తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

SAGGUBIYYAM: మంచి ఎనర్జీ బూస్టర్.. ఎన్ని లాభాలో తెలుసా! - సగ్గుబియ్యం జావా

మంచి ముత్యాల్లాంటి సగ్గుబియ్యమంటే ఆడవాళ్లకి మహా ఇష్టం కదూ! సులువుగా పాయసం చేసేయొచ్చు. ఉడికించి చీరలు, చుడీదార్లకు గంజి పెట్టేసుకోవచ్చు. దానివల్ల ఇంకా ఏమేం లాభాలున్నాయో చూద్దాం...

SAGGUBIYYAM
సగ్గుబియ్యం

By

Published : Jul 9, 2021, 10:59 AM IST

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది మంచి ఎనర్జీ బూస్టర్​గా పని చేస్తుంది. సహజంగా వీటికి ఏ రుచీ ఉండదు కనుక స్వీట్లు, సూపు మొదలైన వాటిల్లో వాడతారు. సగ్గు బియ్యంతో ఉప్మా, కిచిడీ చేయొచ్చు. అది చేయడం సులువూ, రుచీ కూడా. నూనెలో వేయించి ఉప్పూ కారం జల్లితే పిల్లలు ఇష్టంగా తింటారు.

కావలసినవి:సగ్గుబియ్యం: అరకప్పు, పల్లీలు: పావుకప్పు, కిస్‌మిస్‌: పావుకప్పు, జీడిపప్పు: పావుకప్పు, కారం: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీవిధానం:స్టౌమీద బాణలి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడయ్యాక సగ్గుబియ్యాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ అవి పొంగేవరకూ వేయించుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. అదేవిధంగా పల్లీలు, జీడిపప్పు, కిస్‌మిస్‌లను ఒక్కొక్కటిగా వేయించుకుని తీసుకోవాలి. వీటన్నింటినీ ఓ గిన్నెలో తీసుకుని ఉప్పు, కారం కూడా వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి.

సగ్గు జావ

కడుపునొప్పి, డయేరియా, జ్వరం, నిస్సత్తువ, బరువు తగ్గిపోవడం లాంటి సందర్భాల్లో సగ్గు జావ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించే పొటాషియం ఉంది. చెడు కొలెస్ట్రాల్​ను పెరగనివ్వదు. కాల్షియం, అమినో ఆసిడ్స్‌ ఉన్నందున ఎముకలకు, జుట్టుకు మంచిది. బరువు పెరగాలనుకునే వాళ్లు సగ్గు బియ్యం జావ తాగితే ఫలితం ఉంటుంది. గర్భిణులకు ఐరన్‌, క్యాల్షియం లాంటి పోషకాలను అందిస్తుంది. ఇది ఎండాకాలంలో వచ్చే నీళ్ల విరేచనాలను అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే పాలు కాకుండా పెరుగుగానీ మజ్జిగగానీ కలపాలి. ఉడికేటప్పుడే జీలకర్ర లేదా పొడి వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

కావాల్సినవి: సగ్గుబియ్యం- నాలుగు టేబుల్‌స్పూన్లు, పాలు- అరకప్పు, పంచదార- టేబుల్‌స్పూన్‌, ఉప్పు- చిటికెడు.
తయారీ: సగ్గుబియ్యాన్ని రెండు, మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి. నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా మెత్తబడేంతవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పాలు, పంచదార, ఉప్పు కలపాలి.

ఆరోగ్యానికే కాదు, అందానికీ పనికొస్తుంది. నానబెట్టిన సగ్గుబియ్యంలో పాలు, తేనె కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మానికి కాంతి వస్తుంది, ముడతలు రావు.

ఇదీ చూడండి:సగ్గుబియ్యంతో లడ్డూ, దోశ!

ABOUT THE AUTHOR

...view details