తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఒకప్పుడు చేయని పనులను.. ఇప్పుడు చేయిస్తోంది కరోనా..!

ఏం మారింది.. ఏం మారింది.. అనుకుంటుంటే.. కరోనాతో అంతా మారిపోతోంది. కాలికి పని చెప్తూ.. బయట తిరుగుళ్లు లేవు. నాలుకకు ఆహా అనిపించే.. చిరుతిళ్లు లేవు. తెరపై నచ్చిన హీరో స్టెప్పేస్తే.. కాలు కదిపేందుకు థియేటర్లు లేవు. ఒంటరి జీవిగా మారిపోయాం. ఇంకెన్నో మారాయి.

corona-effect-on-life-style
ఒకప్పుడు చేయని పనులను.. ఇప్పుడు చేయిస్తోంది కరోనా..!

By

Published : Jun 17, 2020, 8:56 AM IST

రోనాకు ముందు ఇంటి నుంచి కాలు బయట పెడితే.. వచ్చేది రాత్రికే. ఇప్పుడో... కాలు బయటపెట్టడమేందుకని భయం. ఒకవేళ తెగించి పెట్టినా.. ఎక్కడికిరా? అని ఇంట్లో నుంచి ఓ పెద్ద అరుపు. కరోనాతో ఎన్నో మార్పులు. పల్లె, పట్టణమని ఏ తేడా లేదు. ఆన్​లైన్​లో పిల్లలకు పాఠాల నుంచి.. హోమ్​ నుంచే వర్క్ చేసే వరకూ.. మనిషి జీవితాన్ని మర్చేసింది కరోనా.

  • అంతా స్మార్ట్​గానే..

ఒకప్పుడు మీటింగ్ అంటే.. ఆ హడావుడే వేరు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు... వందల మందితో జరిగే.. సమావేశాలు.. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటింగ్స్​ అయిపోయాయి. అన్ని మీటింగ్​లు ఆన్​లైన్​లోనే. అంతేందుకు రాజకీయ సభలూ స్మార్ట్​గానే జరుగుతున్నాయి. ఓ ఐదు, పదేళ్ల తర్వాత అలా.. జరుగుతాయనుకుంటే.. కరోనా దెబ్బకు కాస్త ముందుగానే.. ముందుకు వెళ్లాం. పిల్లలకు జూమ్​ యాప్​లో​ క్లాస్​లయ్యాయి.. పెద్దలకు వీడియో కాల్ మీటింగ్​లు సర్వ సాధారణమైపోయాయి. ఇంట్లో ఉంటూనే.. అంతర్జాతీయ వేదికలపై మాట్లాడేస్తున్నాం.

  • ఛీ ఆన్​లైన్​లోనా...!

కాళ్లేమైనా.. విరిగాయా? బయటకు వెళ్లి కొనుకోవచ్చుగా. షాప్​కి వెళ్లి చూస్తేనే.. వస్తువు నచ్చేది. ఇవీ మెున్నటి వరకూ.. మన ఫ్రెండ్​తో మనం చెప్పిన సొల్లు కబుర్లే.. మరి ఇప్పుడేమైంది. అంతా.. ఆర్డర్ మాయ. పొట్టకు ఆకలేస్తే.. ఆన్​లైనే.. ఒంటికేమైన వస్తువు కావాలంటే.. ఆర్డర్ ఇవ్వడమే. కరోనాతో ఇది ఇంకా పెరిగింది. సరదాగా సాయంకాలం నడవలేని మనం.. చిన్న వస్తువు కోసం.. ఆన్​లైన్​కు రెగ్యూలర్ టూరిస్ట్​లుగా మారిపోయాం.

పక్క వాళ్లకు తాకొద్దు.. ఇతరులు తాకిన వస్తువును ముట్టుకోవద్దు.. ఇది కరోనా థియరీ. ఒక్క నొక్కు నొక్కితే చాలు.. డబ్బులు ట్రాన్స్​ఫర్ అయిపోవాలి. చిన్న పెద్దా.. తేడా లేదు ఇప్పుడంతా .. డిజిటల్ చెల్లింపులకే అలవాటవుతున్నారు. పర్సులు, జేబులో కరెన్సీనోట్లు పెట్టుకు తిరిగేవారు.. వ్యాలెట్‌ పేమెంట్లు, ఆన్‌లైన్‌ చెల్లింపులు ఒంట పట్టించుకుంటున్నారు.

  • అప్పుడు ఇవ్వని మనం.. ఇప్పుడు ఇచ్చేస్తున్నాం

పిల్లాడు ఏడ్చినా.. వాడికి అస్సలు ఫోన్​ ఇవ్వం.. ఈ వయసులో ఫోన్ ఏంటి? ఏబీసీడీలు నేర్చుకునే వయసులో వాడికెందుకు ఫోన్? తల్లిదండ్రులు చెప్పిన ఈ మాటలు... ఇప్పుడు తికమక అయిపోయాయి. ఫోన్ ఇవ్వకుంటే.. ఇళ్లు పీకి పందిరేసినా.. పర్లేదు అనుకునే మనం. ఇప్పుడు మాత్రం.. తీసుకో బుజ్జి బంగారం అంటూ.. పిలిచి ఫోన్ ఇస్తున్నాం. బయటకువెళ్తే.. లేని పోని సమస్య.. కరోనా భయపెట్టి చంపుతోంది.. ఏం చేస్తాం మరి!

  • టీవీలకు ఫెవి స్టిక్​లా అతుక్కుపోయాం

కాసేపు టీవీ చూసినా.. బోర్ కొట్టేది. ఆరుబయట కుర్చోవడమో.. స్నేహితులతో కలిసి బాతకాని కొట్టడమో.. చేసే మనం.. ఇప్పుడు టీవీలో వచ్చే.. నటుల కళ్లలో కళ్లు పెట్టి చూస్తున్నాం. ఎంత మారిపోయాం. టీవీ అంటే అస్సలు నచ్చక పోయినా.. టీవీ చూడటం ఓ ఉద్యమంలా చేసే.. గతి పట్టింది కరోనాతో. బయటకు వెళితే.. గండం రా రమ్మని పిలుస్తోంది. గ్రూప్ మీటింగ్​లకు గుడ్​ బై చెప్పేశాం.

  • ఇల్లే ఆఫీస్​

ఆఫీస్​కు వెళ్లాలంటే.. పొద్దున్నే లేచీ.. స్నానం చేసి.. పరుగో పరుగు అనుకుంటూ.. వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంట్లోనే.. అంతా. ఒక ఫోన్, ల్యాప్ టాప్ ఉంటే చాలు... ఇళ్లే ఆఫీస్​.. సాఫ్ట్​వేర్​లో అయితే ఏకంగా 90 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమే. ఈ విధానం కాస్త మంచికే.. ఆఫీస్ ఒత్తిళ్లు తెలియని ఇంట్లో వాళ్లు.. వీడేంటీ చిర్రుబుర్రులాడుతున్నాడు అనుకునేవారు... ఇప్పుడు మాత్రం చేసే పనేంటో.. ఎంత ఒత్తిడి ఉంటుందో ఇంట్లో వాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:హస్తకళాకారులకు కరోనా కష్టం

ABOUT THE AUTHOR

...view details