కరోనాపై అవగాహన కోసం!
భారతదేశానికి సంబంధించి కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ కూడా ఒకటి. దీంతో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో మరింత అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో తాజాగా తమ అధికారిక ట్విట్టర్ పేజీలో ఒక యానిమేటెడ్ వీడియోను పోస్ట్ చేసింది.
అలసత్వం వద్దు!
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొంతమంది మాస్క్ ధరించకుండానే స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మరికొందరు ముక్కు, నోటిని పూర్తిగా కవర్ చేయకుండా నామమాత్రంగా మాస్క్ ధరిస్తున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్కులు తీయడమో, అదేవిధంగా గాలి ఆడట్లేదంటూ మాస్క్‌ను గడ్డం కిందకు తోయడమో చేస్తున్నారు. ఈక్రమంలో మాస్క్ ధరించకపోయినా, ముక్కు, నోటిని పూర్తిగా కవర్ చేయకుండా మాస్క్ ధరించినా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ యానిమేటెడ్ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా ముక్కు, నోరు పూర్తిగా కవరయ్యేలా ధరించిన మాస్క్‌తో ఈ మహమ్మారి నుంచి ఎలా రక్షణ పొందవచ్చో ఇందులో చూడొచ్చు. వీటితో పాటు స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం లాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చో ఈ వీడియోలో ఉంది.