఫలితంగా ఇంట్లోని గాలి శుద్ధవుతుంది. అంతేకాదు.. గాలిని శుద్ధి చేసే ఇండోర్‌ ప్లాంట్స్‌ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే గాలి బాగా ఆడేందుకు తలుపులు, కిటికీలు తెరిచే ఉంచడం మరీ మంచిది. ఫలితంగా ఇంట్లో మనకు తెలియకుండానే ఒక రకమైన పాజిటివ్‌ ఎనర్జీ ఉత్పత్తవుతుంది. ఇది మన మనసునూ ఉత్తేజపరుస్తుంది.
ఇక వీటితో పాటు ఈ పవిత్ర శ్రావణమాసంలో కొంతమంది ఇంటి ముంగిళ్లలో గుమ్మడికాయ వేలాడదీయడం, పండగల కోసం ఇంటికొచ్చే అతిథుల్ని ఆహ్వానించే క్రమంలో ముంగిట్లో రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దడం, గుమ్మానికి డెకరేటివ్‌ తోరణాలు-పూల దండలు కట్టడం.. ద్వారా తమ ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుకుంటారు.

మరి, ఈ శ్రావణం కోసం మీరు మీ ఇంటిని ఎలా ముస్తాబు చేసుకున్నారు? ఎలాంటి అలంకరణ వస్తువులతో మీ ఇంటికి కొత్త కళ తీసుకొచ్చారు? ఆ విశేషాలను మాతో పంచుకోండి.. శ్రావణం వేడుకలను కొత్త కళతో, సరికొత్త ఉత్సాహంతో జరుపుకోండి!

ఇదీ చదవండి:Sravana masam: శుభకార్యాల మాసం.. 'శ్రావణం'

ABOUT THE AUTHOR

...view details