తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అవన్నీ లేకున్నా ప్రేమించిన వారితో ఆనందంగా గడపడింలా - valentines day special stories

ప్రేమ.. సృష్టిలో అత్యంత తియ్యనైనది.. మరపురానిది ఇదే.. ప్రతి బంధంలోనూ ప్రేమ ఉంటేనే అది పదిలంగా ఉంటుంది. అలాంటి అనిర్వచనీయమైన ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏటా జరుపుకుంటున్నదే ఈ 'వాలంటైన్స్‌ డే'. ఈ రోజుకు ముందున్న ఏడు రోజులకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది.. అయితే 'వాలంటైన్ వీక్' అని పిలుచుకునే ఈ వారం రోజుల గురించి చెప్పుకోవాలంటే వివిధ రకాల సర్‌ప్రైజ్‌లు, రొమాంటిక్ డేట్స్.. వంటివే గుర్తుకు రావడం సహజం. కమర్షియలైజేషన్ నేపథ్యంలో ప్రేమికుల రోజు కూడా ఓ రకంగా కృత్రిమంగా, వ్యాపార వస్తువుగా మారిపోవడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చేమో. అయితే కేవలం ఇలా పైపై మెరుగులతో కాకుండా వాలంటైన్ వీక్‌ని హృదయపూర్వకంగా, మనసుకు హత్తుకునే రీతిలో ఎలా జరుపుకోవచ్చో తెలుసుకుందాం రండి..

valentine week celebration without chocolates roses and teddy bears
అవన్నీ లేకున్నా ప్రేమించిన వారితో ఆనందంగా గడపడింలా

By

Published : Feb 13, 2021, 6:09 PM IST

వాలంటైన్ వీక్ అనగానే చాలామందికి ఎర్ర గులాబీలు, పెద్ద చాక్లెట్ బాక్సులు, పెద్ద పెద్ద టెడ్డీబేర్లు ఇవే గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ ఉన్నా లేకపోయినా ప్రేమించిన వారితో ఆనందంగా వాలంటైన్ వీక్‌ని ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం..


గులాబీలే అక్కర్లేదు!
వాలంటైన్ వీక్‌లో మొదటి రోజు రోజ్ డే.. ఈరోజు ప్రపంచంలోని ప్రేమికులందరూ తాము ఇష్టపడిన వ్యక్తికి గులాబీలను అందించి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. గులాబీల రంగు, వాటి సంఖ్య ఆధారంగా వివిధ అర్థాలు చెబుతుంటారు. అయితే గులాబీలు మాత్రమే ప్రేమకు నిదర్శనం అని ఎవరూ చెప్పలేదు. అందుకే మీకు నచ్చిన పూలను మీరు ప్రేమించిన వారికి అందించవచ్చు. అలా కాకుండా మీరు అందించిన బహుమతి వారితో ఎక్కువకాలం ఉండాలంటే రెండుమూడు రోజుల్లో వాడిపోయే పూలకంటే పూల మొక్కలను అందించడం మరీ మంచిది. అందులోనూ సులభంగా నాటుకునే మొక్కలను, పెద్దగా కష్టం లేకుండా పెరిగే వాటిని అందించడం వల్ల ఇబ్బంది పడకుండా వాటిని పెంచే వీలుంటుంది.


కొత్తగా చెబుదాం!
వాలంటైన్ వీక్‌లో రెండో రోజు ప్రపోజ్ డే. ఈరోజు ప్రేమించినవారికి తమ ప్రేమను రకరకాల మార్గాలలో తెలియజేస్తుంటారు చాలామంది. అయితే ఇప్పటికే మీరు మీ భాగస్వామికి చాలాసార్లు ప్రపోజ్ చేసి ఉంటే ఈసారి మరింత ప్రత్యేకంగా ప్రయత్నించండి. ఇందుకోసం గ్రీటింగ్‌లు, గిఫ్ట్‌లు కాకుండా మీ చేత్తోనే ఓ చిన్నపాటి కార్డ్ తయారుచేసి అందులో చక్కటి మెసేజ్ రాసి.. వారు చూసే చోట దాచి ఉంచండి. వారు దాన్ని బయటకు తీసి చదువుతుంటే వారి ఫీలింగ్స్ చూస్తూ ఆనందించవచ్చు. అసలు మీ ప్రేమ గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పారనిపిస్తే కాస్త కొత్తగా వేరే విషయాన్ని ప్రపోజ్ చేయండి. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడం గురించో.. లేక ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ గురించో అయితే బాగుంటుంది. ఉదాహరణకు 'ఫలానా ప్రదేశానికి నాకు తోడుగా వస్తావా?' అంటూ రొమాంటిక్‌గా ప్రపోజ్ చేస్తూ టికెట్లను మీ భాగస్వామి ముందు ఉంచితే వారి ముఖంలో ఆనందం చూసి తీరాల్సిందే.


