చిన్నారికి కొనిచ్చే బొమ్మ... ఒకప్పుడు ఆటవస్తువు మాత్రమే. కానీ ఇప్పుడు అది ఆ చిట్టితల్లికే చూడచక్కని ప్రతీక. పుట్టినప్పుడు చేసే బారసాల నుంచి పెళ్లీపేరంటం, పిల్లలు... ఇలా ఓ అమ్మాయి జీవితంలో జరిగే అన్ని వేడుకల్నీ బొమ్మల రూపంలో ప్రతిబింబించేస్తున్నారు తయారీదారులు. అంతేనా... ఆ అమ్మాయి వేసుకునే అన్ని రకాల ఫ్యాషన్ దుస్తుల్నీ ఆ బొమ్మలకీ కట్టేస్తున్నారు. కొత్తగా మ్యాచింగ్ ట్రెండ్‌నీ బొమ్మల ప్రపంచంలోకి తీసుకొచ్చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు తల్లీకూతుళ్ల బొమ్మలకీ మ్యాచింగ్ దుస్తుల్ని కుట్టేస్తున్నారు.
తల్లీ కూతుళ్ల బొమ్మలొస్తున్నాయ్! - barbie dolls
ఈమధ్య వేడుకల్లో తల్లీకూతుళ్లూ తండ్రీకొడుకులూ అక్కాచెల్లెళ్లూ లేదూ మొత్తం కుటుంబం మ్యాచింగ్ దుస్తుల్ని ధరించడం ఓ ట్రెండ్‌గా మారింది. అదికాస్తా ఇప్పుడు మనుషుల్ని దాటుకుని బొమ్మలకీ వ్యాపించింది. అవునుమరి... అమ్మాఅమ్మాయిల బొమ్మల్నీ మ్యాచింగ్ దుస్తులూ నగలతో అలంకరించేస్తున్నారు తయారీదారులు.
బొమ్మల ప్రపంచంలో బార్బీ ఓ సంచలనం అయితే, దాన్ని దేశాలకీ ప్రాంతాలకీ అనుగుణంగా విభిన్న వేషధారణల్లో తయారుచేయడంతో అది మరింత క్రేజీగా మారింది. దాంతో బొమ్మల తయారీదారులే కాదు, బొమ్మలంటే ఇష్టమున్నవాళ్లూ భారతీయ బార్బీ బొమ్మలకోసం చీరా లెహంగా సల్వారూ పాటియాలా పలాజో అనార్కలీ... ఇలా అనేక దుస్తుల్ని డిజైన్ చేసి అలంకరించేస్తున్నారు. పైగా వాటిని అచ్చం అమ్మాయిలకోసం రకరకాల ఎంబ్రాయిడరీలతో డిజైన్ చేసినట్లే చేస్తున్నారు. దూరం నుంచి చూసేవాళ్లకు అసలివి బొమ్మలా లేక మనుషులా అనిపించేంత అద్భుతంగా ఆ బట్టల్ని కుట్టేస్తున్నారు డిజైనర్లు. అంతేనా... డ్రెస్సుకి తగ్గట్టే నగల్నీ డిజైన్ చేస్తున్నారు. అక్కడితో ఆగితే చెప్పుకునేదేముందీ.... అమ్మాయి బొమ్మకి ఇప్పుడు పాపాయి బొమ్మని జతచేసి మ్యాచింగ్ డిజైనర్ దుస్తుల్నీ తయారుచేస్తోంది మాయా క్రాఫ్టీవర్క్స్. ఏ పెళ్లివేడుకకో తల్లీకూతుళ్లిద్దరూ కలిసి వెళుతున్నట్లున్న ఈ బొమ్మలు చూపరుల కళ్లను కట్టిపడేస్తున్నాయి.
ఐతే, బొమ్మల ప్రపంచంలో మ్యాచింగ్ కొత్త ట్రెండే కావచ్చు, కానీ పిల్లలకీ బొమ్మలకీ కలిపి మ్యాచింగ్ దుస్తులు రావడం మాత్రం మినీ మీ బొమ్మలతోనే మొదలైందని చెప్పాలి. అచ్చంగా అమ్మాయి పోలికలతోనే బొమ్మని తయారుచేసి ఇద్దరికీ మ్యాచింగ్ దుస్తుల్ని తయారుచేసిందా కంపెనీ. అది మొదలు అనేక కంపెనీలు బొమ్మలకీ పిల్లలకీ దుస్తులు కలిపి తయారు చేయడం ప్రారంభించాయి. కానీ తల్లిబొమ్మకీ పిల్లబొమ్మకీ మ్యాచింగ్ దుస్తులు డిజైన్ చేయడం మాత్రం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. సో, మున్ముందు బొమ్మల కుటుంబాలూ రకరకాల మ్యాచింగ్ దుస్తులతో కొలువుదీరనున్నాయన్నమాట.
- ఇదీ చూడండి :గోడ లోపల ఇల్లు... బుజ్జాయిలకు భలే థ్రిల్లు..!