తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

వృథా తగ్గిస్తే పొదుపు చేసినట్లే..!

కొత్తగా పెళ్త్లెన వాళ్లందరికీ ఖర్చులు ఎక్కువవుతుంటాయి. ఎంత తగ్గించుకుందామన్న కుదరదు. వృథా మాత్రం ఎక్కడ జరుగుతుందో తొందరగా అర్థం కాదు. చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఇలా జరుగుతుంది అంటున్నారు నిపుణులు. వాటిని సరిదిద్దుకోనంత కాలం ఇంటి బడ్జెట్ పరిమితి దాటిపోతూనే ఉంటుందంటున్నారు. మనం ఎలాంటి విషయాల్లో వృథాగా ఖర్చు పెడతున్నామో ఓసారి తెలుసుకుందామా..

money-saving-tips-for-housewives
వృథా తగ్గిస్తే పొదుపు చేసినట్లే..!

By

Published : Mar 5, 2021, 5:31 PM IST

వంటింట్లో ఇలా

వంటింటి బడ్జెట్‌లో కూరగాయలు, పండ్ల కొనుగోలు కోసం కేటాయించేది ఎక్కువగానే ఉంటుంది. ఈ ఖర్చుని తగ్గించుకోగలిగితే.. సగానికి సగం డబ్బు ఆదా అవుతుంది. అయితే ఖర్చు తగ్గించడమంటే ఏం కొనకుండా ఉండిపోవడం కాదని అర్థం చేసుకోవాలి. ఇందుకోసం తక్కువ ధరలో పోషకాలు నిండిన కూరగాయల్ని కొనడం ఒక పద్ధతైతే, కొన్న వాటిని వృథా చేయకుండా, పూర్తిగా వినియోగించుకోవడం మరో పద్ధతి. అంటే మరీ ఎక్కువ ధరలో ఉన్న కూరగాయలను తక్కువ మోతాదులో, తక్కువ ధరలో ఉన్నవి కాస్త ఎక్కువ కొనచ్చన్నమాట. ఇక వృథా చేయకుండా ఉపయోగించుకోవడానికి వాటిని భద్రపరుచుకునే విధానం కూడా తెలిసి ఉండాలి. ఏయే కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టాలో తెలుసుకొని వాటిని ఫ్రిజ్‌లో భద్రపర్చాలి. మిగిలిన వాటిని పేపర్‌బ్యాగ్స్‌లో పెట్టి కాపాడుకోవచ్చు. అలాగే పండ్లని ఫ్రూట్ బాస్కెట్‌లో పెట్టడమో లేదా ఫ్రిజ్‌లో అనుకూల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడమో చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత కూడా కొన్ని కూరగాయలు వాడిపోతాయి. అంతమాత్రాన అవి ఉపయోగించుకోవడానికి పనికిరావని కాదు. ఇలాంటప్పుడు వాటిని ఉప్పు వేసిన చల్లని నీటిలో కాసేపు ఉండనిస్తే తిరిగి తాజాగా కనిపిస్తాయి. ఇలా వాడిపోయే పదార్థాలు.. (ఆకుకూరల్లాంటివి) మార్కెట్ నుంచి తీసుకువచ్చిన రెండు, మూడు రోజుల్లో వాడేస్తే మంచిది.

ఏరోజుకారోజే..

ఇంటి ఖర్చులో పాలకయ్యే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది ఎక్కువగా పాలు కొనేసి ఫ్రిజ్‌లో భద్రపర్చుకుంటూ ఉంటారు. అయితే పాలు ఒకరోజు కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటే అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఏరోజు పాలను ఆరోజే తెచ్చుకోవడం మంచిది. అంతేకాదు.. తీసుకురాగానే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. అలాగే ఫ్రిజ్‌లో టెంపరేచర్‌ని కూడా అడ్జస్ట్ చేయడం వల్ల పాలు త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. లేదా పాలను తీసుకురాగానే మరగబెట్టుకొని అవి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా పాలను ప్యాకెట్‌లోనే ఉంచేస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

పూలలోనూ ఆదా..

ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం కోసం చాలామంది ఫ్లవర్‌వాజుల్లో తాజా పూలను అమరుస్తూ ఉంటారు. ఇలా ఫ్లవర్‌వాజుల్లో పెట్టుకునే పూలను ఎక్కువ రోజులు ఉండేలా కాపాడుకోగలిగితే ఇంటి అలంకరణ కోసం మనం పెట్టే బడ్జెట్ బాగా తగ్గుతుంది. దీనికోసం పూలు కొనేటప్పుడు, వాటిని అలంకరించేటప్పుడు కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి అలంకరణ కోసం పూర్తిగా విరబూసిన పూలను కాకుండా, మొగ్గల్నే కొని సూర్యకాంతి తక్కువ పడే చోట పెట్టండి. అలానే పూలని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వాటి కాడల్ని తుంచేయాలి. వాడిన పూరేకలను కూడా తొలగించాలి. ఎందుకంటే ఇలాంటివి ఉంటే పువ్వు తాజాదనాన్ని త్వరగా కోల్పోతుంది. అంతేకాదు.. కాడ తప్ప పువ్వులోని ఏ భాగం కూడా నీటిలో మునగకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీటిలో పువ్వు ఎక్కువసేపు తాజాగా ఉండేందుకు ఆ నీటిలో టీస్పూన్ చక్కెర వేయాలి. లేదంటే బొగ్గుపొడిని కూడా ఉపయోగించవచ్చు.

మన్నికగా..


బట్టలు ఉతికేటప్పుడు, వాటిని ఆరేసేటప్పుడు చిన్నపాటి చిట్కాల్ని పాటించడం వల్ల దుస్తులు ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉంటాయి. బట్టల్ని మరీ ఎక్కువ వేడి నీటిలో నానబెట్టడం, మురికి బాగా పోవాలని డిటర్జెంట్ ఎక్కువగా వేసి ఉతకడం లాంటి పనుల వల్ల వస్త్రాల్లోని పోగుల నాణ్యత దెబ్బ తింటుంది. అంతేనా! దుస్తుల రంగు కూడా వెలిసిపోయి పాత వాటిలా కనిపిస్తాయి. దాంతో త్వరగా కొత్త దుస్తులు కొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీటి ప్రభావం పరోక్షంగా మీ బడ్జెట్ పైనే పడుతుంది.

అవసరానికి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. కానీ వృథా ఖర్చులు చేయడం మాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు. కాబట్టి మీరు చేస్తున్న ఇలాంటి వృథా ఖర్చులేంటో ఓసారి పరిశీలించుకొని అందుకు తగ్గట్టు మీ అలవాట్లలో మార్పులు చేసుకోవడం ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిది.

ఇదీ చూడండి:రేప్ కల్చర్​ను అంతమొందించండిలా..

ABOUT THE AUTHOR

...view details