రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు.. అసలు గొడవ కంటే ఇద్దరిలో ముందు ఎవరు మాట్లాడతారనే విషయమే పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీ భాగస్వామితో మీరే ముందు మాట్లాడటానికి ప్రయత్నించండి. దీనికి కాస్త ధైర్యం కావాలి. ఒకవేళ మీకు వారితో ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఇబ్బంది అనిపిస్తే... ఒక ఫోన్‌కాల్ చేసి మాట్లాడండి. అవతలి వ్యక్తిని నొప్పించకుండా మీ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. ఇలా మాట్లాడగలిగితే మీ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.
మెసేజ్ మంచిదే..!
మీ పార్ట్‌నర్‌తో మీకు గొడవ జరిగిన తర్వాత ఒకరిపై ఒకరు కోపంగానే ఉంటారు. అది సహజం. ఆ కోపంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోడానికి ఆసక్తి చూపించుకోకపోవచ్చు. కానీ.. ఈ గ్యాప్ ఎక్కువ సమయం కొనసాగడం మీ రిలేషన్‌షిప్‌కు అంత మంచిది కాదు. అందుకే.. తప్పు ఎవరిదనే విషయం పక్కనబెట్టి మీ మనసులో భావాలను మీ భాగస్వామికి ఒక సందేశం రూపంలో మెసేజ్ చేయండి. మీకు మీ పార్ట్‌నర్ అంటే ఎంత ఇష్టమో, మీ రిలేషన్‌షిప్‌ను ఏ స్థాయిలో మీరు గౌరవిస్తున్నారనే విషయాలను ఆ సందేశంలో వివరించండి. గతంలో మీరు ఆనందంగా గడిపిన కొన్ని సందర్భాలను తనకు గుర్తు చేయండి.
సర్‌ప్రైజ్ ఇవ్వండి..!
రిలేషన్‌షిప్‌లో గొడవ జరిగిన తర్వాత.. మీ భాగస్వామికి ఏదైనా సర్‌ప్రైజ్ ఇవ్వడమనేది మీ మధ్య దూరం పెరగకుండా ఉండడానికి తారకమంత్రంలా పని చేస్తుంది. ఈక్రమంలో ఆ సర్‌ప్రైజ్ ఖరీదైనదే కానక్కర్లేదు. మీ పార్ట్‌నర్ మనసును ఆనందింపజేసే ఓ చిన్న వస్తువు.. ఏ చిన్న పనైనా సరే దాని ప్రభావం బలంగా ఉంటుంది. ఉదాహరణకు ఓ అందమైన గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం, తనకు ఇష్టమైన వంటను చేసి పెట్టడం.. మొదలైనవి అన్నమాట.