చాక్లెట్లు లేకపోతే ఏంటి?
వాలంటైన్స్ డే అనగానే, ప్రత్యేకించి చాక్లెట్ డే అనగానే పెద్ద పెద్ద చాక్లెట్ బాక్సులు తెచ్చి మీకు నచ్చినవారికి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. ఈ సమయంలో వీటి ధర ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు.. మీ భాగస్వామికి అవి పెద్దగా ఇష్టం లేకపోతే వృథా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు.. ప్రతి విషయానికీ ఆరోగ్యంతో లింక్ పెడుతున్న ఈరోజుల్లో పెద్ద పెద్ద బాక్సుల నిండా చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్యానికి జరిగే హాని గురించి కూడా ఆలోచించాల్సిందే. అందుకే మీ భాగస్వామికి ఇష్టమైన లేదా వారికి ఆరోగ్యకరమైన వస్తువులను ఈ సందర్భంగా అందించడం మంచిది. ఉదాహరణకు మీ భాగస్వామికి బిర్యానీ అంటే ప్రాణం అనుకోండి.. చాక్లెట్లకు బదులు వారికోసం ప్రత్యేకంగా బిర్యానీ ఆర్డర్ చేయండి. లేదా మీరే స్వయంగా వండి పెట్టండి. దీనివల్ల వారికి నచ్చిన ఆహారాన్ని మీరు అందించినట్లుంటుంది. ప్రత్యేకంగా ఆరోజును సెలబ్రేట్ చేసుకున్నట్లూ ఉంటుంది. వారి ఆరోగ్యం గురించి మీకు శ్రద్ధ ఎక్కువనుకుంటే ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్స్ లేదా పండ్లను అందించవచ్చు. ఉదాహరణకు స్ట్రాబెర్రీలను చక్కటి బౌల్ లో అమర్చి మీ భాగస్వామికి అందిస్తే చూసేందుకు అందంగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికీ మంచిది కూడా.


మాట రాని బొమ్మలెందుకు?
సంప్రదాయబద్ధంగా టెడ్డీ డేను సెలబ్రేట్ చేసుకోవాలంటే మీ భాగస్వామికి ఓ మంచి టెడ్డీబేర్ కొని బహుమతిగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇలా ప్రతి ఏడాదీ చేయడం వల్ల డబ్బు వృథాతో పాటు ఇంట్లో బొమ్మలు ఎక్కువైపోవడం, దుమ్ము పట్టి పాడైపోవడం తప్ప మరే ఉపయోగం ఉండదు. అందుకే ఈ రోజున మీ భాగస్వామి కోసం వేరే ఏదైనా ప్రత్యేకమైనది కొనండి. టెడ్డీబేర్‌కి బదులుగా చక్కటి పప్పీ లేదా చిన్న పిల్లి పిల్లను లేక వారికి ఇష్టమైన మరేదైనా పెంపుడు జంతువును వారికి బహుమతిగా అందించవచ్చు. మాట్లాడలేని బొమ్మ కంటే ఆనందాన్ని పంచే పెంపుడు జంతువులను అందించడం చక్కటి మార్గం. ఒకవేళ మీ భాగస్వామికి లేదా మీకు పెంపుడు జంతువులంటే పెద్దగా ఇష్టం లేకపోతే అలా టెడ్డీబేర్ కొనడానికి కేటాయించిన డబ్బును మీ పిల్లల కోసం పొదుపు చేసేయండి. భవిష్యత్తులో వారికి అవి ఉపయోగపడతాయి.


