తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పండ్లు, కాయగూరలు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి! - how to keep fruits fresh

చాలామంది వారానికి సరిపడా కాయగూరలు, పండ్లను ఒకేసారి కొని ఇంటికి తెచ్చుకుంటారు. అయితే ప్రత్యేకించి వేసవిలో ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో పండ్లు, కాయగూరల్ని కొనడం వల్ల అవి తాజాదనం కోల్పోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ కొన్ని కాయగూరలు వడలిపోయే అవకాశం ఉంటుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో అమర్చే ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

how-to-keep-vegetables-and-fruits-fresh-in-telugu
పండ్లు, కాయగూరలు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి!

By

Published : Mar 17, 2022, 9:15 AM IST

  • దాదాపు అన్ని వంటకాల్లో ఉపయోగించే కూరగాయ టొమాటో. అందుకే కిలోలకు కిలోలు వీటిని కొంటుంటారు చాలామంది. ఈ క్రమంలోనే అన్నీ పండినవి కాకుండా కొన్ని పచ్చిగా ఉన్న టొమాటోలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇలా పూర్తిగా పండని టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద, సూర్యకాంతి తగలకుండా నిల్వ చేస్తే రెండు మూడు రోజుల్లో పండుతాయి. అప్పుడు వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
  • నీటిలో కాస్త ఉప్పు, చక్కెర, వెనిగర్ కలిపి ఆ మిశ్రమంతో.. బయటి నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను శుభ్రం చేసి.. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
  • కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఇథిలీన్‌ వాయువును విడుదల చేస్తాయి. అది ఆ పండ్లు, కాయగూరల్ని త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. తద్వారా వీటి పక్కన నిల్వ చేసే ఇతర కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు కూడా త్వరగా పాడవుతాయి. కాబట్టి యాపిల్స్‌, ఆప్రికాట్స్‌, తర్బూజా.. వంటి ఇథిలీన్‌ విడుదల చేసే పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పటికీ వాటిని ఆకుకూరలకు దూరంగా ఉంచాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.
  • కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే జిప్పర్‌ బ్యాగ్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. అలాంటి బ్యాగులు అందుబాటులో లేకపోతే మామూలు కవర్లకే చిన్న చిన్న రంధ్రాలు చేయచ్చు. ఫలితంగా కాయగూరలకు గాలి తగిలి అవి కుళ్లిపోకుండా ఉంటాయి.
  • ద్రాక్ష పండ్లను నిల్వ చేసే ముందు వాటిని నీటితో బాగా కడిగి.. తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. అనంతరం ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్లను పరిచి అందులో ద్రాక్ష పండ్లను ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
  • వెల్లుల్లిని గది ఉష్ణోగ్రత వద్ద తేమ తగలని ప్రదేశంలో నిల్వ ఉంచితే ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి.
  • బంగాళాదుంపలు, ఉల్లిపాయలను సాధారణ బుట్టల్లో గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.
  • ఇక కట్‌ చేసిన కాయగూరల్ని బేకింగ్‌ సోడా ద్రావణంలో కడిగి నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇలా శుభ్రం చేయడం వల్ల వాటిపై ఉన్న దుమ్ము-ధూళి కూడా తొలగిపోతాయి.
  • అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం కంటే బయట ఉంచితేనే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి తొక్క త్వరగా నల్లగా మారుతుంది.
  • పుదీనా, కొత్తిమీర త్వరగా కుళ్లిపోవడం మనం గమనిస్తాం. అలా జరగకూడదంటే వాటిని పేస్ట్‌ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి.. ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.. లేదంటే వాటి కాడలను కత్తిరించి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకున్నా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details