తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Manasulo Maata: తనని సొంత తమ్ముడే అనుకున్నా... కానీ - Manasulo Maata latest

Manasulo Maata: వాడికి గ్యాడ్జెట్స్‌ అంటే ఇష్టం. తన పుట్టినరోజుకి ఖరీదైన స్మార్ట్‌వాచీని బహుమతిగా ఇచ్చా. వాడికి సినిమాలు, వెబ్‌సిరీస్‌లంటే పిచ్చి. నెట్‌ఫ్లిక్స్‌, ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌.. సబ్‌స్క్రిప్షన్‌ అయిపోయిన ప్రతిసారీ నేనే రీఛార్జ్‌ చేసేదాన్ని. కొన్నిసార్లు వాడికి గారంగా గోరుముద్దలు కూడా తినిపించా. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా తనని సొంత తమ్ముడే అనుకున్నా. ఇవన్నీ వాడిపై నాకెంత అభిమానమో చెప్పడానికే! కానీ.. తనేం చేశాడు?

Manasulo Maata
Manasulo Maata

By

Published : Jan 29, 2022, 9:40 AM IST

Manasulo Maata: బీటెక్‌ పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమొచ్చింది నాకు. ఆఫీసు దగ్గర్లో హాస్టళ్లో చేరా. కానీ అక్కడి వాతావరణం నచ్చలేదు. సింగిల్‌ బెడ్రూం ఫ్లాట్‌లోకి మారిపోయా. కొద్దిరోజుల్లోనే మా కింది పోర్షన్‌లో ఉండే కుటుంబానికి దగ్గరయ్యా. ఆ ఇంట్లోనే ఉండేవాడు కిరణ్‌. నాకన్నా ఆరేడు నెలలు చిన్న. బాగా సాయపడే గుణం. సరుకులు తెచ్చివ్వడం.. బిల్లులు కట్టడం.. అప్పుడప్పుడు బైక్‌పై ఆఫీసులో దిగబెట్టడం.. అన్నీ చేసేవాడు. ఓసారి నా బర్త్‌డేకి ‘అక్కా’ అంటూ విష్‌ చేశాడు. అన్నాతమ్ముళ్లు లేని నాకు ఆ పిలుపు ఎంతో సంతోషాన్నిచ్చింది. అప్పట్నుంచి తనని దేవుడిచ్చిన తమ్ముడే అనుకున్నా. అద్దె పెంచినా, ఎన్నో ఇబ్బందులున్నా.. ఎక్కడ ఆ కుటుంబాన్ని వదలాల్సి వస్తుందోనని మూడేళ్లుగా ఆ ఇంటినే అంటిపెట్టుకొని ఉన్నా.

డిసెంబర్‌ 26న నాన్న ఫోన్‌ చేశారు. నాకో సంబంధం చూశానన్నారు. వాట్సప్‌లో అబ్బాయి ఫొటో పంపారు. సిగ్గుల మొగ్గవుతూ పరుగున వెళ్లి కిరణ్‌ వాళ్లమ్మకి చూపించా. ‘అబ్బాయి బాగున్నాడు. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉంటారంది. పెళ్లి ఊహలు.. కొత్త జీవితం ఊసులతో గాల్లో తేలిపోతున్నా. కానీ కిరణ్‌ ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుతో ఆ సంతోషం మటుమాయమైంది. ఏమైందో తెలియదు.. చిన్న విషయాలకే విసుక్కునేవాడు. అకారణంగా అరిచేవాడు. ఓసారి ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పండ్లు తీసుకురమ్మన్నా. ‘నేనేమైనా నీ జీతగాడినా?’ అన్నాడు. మనసు చివుక్కుమంది. తనది మార్కెటింగ్‌ ఉద్యోగం. జాబ్‌ ఒత్తిడిలో అలా మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. తర్వాత కూడా అదే తీరు.

ఆరోజు ఆదివారం. ఏదో వెబ్‌సిరీస్‌ చూస్తున్నా. విసురుగా ఇంట్లోకొచ్చాడు. ‘కూర్చోరా.. టీ పెడతాను’ అన్నాను. పట్టించుకోలేదు. ‘నువ్వంటే నాకిష్టం. మనం పెళ్లి చేసుకుందాం.. ఏమంటావ్‌?’ విసురుగా వచ్చాయ్‌ వాడి నోటి నుంచి మాటలు. ఆ క్షణకాలం నేనేం విన్నానో అర్థం కాలేదు. అర్థమయ్యాక.. నా మెదడు చితికిపోయింది. తేరుకొని ‘ఏంటా పిచ్చి మాటలు? నీకేమైనా బుద్ధుందా? నేను నీ అక్కనురా’ అని అరిచా. వాడు తగ్గలేదు. ‘నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. నేనిక్కడ ఏడుస్తూ కూర్చోవాలా? అయినా మనమేం సొంత అక్కాతమ్ముళ్లం కాదుగా. మా ఫ్రెండ్స్‌ కూడా అదే మాటన్నారు’ కిరణ్‌ వాదనతో నా మాట పడిపోయింది. ‘ఇన్నాళ్లూ అక్కాతమ్ముళ్లలా ఉన్నాం. ఇప్పుడు.. ఇలా అంటే అది వినడానికే అసహ్యంగా ఉంది. నీ ఆలోచన తప్పు.. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్‌’ అని అనునయంగా చెప్పా.. విన్లేదు. ఆ సాయంత్రమంతా ఆలోచించాక తనకి దూరంగా వెళ్లడమే మంచిదనిపించింది. మర్నాడే గది ఖాళీ చేశా.

కిరణ్‌ అమ్మ రెండ్రోజులకోసారైనా ఫోన్‌ చేస్తోంది ఇప్పుడు. ‘రోజూ తాగొస్తున్నాడు. మాపై అరుస్తున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నువ్వైనా చెప్పమ్మా’ అంటూ బాధ పడుతోంది. ఏం చెప్పి ఆమెని ఓదార్చను? తన తీరు నన్నింకా గాయపరుస్తూనే ఉందని చెప్పనా? ఈ మూడేళ్లలో తనకి అక్కలా అభిమానం పంచానే తప్ప వేరేరకంగా ప్రవర్తించలేదు. అయినా తనెందుకిలా చేస్తున్నాడో తెలియదు. ‘ఒరేయ్‌ కిరణ్‌.. తెలిసో, తెలియకో నేను వేరేలా ప్రవర్తించి ఉంటే మన్నించు. నీ ఆలోచన మాత్రం తప్పు. నీకు సొంత అక్క ఉన్నా.. పెళ్లైతే వేరేవాళ్లింటికి వెళ్లిపోవాల్సిందే కదా.. నా అభిమానం, ఆప్యాయతే నీకు ఎల్లకాలం కావాలనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా మా ఇంటికి రావొచ్చు. మన అనుబంధం కొనసాగించొచ్చు. అంతేగానీ నీ మైండ్‌ నుంచి ఆ పాడు ఆలోచన తుడిచెయ్‌. మీ అమ్మ, చెల్లికి నువ్వంటే ప్రాణం.. వాళ్లని నీ ప్రవర్తనతో క్షోభ పెట్టకు. అర్థం చేసుకొని, మారతావని ఆశిస్తున్నా’.

- నీ శ్రేయోభిలాషి

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details