అలా ప్రమాణం చేద్దాం!
జీవితాంతం ఒకరికి ఒకరు తోడుంటామని, కలిమిలేముల్లో, కష్టసుఖాల్లో ఒకరి తోడు మరొకరు వదలబోమని జంటలు ప్రమాణం చేసుకునే రోజు ప్రామిస్ డే. అయితే ఈ ప్రమాణాలు మనం ఎప్పటికీ నిలబెట్టుకుంటామన్న గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. అందుకే మనం ఉన్నా లేకపోయినా.. మన వంతుగా వారికి ఆర్థికంగా సాయం చేసేందుకు జీవిత బీమాను తీసుకొని ఈ ప్రమాణాన్ని నిజం చేయడానికి ఈరోజు ప్రయత్నించాలి. అంతేకాదు.. ఎప్పుడూ ఇలాంటి ప్రమాణాలే కాకుండా కాస్త విభిన్నంగా కూడా ప్రామిస్‌లు చేస్తూ ఉంటేనే బంధంలో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. అందుకే ఈ ప్రామిస్ డేకి మీ మనసైన వారికోసం మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని ప్రమాణం చేయండి. వారికోసం ఫలానా స్థాయికి చేరుకుంటానని, లేదా ఫలానా వస్తువు కొంటానని ప్రమాణం చేయండి. ఇలా ప్రామిస్‌లు చేస్తే వాటిని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువంటారు నిపుణులు. అందుకే ఇలాంటి కొత్త ప్రమాణాలు చేసి.. వాటిని నిలబెట్టుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి..


ఇవి ఎప్పుడూ కావాల్సిందే!
ప్రపంచంలో ఖర్చులేకుండా ఇతరులను ఆనందపరిచేది ప్రశంసేనని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రశంసలు మీరెప్పుడైనా మీ భాగస్వామికి అందించారా? ఒకవేళ లేకపోతే ఈ రోజు ప్రయత్నించండి. అలాగే 'హగ్ డే' రోజున మీ మనసైన వారిని గట్టిగా హత్తుకుని వారు మీ జీవితంలో ఉండడం వల్ల మీరు ఎంత ఆనందంగా ఉంటున్నారో వివరించండి. అంతకంటే ఆనందాన్ని పంచే విషయమేముంటుంది.. అలాగే 'కిస్ డే' రోజున చక్కటి ముద్దు కూడా.. మీ మనసులోని ప్రేమనంతా అది వ్యక్తం చేస్తుంది. అయితే మీ భాగస్వామికి ఇష్టమైతేనే ఇలాంటివి చేయాలని మాత్రం మర్చిపోవద్దు..


మీరిద్దరే!
ఆఖరుగా.. ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డేకి చేరుకున్నాం.. సాధారణంగా ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన టూర్లు, క్యాండిల్ లైట్ డిన్నర్లు ఈరోజు ప్రత్యేకంగా చేస్తుంటారు చాలామంది. కానీ ఇవన్నీ చేస్తేనే మనసులో ప్రేమ ఉన్నట్లు కాదు.. మన ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి, దాన్ని చాటుకోవడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. మనల్ని ప్రేమించేవారు మన నుంచి కోరుకునేది సమయం మాత్రమే.. అంతకంటే ఖరీదైన బహుమతిని మనం వారికి కావాలన్నా అందించలేం. ఎందుకంటే ఏది పోయినా దాన్ని తిరిగి సంపాదించి అందించవచ్చు. కానీ కోల్పోయిన సమయాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం. అందుకే ఈరోజు మాత్రం ప్రపంచంతో సంబంధం లేకుండా మీరిద్దరే అన్నట్లు గడపండి. సమయం గడపడం అంటే ఇద్దరూ కలిసి ఇంట్లో ఉంటూ టీవీ చూడడం, లేదా ఎవరి ఫోన్లో వాళ్లు బిజీగా గడపడం కాదు.. ఆరోజు పని ఒత్తిడిని పూర్తిగా పక్కకి తోసేసి, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇద్దరే గడపండి. గ్యాడ్జెట్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఆ రోజును గడుపుతూ ఒకరితో ఒకరు వీలున్నంతగా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి బంధం మరింత దృఢమవుతుంది.

ఇవీ చూడండి:ఐ లవ్యూ అని చెప్పడం కామన్.. సో థింక్ డిఫరెంట్

ABOUT THE AUTHOR

...view details