మామిడికాయ రసం
కావలసినవి:పచ్చిమామిడికాయ ముక్కలు: కప్పు, టొమాటో ముక్కలు: అరకప్పు, కందిపప్పు: టేబుల్‌స్పూను, ఉప్పు: సరిపడా, కరివేపాకు: 2 రెబ్బలు, ఎండుమిర్చి: మూడు, మిరియాలు: టీస్పూను, దనియాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, అల్లం తురుము: అరటీస్పూను, వెల్లుల్లి తురుము: అరటీస్పూను, ఆవాలు: టీస్పూను, పసుపు: టీస్పూను, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం:బాణలిలో కందిపప్పు, మిరియాలు, దనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి. ఓ గిన్నెలో పచ్చి మామిడికాయ ముక్కలు, టొమాటోలు వేసి అవి మునిగే వరకూ నీళ్లు పోసి ఉడికించి చల్లారాక గుజ్జులా చేయాలి. ఆ తరవాత అందులో సరిపడా నీళ్లు పోసి, పసుపు, అల్లం, వెల్లుల్లి తురుము వేసి కలపాలి. కందిపప్పు, మిరియాల పొడిని వేసి కూడా మరిగించాలి. తరవాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు పెడితే సరిపోతుంది.
చట్నీ
కావలసినవి:మామిడికాయ: ఒకటి(చిన్నది), కొత్తిమీర తురుము: 3 కప్పులు, పుదీనా తురుము: కప్పు, పచ్చిమిర్చి: ఆరు, అల్లం తురుము: టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, ఉప్పు: రుచికి సరిపడా, ఇంగువ: కొద్దిగా, జీలకర్ర: రెండు టీస్పూన్లు.
తయారుచేసే విధానం:మామిడికాయను చిన్న ముక్కలుగా కోయాలి. కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి తరగాలి. ఇప్పుడు చిన్న బాణలిలో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, సగం జీలకర్ర, అల్లం, వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి సరిపడా వేసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి ఆవాలు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి వేగాక కరివేపాకు వేసి వేయించి ఈ తాలింపును పచ్చడిలో కలపాలి.
రైతా...
కావలసినవి:మామిడికాయ: ఒకటి, పెరుగు: రెండు కప్పులు, ఉప్పు: రుచికి సరిపడా, కారం: అరటీస్పూను, జీలకర్ర పొడి: అరటీస్పూను, ఆవపొడి: అరటీస్పూను, కరివేపాకు: రెండు రెబ్బలు, ఇంగువ: చిటికెడు, ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం:మామిడికాయ కడిగి తొక్కు తీసి సన్నగా తురమాలి. ఓ గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టి, మామిడికాయ తురుము, ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇప్పుడు చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక కరివేపాకు కూడా వేసి రైతాలో కలపాలి.